Magazines

తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలి

1 గంట క్రితం

The Centre should cooperate with Telangana's projects.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 2 నిమిషాల చదవడం

ఎల్‌‌బీనగర్‌-హయత్‌‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌‌ను మంజూరు చేయాలి
ఎన్‌‌హెచ్‌-65‌ను 8 లైన్లకు విస్తరణ చేపట్టాలి :
చింతన్‌ శివిర్‌‌లో నితిన్‌ గడ్కరీని కోరిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని మరింత పెంచడం, హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడం, రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం, ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేసేలా పలు కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సహకారం అందించాలని కేంద్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి కోరారు. గుజరాత్‌ రాష్ట్రం నర్మదా జిల్లాలోని ఎక్తానగర్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాంగణంలో చింతన్‌ శివిర్‌–2026ను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో కలిసి ప్రారంభించారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి కోమటి రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌ తూర్పు ప్రాంతంలో ట్రాఫిక్‌ ‌రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎల్‌బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర డబుల్‌ డెక్కర్‌ విధానంలో ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మించాలని కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి కోరారు. ఇప్పటికే ఎన్‌హెచ్‌-65లో ఎల్‌బీనగర్‌–మల్కాపూర్‌ సెక్షన్‌ను సర్వీస్‌ రోడ్లతో సహా ఆరు లైన్లుగా అభివృద్ధి చేసేందుకు రూ.545 కోట్లతో కేంద్రం అనుమతులు ఇచ్చిందని తెలిపారు. మెట్రోతో సమన్వయం ఉండేలా హయత్‌‌నగర్‌ ‌వరకు డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌కు 2026–27 వార్షిక ప్రణాళికలో చోటు కల్పించి మంజూరు చేయాలని కోరారు.తెలంగాణలో పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేందుకు పార్వతమాల పథకం కింద రూ.1,230 కోట్ల అంచనా వ్యయంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, నల్లగొండ హనుమాన్‌ హిల్‌, నాగార్జునసాగర్‌–నాగార్జునకొండ, పెద్దపల్లి జిల్లా మంథని రామగిరి కోట, నిజామాబాద్‌ కిల్లా రామాలయం ప్రాంతాల్లో ఐదు రోప్‌‌వేలకు అనుమతులివ్వాలని విన్నవించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం బైపాస్‌ వద్ద నాలుగు లైన్ల ఆర్వోబీ, పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్‌ వద్ద రెండు లైన్ల ఆర్వోబీ నల్లగొండ జిల్లాలో పగిడిపల్లి–నడికుడి రైల్వే సెక్షన్‌లో నాలుగు లైన్ల ఆర్వోబీ నిర్మాణ ప్రతిపాదనలను కేంద్రం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను కలిపే హైదరాబాద్‌ – విజయవాడ –మచిలీపట్నం ఎన్‌‌హెచ్‌-65ను ఆరు+ రెండు లైన్లుగా విస్తరించే ప్రాజెక్టును వేగవంతం చేయాలని విన్నవించారు. హైదరాబాద్‌ – శ్రీశైలం ఎన్‌‌హెచ్‌-765లో టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతంలో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి మంజూరు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సీఆర్‌ఐఎఫ్‌ పథకం కింద తెలంగాణలోని 511.68 కిలోమీటర్ల 33 రహదారి అభివృద్ధి పనులకు రూ.1,227.75 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు.ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం161.51 కిలోమీటర్లకి సంబంధించి భూసేకరణ వ్యయంలో 50 శాతం భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పటికే 90 శాతానికి పైగా భూములకు అవార్డులు ఆమోదమయ్యాయ‌నీ, ఎన్‌‌హెచ్‌ఏఐ టెండర్లు కూడా ఆహ్వానించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా ఆర్థిక, క్యాబినెట్‌ ఆమోదం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. భారత్ ఫ్యూచర్‌ సిటీ, పారిశ్రామిక పార్కులు, రేడియల్‌ రోడ్లు తదితర భవిష్యత్‌ మౌలిక వసతులకు ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ ‌భాగం కీలకంగా మారుతుందని వివరించారు. ఉత్తర భాగంతోపాటే దాని పనులు కూడా జరిగేలా చూడాలని కోరారు. హైదరాబాద్‌–అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే డీపీఆర్‌ ప్రక్రియను వేగవంతం చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని విన్నవించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వేను తెలంగాణలోని డ్రైపోర్టుతో అనుసంధానం చేయడం ద్వారా సరుకు రవాణా సులభతరమవుతుందనీ, ఆర్థిక కార్యకలాపాలు, పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తుల పట్ల నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు.మంత్రి కోమటిరెడ్డి వెంట ఆర్అండ్‌‌బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, చీఫ్ ఇంజినీర్లు బి.వి రావు, ధర్మారెడ్డి, వసంత్ నాయక్ పలువురు అధికారులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్