నిత్యావసరాల ధరల
నియంత్రణపై చేతులెత్తేసిన ప్రభుత్వం
తగిన చర్యలు తీసుకోవాలి :
మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో హైదరాబాద్
సన్నబియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయనీ, రేవంత్ సర్కార్ నేల చూపులుచూస్తున్నదని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌రావు విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. సామాన్యుడిపై పెనుభారం పడుతుంటే పౌరసరఫరాల శాఖ మొద్దు నిద్రలో ఉందని విమర్శించారు. ధరల పెరుగుదలపై వెంటనే సమీక్ష నిర్వహించి నియంత్రణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిత్యావసరాల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తుంటే ధరలకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దారుణమని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, పర్యవేక్షణ వైఫల్యానికి సామాన్య ప్రజలే మూల్యం చెల్లిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సన్నబియ్యం ధరలు కేవలం నాలుగు నెలల్లోనే 25 శాతం పెరగడం ప్రభుత్వానికి నిపించడం లేదా అని ప్రశ్నించారు.బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత, అధిక మార్జిన్లపై తక్షణం తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నబియ్యం సహా నిత్యావసరాల ధరలకు వెంటనే అడ్డుకట్ట వేసి, సామాన్యుడిపై పడుతున్న భారం నుంచి ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆకాశాన్ని అంటుతున్న బియ్యం ధరలు
34 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)