ఆహార భద్రతా చట్టాన్ని పటిష్టం చేయాలి
ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
సివిల్ సప్లై ఆఫీస్ ఎదుట నిరసన
నవతెలంగాణ-సిటీబ్యూరో
‘‘నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఈ క్రమంలో దసరా, దీపావళి పండుగల సందర్భంగా రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతోపాటు 14 రకాల నిత్యావసర సరుకులను సబ్సిడీపై పంపిణీ చేయాలి..’’ అని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని సివిల్ సప్లై ఆఫీస్ ఎదుట బుధవారం ఐద్వా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్.అరుణ జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మల్లు లక్ష్మి ప్రసంగించారు.
కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రతా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని ఐద్వా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోందని గుర్తు చేశారు. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారాయని, ముఖ్యంగా పేద కుటుంబాలు రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పండుగల సమయంలో పేదలపై అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
బియ్యంతోపాటు చక్కెర, గోధుమలు, వంటనూనె ప్యాకెట్లు, ఉల్లిగడ్డలు, చింతపండు తదితర 14 రకాల నిత్యావసర సరుకులను రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ ధరలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 15-49 ఏండ్ల వయసు గల మహిళల్లో 57.6 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని తెలిపారు. ఆరేండ్లలోపు పిల్లల్లో పోషక ఆహారం లోపం వల్ల వయసుకు తగిన ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. మహిళల ఆరోగ్యం, పిల్లల పోషక ఆహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారని వివరించారు. అదే తరహాలో రాష్ట్రంలోనూ సరుకులు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.నాగలక్ష్మి, వై.వరలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శశికళ, ఎం.వినోద, నాయకులు భారతి, కవిత తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)