నాలుగు రోజుల్లోనే రూ.755.14 కోట్ల ఆదాయం
గత రికార్డు బ్రేక్ 19 రోజుల్లో రూ. 2 వేల కోట్ల మార్క్ దాటిన అమ్మకాలు
నవతెలంగాణ- సిటీబ్యూరో/సిద్దిపేట
దసరా సందర్భంగా రాష్ట్రంలో మద్యం అమ్మకా లు భారీగా నమోదయ్యాయి. నాలుగు రోజుల్లోనే రూ.755.14 కోట్ల విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 19న రూ.303.40 కోట్లు, 14న రూ.102.17 కోట్లు, 16న రూ.126.32 కోట్లు, 17న రూ.223.25 కోట్ల అమ్మకాలు జరిగాయన్నారు. ఈ నాలుగు రోజుల్లో 6,83,000 కేసుల లిక్కర్, 10,44,000 కేసుల బీర్ అమ్ముడైంది. గత దసరా అమ్మకాలు(రూ.698 కోట్ల) రికార్డు బ్రేక్ అయింది. అయితే అక్టోబర్ 1 నుంచి 19వ తేదీ వరకు మొత్తం మద్యం అమ్మకాలు రూ.2.054.51 కోట్లు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
సిద్దిపేటలో ఒక్కరోజే రూ. 15.61 కోట్ల అమ్మకాలు ఈ నెల 19న సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. లిక్కర్ 11,329 కేసులు, బీర్ 29,756 కేసులు అమ్ముడు పోగా మొత్తం రూ. 15,61,64,671.18 (సుమారు రూ.15.61 కోట్లు) వ్యాపారం జరిగింది.
పెరిగిన మద్యం విక్రయాలు
దసరా పండుగ సందడితో రాష్ట్రంలో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. అక్టోబరు నెలలో కేవలం 19 రోజుల్లోనే మద్యం విక్రయాలు రూ. 2వేల కోట్ల మార్కును దాటాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ కాలంలో మద్యం సరఫరా 37.02 శాతం పెరిగింది. పండుగ నేపథ్యంలో రిటైలర్లు నిల్వలను పెంచుకోవడంతో, బీర్ల విక్రయాలు ఏకంగా 41 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
తెలంగాణ ఎక్సైజ్ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం... అక్టోబరు 1 నుంచి 19వ తేదీ వరకు డిపోల ద్వారా రూ.2,054.51 కోట్ల విలువైన మద్యం సరఫరా జరిగింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.1,499.46 కోట్ల విలువైన మద్యం సరఫరా కాగా, ఈసారి అదనంగా రూ.555.05 కోట్ల మేర విక్రయాలు పెరిగాయి.
ముఖ్యంగా దసరా పండుగకు నాలుగు రోజుల ముందు ఈ అమ్మకాలు భారీగా పెరిగాయి. అక్టోబరు 19న ఒక్కరోజే రూ.303.40 కోట్ల విలువైన మద్యం అమ్ముడవగా, గత ఏడాది ఇదే తేదీన కేవలం రూ.33.64 కోట్ల విక్రయాలు మాత్రమే జరిగాయి. ఇది 801.90 శాతం వృద్ధిగా కనిపిస్తున్నప్పటికీ, రెండు సంవత్సరాల మధ్య పండుగ తేదీలలో ఉన్న వ్యత్యాసాలు కూడా దీనికి ఒక కారణం.అక్టోబరు 19న సరఫరా అయిన ‘ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్’ (ఐఎంఎఫ్ఎల్ ) పరిమాణం 2.72 లక్షల కేసులకు చేరుకోగా, గత ఏడాది ఇదే రోజున 0.30 లక్షల కేసులు మాత్రమే సరఫరా అయ్యాయి. అలాగే, బీర్ల సరఫరా 4.25 లక్షల కేసులుగా నమోదైంది. గత ఏడాది ఇదే తేదీన ఇది 0.52 లక్షల కేసులుగా ఉంది.
పండుగ డిమాండ్‌తో భారీ పెరుగుదల
ఈ ఏడాది అక్టోబరు 1న డిపోల ద్వారా రూ.41.14 కోట్ల విలువైన మద్యం సరఫరా జరిగింది. ఇది గత ఏడాది ఇదే తేదీన నమోదైన రూ.86.23 కోట్లతో పోలిస్తే 52.29 శాతం తక్కువ. అయితే, అక్టోబరు 3 నాటికి విక్రయాలు పెరిగి రూ.144.10 కోట్లకు చేరుకున్నాయి.
ఈ ఏడాది అక్టోబర్ 5న, మద్యం సరఫరా విలువ రూ.176.43 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే రోజున ఇది రూ.50.21 కోట్లుగా ఉంది, అంటే 251.38 శాతం వృద్ధి నమోదైంది. ఆ తర్వాత, అక్టోబర్ 6న రూ.104.43 కోట్లు, అక్టోబర్ 7న రూ. 84.27 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది.నెల ద్వితీయార్థంలో ఈ పెరుగుదల మరింత స్పష్టంగా కనిపించింది. అక్టోబర్ 16న అమ్మకాలు రూ.126.32 కోట్లకు చేరుకోగా, గత ఏడాది ఇదే రోజున ఇవి రూ. 68.93 కోట్లుగా ఉన్నాయి. అంటే 83.26 శాతం వృద్ధి నమోదైంది.
మరుసటి రోజు, అక్టోబర్ 17న, డిపోల ద్వారా రూ.223.25 కోట్ల విలువైన మద్యం సరఫరా జరిగింది. గత ఏడాది ఇదే తేదీన ఇది రూ.89.28 కోట్లుగా ఉండగా, ఈసారి 150.06 శాతం వృద్ధి నమోదైంది.అక్టోబర్ 19 నాటికి, ఒక్క రోజు అమ్మకాల విలువ రూ.303.40 కోట్లకు పెరగడంతో, మొత్తం అమ్మకాలు రూ. 2 వేల కోట్ల మార్కును దాటాయి.
బీర్ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి
అక్టోబర్ మొదటి 19 రోజుల్లో మద్యం సరఫరా విలువ 37.02 శాతం పెరగగా, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎమ్ఎఫ్ఎల్ ) పోలిస్తే బీర్ అమ్మకాలు మరింత వేగంగా పెరిగాయి. ఈ కాలంలో ఐఎమ్ఎఫ్ఎల్ సరఫరా 18.38 లక్షల కేసులకు చేరుకోగా, గత ఏడాది ఇది 14.16 లక్షల కేసులుగా ఉంది (29.80 శాతం వృద్ధి). అదే సమయంలో, బీర్ సరఫరా 21.55 లక్షల కేసుల నుంచి 30.37 లక్షల కేసులకు పెరిగి, 40.93 శాతం వృద్ధిని నమోదు చేసింది.
అక్టోబర్ 7 నాటికి, అమ్మకాలు రూ. 550.37 కోట్లుగా ఉన్నాయి. ఇది గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ. 549.38 కోట్ల కంటే స్వల్పంగా మాత్రమే ఎక్కువ; అంటే కేవలం 0.18 శాతం వృద్ధిని మాత్రమే సూచిస్తోంది. అక్టోబర్ 16 నాటికి, మొత్తం అమ్మకాలు రూ.1,527.85 కోట్లకు చేరుకున్నాయి, ఇది గత ఏడాదితో పోలిస్తే 24.99 శాతం పెరుగుదల. అక్టోబర్ 17 నాటికి ఈ సంఖ్య రూ.1,751.07 కోట్లకు పెరగగా, గత ఏడాదితో పోలిస్తే వృద్ధి రేటు 33.50శాతానికి చేరుకుంది. అయితే ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కాస్త...పేదల జీవితాలను గుల్ల చేసి మరీ ఖజానా నింపుకుంటుందని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి.







కామెంట్లు (0)