Magazines

సంస్కృతి పరిరక్షణతో పాటే మహిళా హక్కుల సాధన

4 గంటల క్రితం

Achieving women's rights
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 2 నిమిషాల చదవడం

‘నవతెలంగాణ’ ఆధ్వర్యంలో ఎంహెచ్ భవన్‌లో బతుకమ్మ సంబురాలు

పర్యావరణాన్ని, ఆడబిడ్డలను కాపాడుకోవడమే పండుగ ఉద్దేశం : ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి

బతుకమ్మను ప్రజల చెంతకు చేర్చింది ప్రజా ఉద్యమాలే.. : ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి


నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ పూల వేడుక మాత్రమే కాదని, గడీల సంకెళ్లు తెంచుకొని బహుజన మహిళల ఆత్మగౌరవాన్ని చాటిన చారిత్రక ఉద్యమ రూపమని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో స్త్రీలు రాణిస్తున్నా.. మరోవైపు సమా జంలో మహిళలకు కనీస రక్షణ కరువైందని, అన్యాయా లను ఎదిరించడానికి వీరవనితల స్ఫూర్తితో ఉద్యమించా ల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘నవతెలంగాణ’ దిన పత్రిక ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంహెచ్ భవన్ వేదికగా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. సంస్థ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. అంతకుముందు ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. ఒకప్పుడు తెలంగాణలో బతుకమ్మ పండుగ కేవలం భూస్వాముల గడీలు, నవాబులు, రాజుల ప్రాంగణా లకే పరిమితమై ఉండేదని చెప్పారు. ఆనాడు పేద, దళిత, వెనుకబడిన తరగతుల స్త్రీలు బతుకమ్మ ఆడటానికి ప్రయత్నిస్తే భూస్వాములు అడ్డుకున్నారని, ఆ సమయంలో ఆంధ్ర మహాసభ పిలుపునిచ్చి బతుకమ్మను ఒక ప్రభావిత ప్రజా ఉద్యమంగా మలిచి గడీల నుంచి ఊరూరా దళిత, బహుజన వర్గాల ప్రజల చెంతకు చేర్చిందని వివరించారు. నేటికీ సమాజంలో మహిళల పరిస్థితి అత్యంత దయనీ యంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి 16 నిమిషాలకు ఒక మహిళపై లైంగిక దాడి జరుగు తోందని, 2024 నాటి గణాంకాల ప్రకారం 4.41 లక్షల మంది మహిళలపై హింస, దాడులు నమోదయ్యాయని వివరించారు.

రాష్ట్రంలో భరోసా కేంద్రాలు, షీ టీమ్స్ ఉన్నప్పటికీ మహిళలకు ఇండ్లలో, పని ప్రదేశాల్లో, వీధుల్లో రక్షణ కరువైందన్నారు. సావిత్రిబాయి ఫూలే, చిట్యాల ఐలమ్మ వంటి వీరవనితల త్యాగాలను స్మరిస్తూ.. చట్టసభల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం, విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం లభించే వరకు ఐద్వా చేస్తున్న హక్కుల పోరాటంలో అందరూ కలిసి నడవాలని పిలుపునిచ్చారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ పుట్టుక వెనుక ‘బతకాలి’ అన్న ఆకాంక్ష ఉందని, ఆడపిల్లను కాపాడుకోవాలనే తపనతోనే ఈ పండుగ ఆవిర్భవించిందని తెలిపారు. ఆనాడు మసూచి, కలరా వంటి అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఔషధ గుణాలున్న తీరొక్క పూలతో చెరువులను శుభ్రపరిచే సంప్రదాయం ఉండేదని, కానీ నేడు కృత్రిమ రంగులు, ప్లాస్టిక్‌తో పర్యావరణాన్ని కలుషితం చేయడం బాధాకరమ న్నారు. రసాయనాల వినియోగాన్ని మాని, ప్రకృతి సహజ సిద్ధమైన పూలతో పండుగలు జరుపుకోవాలని సూచిం చారు. మహిషాసురుడిని వధించిన దుర్గాదేవి తరహాలోనే.. సమాజంలో మహిళలపై, యువతపై జరుగుతున్న అణచి వేతలపై స్త్రీలు పోరాటపటిమ ప్రదర్శించాలని కోరారు. ఓటు హక్కును కాపాడుకుంటూ, మన బిడ్డల భవిష్యత్‌ కోసం జరిగే ప్రతి పోరాటాని‌కీ బాసటగా నిలవాలన్నారు. ఈ వేడుకల్లో హెచ్‌ఆర్‌ జనరల్‌ ‌మేనేజర్లు ‌నరేందర్‌‌ రెడ్డి, శశి, మొఫసిల్‌ ఇన్‌‌చార్జి వేణుమాధవ్‌, బోర్డు సభ్యులు సలీమా, ‌ మేనేజర్లు వీరయ్య, రేణుక, టీడబ్ల్యూజేఫ్‌ ‌రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


ఆకట్టుకున్న బతుకమ్మ ఆటాపాట
ఈ వేడుకల్లో భాగంగా నవతెలంగాణ దినపత్రిక మహిళా జర్నలిస్టులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దారు. ఉద్యోగినులంతా ఉద్యమ గీతాలు, జానపద బతుకమ్మ పాటలతో ఆడిపాడారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్