పెట్టుబడులకు భరోసా కల్పిస్తాం : బ్రిటన్ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణలో పెట్టే పెట్టుబడులకు పూర్తి భరోసా కల్పిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి బ్రిటన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరవ్వాలని ఆహ్వానించారు. రాష్ర్టంలో ప్రభుత్వ విధానాలు స్థిరంగా కొనసాగుతాయనీ, దానివల్ల పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయని చెప్పారు. బుధవారం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో బ్రిటన్‌లోని యార్క్‌షైర్ ప్రాంతానికి చెందిన మేయర్ల నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం సీఎంతో సమావేశమైంది. సౌత్ యార్క్‌షైర్ మేయర్ ఆలివర్ కాపార్డ్, యార్క్ అండ్ నార్త్ యార్క్‌షైర్ మేయర్ డేవిడ్ స్కైత్, వెస్ట్ యార్క్‌షైర్ మేయర్ ట్రేసీ బ్రాబిన్ ఈ బృందానికి నాయకత్వం వహించారు. ఇటీవల భారత్–బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) నేపథ్యంలో తెలంగాణతో వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, విద్య, సాంస్కృతిక రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ర్టంలో ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, రక్షణ, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక 'తెలంగాణ రైజింగ్–2047' గురించి ముఖ్యమంత్రి వివరించారు. 2025 డిసెంబర్లో ఆవిష్కరించిన ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ నాలెడ్జ్ పార్ట్నర్గా కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.
అంతర్జాతీయ నాయకులు, ప్రముఖ ఆర్థికవేత్తలు, సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తల సూచనలతో ఈ అభివృద్ధి ప్రణాళిక రూపొందిందని తెలిపారు.యకృత్రిమ మేధ (ఏఐ) విస్తరిస్తున్న నేపథ్యంలో యువతకు ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ప్రముఖ కంపెనీల ప్రత్యక్ష భాగస్వామ్యంతో యువతకు శిక్షణ ఇచ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్, మూసీ నది పునరుజ్జీవం ద్వారా హైదరాబాద్‌లో రివర్‌ఫ్రంట్ ఎకానమీ, నైట్ ఎకానమీని అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ ప్రణాళికను వివరించారు. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రతినిధులు రాష్ర్టంలో అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, వైద్య ఆరోగ్యం, డిజిటల్ టెక్నాలజీ, రక్షణ, ఏరోస్పేస్, టెక్నికల్ టెక్స్టైల్స్, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యాన్ని ప్రత్యక్ష వాణిజ్య ఒప్పందాలు, పెట్టుబడులు, విద్యా సంస్థల మధ్య సహకారంగా మార్చేందుకు త్వరలో మరోసారి తెలంగాణలో పర్యటిస్తామన్నారు. సౌత్ యార్క్‌షైర్ మేయర్ ఆలివర్ కాపార్డ్, వెస్ట్ యార్క్‌షైర్ మేయర్ ట్రేసీ బ్రాబిన్ తదితరులు మాట్లాడారు. అంతకుముందు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బ్రిటన్ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం యూకే–ఇండియా బిజినెస్ కౌన్సిల్ రూపొందించిన నివేదికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూకే–ఇండియా బిజినెస్ కౌన్సిల్ సీఈవో కిషోర్ జయరామన్, హైదరాబాద్ బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ ప్రతినిధులు, కె. రామకృష్ణారావు, ముఖ్యమంత్రి సలహాదారు సంజయ్ జాజు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)