గ్యారంటీలకు ‘గ్రీన్ ఛానెల్’
పేరుకుపోతున్న పెండింగ్ బిల్లులు..
మౌలిక వసతుల కల్పనకు కటకట!
నవతెలంగాణ - హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, కొన్ని అత్యవసర విభాగాలకు నిధుల కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘గ్రీన్ ఛానెల్’ విధానం ఇప్పుడు ట్రెజరీల్లో నిధుల సమతుల్యతను శాసిస్తోంది. ఆర్థిక శాఖ ప్రత్యేక అనుమతులు (ట్రెజరీ క్లియరెన్స్) లేకుండా, బిల్లులు రాగానే నేరుగా నిధులు విడుదల చేసే ఈ రూట్ వల్ల ప్రాధాన్యతా రంగాలు లబ్దిపొందుతుంటే, సాధారణ బిల్లులు, ఉద్యోగుల పాత బకాయిలు నెలల తరబడి నిలిచిపోతున్నాయి. రూ. 3.24 లక్షల కోట్ల భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ, ప్రతి నెలా ఒకటో తారీఖున జీతాల చెల్లింపునకు బ్రేకులు పడటానికి ఈ నిధుల ‘లాకింగ్’ విధానమే ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
‘గ్రీన్ ఛానెల్’ అంటే...
ఆర్థిక పరిభాషలో ‘గ్రీన్ ఛానెల్’ అంటే ఎలాంటి ఆంక్షలు, ట్రెజరీ క్లియరెన్స్ నిబంధనలు లేకుండా నిధులను నేరుగా విడుదల చేయడం. సాధారణంగా అత్యవసర పరిస్థితులు లేదా ప్రభుత్వం అత్యంత ప్రతి ష్టాత్మకంగా భావించే పథకాలకు ఈ వెసులు బాటు కల్పిస్తారు. ప్రస్తుత ప్రభుత్వం తన ‘ఆరు గ్యారంటీలను’ నిరంతరాయంగా అమలు చేయడానికి వాటికి ‘గ్రీన్ ఛానెల్’ హోదా ఇ చ్చింది. అంటే ట్రెజరీలో నిధుల కొరత ఉన్నా, ఈ పథకాల బిల్లులను ఆపడానికి వీల్లేదు.
డైలమాలో ట్రెజరీ
గ్రీన్ ఛానల్ ద్వారా ప్రయోజనాలు ఉన్నా, మెజారిటీ నిధులు వాటికే వెళ్లడంతో ఇతర బిల్లులు పెండింగ్లో పడిపోతున్నాయి. రాష్ట్ర ఖజానా ఆదాయానికి గ్రీన్ ఛానెల్ సవాలు విసురుతున్నదని ఆర్థికరంగ నిపుణు లు చెప్తున్నారు. రాష్ట్ర సగటు నెలవారీ సొంత ఆదాయం (జీఎస్టీ, వ్యాట్, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ ద్వారా) సుమారు రూ. 14 వేల కోట్లు. ఇందులో గ్రీన్ ఛానెల్ ఫిక్స్డ్ బిల్లుల కోసం ప్రతి నెలా సుమారు రూ. 3,800 కోట్లు (27 శాతం) ముందే లాక్ అయిపోతున్నాయి.
జీతాలు, పెన్షన్ల భారం
రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల నెలవారీ ఖర్చు దాదాపు రూ. 3,500 కోట్ల నుంచి రూ. 4 వేల కోట్ల వరకు ఉంది. గ్రీన్ ఛానెల్ నిధులు పోగా, మిగిలిన నిధులతో ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా జీతాలు వేయడం కత్తిమీద సాములా మారింది. అందుకే విడతల వారీగా జిల్లాలను బట్టి 5 నుండి 15వ తారీఖు మధ్య జీతాలు క్లియర్ అవుతున్నాయని ఆర్థికశాఖ ముఖ్య అధికారి ఒకరు తెలిపారు.
మౌలిక వసతులపై ప్రభావం
ప్రభుత్వం సంక్షేమ గ్యారంటీల విషయంలో ప్రజలకు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ‘గ్రీన్ ఛానెల్’ రక్షణ కవచంలా పనిచేస్తుంది. కానీ నెలకు వచ్చే రూ. 14 వేల కోట్ల సొంత ఆదాయంలో గ్రీన్ ఛానెల్ స్కీమ్లు, ఉద్యోగుల జీతాలు, పాత అప్పుల వడ్డీలకే దాదాపు రూ. 9,500 కోట్లు (67శాతం) ఖర్చయిపోతున్నాయి. మిగిలిన నిధులతో రాష్ట్ర మౌలిక వసతుల కల్పన, పాత బిల్లుల క్లియరెన్స్ చేయాల్సి రావడం కత్తిమీద సాములా మారింది. ఫలితంగా సంక్షేమం - అభివృద్ధి మధ్య సమతుల్యత లోపిస్తున్నదని రాజకీయ, ఆర్థికరంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
‘గ్రీన్ ఛానెల్’లోని స్కీమ్లు
ప్రస్తుత ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో పాటు కొన్ని కీలక పరిపాలనా విభాగాలను గ్రీన్ ఛానెల్లోకి చేర్చింది. మహాలక్ష్మి పథకం (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) కింద ఏటా దాదాపు రూ. 3,500 కోట్లు (ఆర్టీసీకి రీయింబర్స్మెంట్) గృహజ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్)కి రూ. 2,080 కోట్లు (డిస్కంలకు సబ్సిడీ చెల్లింపులు) రైతు భరోసా, సన్న వడ్లకు రూ. 500 బోనస్ కోసం రూ. 23,179 కోట్లు ఇందిరమ్మ ఇండ్లు, ఫ్యామిలీ ఇన్సూరెన్స్కు దాదాపు రూ. 7,500 కోట్లు పంచాయతీ రాజ్, సెర్ప్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలకు ప్రతినెలా రూ.115 కోట్లు..సంవత్సరానికి రూ.1,380 కోట్లు. సాగునీటి ప్రాజెక్టులు: 75 శాతం పైగా పనులు పూర్తయిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి ప్రత్యేక గ్రీన్ ఫండ్స్. ప్రభుత్వ గురుకులాలు, హాస్టల్ విద్యార్థుల డైట్ ఛార్జీలు, ఆస్పత్రుల అత్యవసర మందుల సరఫరా బిల్లులు కూడా గ్రీన్ ఛానల్ ద్వారానే చెల్లింపులు జరుగుతున్నాయి.
ఆర్బీఐ అప్పులే ఆధారం
ప్రతి నెలా ట్రెజరీ బ్యాలెన్స్ కాకపోవడంతో, ప్రభుత్వం సగటున రూ.3 వేల కోట్ల నుంచి రూ. 4 వేల కోట్ల వరకు రిజర్వుబ్యాంకు (ఆర్బీఐ) సెక్యూరిటీల వేలం ద్వారా కొత్త అప్పులు తెస్తున్నది. రాష్ట్రం చేస్తున్న మొత్తం అప్పులపై కేవలం వడ్డీలు చెల్లించడానికే ప్రతి నెలా దాదాపు రూ. 1,800 కోట్లకు పైగా ఖజానా నుంచి తరలిపోతోంది.
భారీగా బిల్లులు పెండింగ్
గ్రీన్ ఛానెల్ పరిధిలోకి రాని వివిధ ప్రభుత్వ శాఖల సివిల్ కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు (రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ పనులు వగైరా), సర్పంచ్ల పాత బాకీలు, జీపీఎఫ్ రుణాలు, మెడికల్ రీయింబర్స్మెంట్ సహా అన్నీ కలిపి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 12 వేల కోట్లకు పైగా బిల్లులు ట్రెజరీ ‘ఈ-కుబేర్’ పోర్టల్లో క్లియరెన్స్ కోసం క్యూలో ఉన్నాయి.







కామెంట్లు (0)