నవతెలంగాణ-హైదరాబాద్ బ్యూరో
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు (కేటీఆర్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. కళాశాల శాశ్వత క్యాంపస్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి, విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. 2021లో రూ.402 కోట్ల పరిపాలనా అనుమతులతో మంజూరైన జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల శాశ్వత క్యాంపస్ నిర్మాణం ఇప్పటికీ పెండింగ్‌లో ఉందని తెలిపారు. మంధేపల్లి గ్రామంలో 20 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ, నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో కళాశాల ప్రస్తుతం అగ్రహారంలోని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో తాత్కాలికంగా కొనసాగుతోందని వివరించారు.
గిరిజన విద్యార్థినికి కేటీఆర్ ఆర్థిక సాయం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన పెనుక శృతికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అండగా నిలిచారు. ఆమె కొడంగల్ అగ్రికల్చరల్ కాలేజీలో బీఎస్సీ సీటు సాధించింది. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే ఆమె కుటుంబానికి చదువుకు సంబంధించిన ఖర్చులు భరించడం భారంగా మారింది. దీంతో తన చదువుకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ శృతి ఎక్స్ వేదికగా చేసిన విజ్ఞప్తిపై కేటీఆర్ స్పందించారు. ఆయన ఆదేశాలతో బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు శృతి కుటుంబాన్ని స్వయంగా కలిసి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా శృతితో కేటీఆర్ ఫోన్లో మాట్లాడుతూ బాగా చదువుకోవాలనీ, తామంతా అండగా ఉంటామని చెప్పారు.







కామెంట్‌లు (0)