బర్కత్ పురా శ్రీ ఆకాశ్ కాలేజీలో
ఘనంగా ఎస్‌ఎఫ్‌ఐ బతుకమ్మ వేడుకలు
బతుకమ్మ బతుకుల పండుగ..ఆడబిడ్డలకు భరోసా కల్పిద్దాం
దాడులు, వివక్షను ధైర్యంగా తిప్పికొట్టాలి : ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపు
నవతెలగాణ - సిటీబ్యూరో
సమాజంలో ఆడపిల్లల స్వేచ్ఛ, సమానత్వం, భద్రత కోసం మహిళలు, విద్యార్థినిలు సంఘటితమై పోరాడాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపు నిచ్చారు. బతుకమ్మ కేవలం పూల పండుగ మాత్రమే కాదని, అది ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, బతుకులకు భరోసా కల్పించే పండుగ అని ఆమె స్పష్టం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ (స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బర్కత్‌పురాలోని శ్రీ ఆకాశ్ కాలేజీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన మల్లు లక్ష్మి విద్యార్థినిలతో కలిసి బతుకమ్మ ఆడి వారిలో ఉత్తేజాన్ని నింపారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. సమాజంలో నిత్యం మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులు, వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటూ తమ హక్కులను తామే కాపాడుకోవాలని సూచించారు. సావిత్రిబాయి ఫూలే, వీరనారి చిట్యాల ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి పోరాట యోధులను ఆదర్శంగా తీసుకొని, అన్యాయాలను ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థినిలకు సూచించారు. సమాజంలో ప్రతి ఆడపిల్లను పుట్టనివ్వాలని, స్వేచ్ఛగా బతకనివ్వాలని, ఆమె ఉన్నత చదువులు చదువుకొని ఎదిగేందుకు సమాన అవకాశాలు కల్పించాలని లక్ష్మి డిమాండ్ చేశారు. మహిళలకు, విద్యార్థినిలకు ఎలాంటి సమస్య వచ్చినా ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తాయని భరోసా ఇచ్చారు. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు బాధ్యతాయు తంగా వ్యవహరించాలని, మహిళా రక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.
హక్కులపై అవగాహన కోసమే ఈ వేడుక
ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. కేవలం సంబరాలకే పరిమితం కాకుండా మహిళల హక్కులు, సమానత్వం, భద్రతపై విద్యార్థినిల్లో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆడబిడ్డల హక్కుల పరిరక్షణ కోసం ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు . ఈ కార్యక్రమంలో ఆకాశ్ కాలేజీ చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు లెనిన్ గువేరా, జిల్లా ఉపాధ్యక్షులు రజనీకాంత్, ప్రవీణ్, అర్జున్, జిల్లా కమిటీ సభ్యులు భరత్, అశ్వక్, నాయకులు నిలోత్పల్, కిరణ్, చింటూ, డెన్జిల్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)