పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలి
దళితుల పట్ల దాడిపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి,
మెదక్ ఎంపీ ఎందుకు స్పందించలేదు..?
నిందితులకు వత్తాసు పలికిన
మనోహరాబాద్ ఎస్ఐని సస్పెండ్ చేయాలి
48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలి..లేకుంటే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం : కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి టి స్కైలాబ్ బాబు
దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్
ఎదుట ధర్నా.. ఎస్పీ, డీఆర్ఓకు వినతి
నవతెలంగాణ-తూప్రాన్/మనోహరాబాద్
కొనాయిపల్లి గ్రామంలో బతుకమ్మ ఉత్సవాల్లో దళితులపై దాడికి పాల్పడిన సర్పంచ్‌ను పదవి నుంచి తొలగించాలని, దళితులపై దాడి జరిగినా పట్టించుకోని పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని, నిందితులకు వత్తాసు పలుకుతున్న మనోహరాబాద్ ఎస్ఐని సస్పెండ్ చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. దాడి విషయం తెలిసినా జిల్లా ఇన్‌చార్జి మంత్రి, మెదక్ ఎంపీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. గురువారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కొనాయిపల్లి గ్రామంలో దళితులపై దాడి చేసిన గ్రామ సర్పంచ్ మన్నే కళ్యాణ్, అతని అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎస్, డీబీఎఫ్, ఎంసీఎఫ్, ఏఐఏడబ్ల్యూయూ, సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్ఓ, జిల్లా ఎస్పీతోపాటు డీపీవో కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలో ఎస్పీ స్పందిస్తూ.. కొనాయిపల్లి దళితులపై జరిగిన దాడి కేసును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని, గ్రామానికి డీఎస్పీని పంపించి విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు. మనోహరాబాద్ ఎస్‌ఐని నెల రోజుల్లో మార్చుతామని తెలిపారు. డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్ మాట్లాడుతూ.. కొనాయిపల్లి ఘటనపై తుప్రాన్ ఆర్డీవోతో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. కుచారం, నవాబ్ పేట్, కిష్టాపూర్ ఘటనలపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. అడివయ్య అధ్యక్షతన జరిగిన సభలో స్కైలాబ్ బాబు మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాల్లో దళితులపై దాడి జరిగి నాలుగు రోజులు అవుతున్నా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. గ్రామ సర్పంచ్ స్వయంగా లాఠీలు తీసుకుని దళితులపై దాడికి పాల్పడ్డారని, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం సెక్షన్ 37 ప్రకారం సర్పంచ్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే పంచాయతీలో పని చేసే సిబ్బందిపై దాడి జరిగినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. మెదక్ జిల్లాలో తుప్రాన్ మండలం కిష్టాపూర్, మనోహరాబాద్ మండలం కుచారం, శివ్వంపేట్ మండలం నవాబ్ పేట్ గ్రామాల్లోనూ బతుకమ్మ ఉత్సవాల్లో దళితులపై దాడులు జరిగాయని తెలిపారు. డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఇందిరమ్మ రాజ్యంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. బాధితుల పక్షాన నిలబడాల్సిన పోలీసులే.. నిందితుల పక్షాన ఉంటున్నారని ఆరోపించారు. నిందితులకు అనుకూలంగా కేసు నమోదు చేసిన మనోహరాబాద్ ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కొనాయిపల్లి గ్రామాన్ని ఇప్పటివరకు కలెక్టర్, ఎస్పీ ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు. 48 గంటల్లో దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాకు మద్దతుగా సీపీఐ(ఎం) మెదక్ జిల్లా కార్యదర్శి కె నర్సమ్మ, సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు ఏ మహేందర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె మల్లేశం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కె నిరంజన్ దాసు, భాగయ్య, మల్లేశం, ఎంసీఎఫ్ జిల్లా ఇన్‌చార్జి సంజీవ్, హెచ్‌ఆర్‌ఎఫ్ జిల్లా నాయకులు హామీద్, దుర్గ, వెంకన్న, లచ్చగౌడ్, గ్రామస్తులు అండాలు, శ్రావణి, నర్సిములు, నిరంజన్ దాసు, ప్రవీణ్, అర్జున్ పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)