చేతిలో ఉన్నది కేవలం రూ.200.. పెద్ద పెట్టుబడి లేదు.. వ్యాపార అనుభవం అంతకంటే లేదు. కానీ కొత్తగా ఏదైనా చేయాలన్న ఆలోచన ఉంది. చిన్నప్పటి నుంచి తనను వెంటాడిన ఓ సందేహానికి సమాధానం వెతికే క్రమంలో చేసిన ప్రయోగమే వ్యాపారంగా మారింది. నేడు రూ.10 కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి చేరింది. తమిళనాడులోని మదురై జిల్లాకు చెందిన 21 ఏండ్ల యువకుడు సూర్య వర్ష విజయం నేటి జోష్‌లో...
సూర్య వర్ష చిన్నతనంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉప్పును ఉపయోగించే ఓ పద్ధతిని తరచూ గమనించేవాడు. ఎవరికైనా గాయమైనప్పుడు కొంతమంది ఉప్పును బట్టలో చుట్టి కాపడం పెట్టేవారు. దీంతో ‘గాయాలకు ఉప్పును ఎందుకు ఉపయోగిస్తారు? ఉప్పులో అసలు ఏం ఉంటుంది?’ అనే ప్రశ్న మనసులో మెదిలేది. అంతే ఉప్పు గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో ఇంటర్నెట్లో శోధించడం ప్రారంభించాడు. ఉప్పులోని ఖనిజాలు, ముఖ్యంగా మెగ్నీషియం, కాల్షియం వంటి అంశాలపై సమాచారం సేకరించాడు. శరీర సంరక్షణలో ఉప్పును ఎలా ఉపయోగించవచ్చనే ఆలోచనకు వచ్చాడు.
రూ.200తో తొలి ప్రయోగం
కొత్త ఉత్పత్తిని తయారు చేయాలన్న ఆలోచన వచ్చింది. అయితే పెట్టుబడి పెట్టేందుకు డబ్బు లేదు. తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ నుంచి ఉన్న రూ.200 పెట్టుబడిగా పెట్టాడు. ఆ డబ్బుతో మందారం పువ్వు, బార్లీ, వేపాకు కొన్నాడు. వాటిని ఉప్పుతో కలిపి ప్రయోగాలు చేశాడు. చివరకు సహజ పదార్థాలతో బాత్ సాల్ట్‌ను తయారు చేశాడు. దీనికి ‘Naked Nature’ అని పేరు పెట్టాడు. అప్పటి నుండి రసాయనాలు లేకుండా సహజ పదార్థాలతో ఉత్పత్తులను తయారు చేయాలన్న ఆలోచనతో ముందుకు సాగాడు. తన ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను కూడా రూపొందించాడు.
డాక్టర్ అభినందన.. పెరిగిన నమ్మకం
ప్రారంభంలో ఉత్పత్తులకు పెద్దగా ప్రచారం లేదు. అయితే ఓ డాక్టర్ సూర్య వర్ష తయారు చేసిన బాత్ సాల్ట్‌ను కొనుగోలు చేశాడు. ఉత్పత్తిని మెచ్చుకోవడంతో పాటు పదేపదే కొనుగోలు చేయడం ప్రారంభించాడు. ఇది అతనిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తాను చేస్తున్న ప్రయత్నంలో ఏదో ప్రత్యేకత ఉందనే నమ్మకం కలిగింది. దీంతో మరిన్ని సహజ ఉత్పత్తుల తయారీపై దృష్టి పెట్టాడు.
సబ్బులతో మొదలై.. 70 ఉత్పత్తులకు
కలబంద, వేపాకు, ఉప్పు తదితర సహజ పదార్థాలతో సబ్బులను తయారు చేశాడు. ఆ తర్వాత చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ ఉత్పత్తులు.. ఇలా ఒక్కో విభాగంలో కొత్త ఉత్పత్తులను రూపొందిస్తూ వెళ్లాడు. ఇలా ‘Naked Nature’ పరిధి విస్తరించింది. ప్రస్తుతం సుమారు 70 ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్ చేస్తున్నట్లు సూర్య వర్ష చెబుతున్నాడు.
యూట్యూబే గురువుగా..
ఉత్పత్తి తయారు చేయడం ఓ ఎత్తయితే.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ఈ విషయాన్ని అతను త్వరగానే గుర్తించాడు. అందుకే డిజిటల్ మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాడు. మదురైలోని ఓ కళాశాలలో చదువుకుంటూనే యూట్యూబ్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ మెళకువలు నేర్చుకున్నాడు. సోషల్ మీడియా, ఆన్లైన్ ప్రచారం, కస్టమర్లను చేరుకునే విధానాలపై అవగాహన పెంచుకున్నాడు. నేర్చుకున్న వాటిని అమలు చేశాడు. మార్కెటింగ్ వ్యూహాలు ఫలించాయి. ‘Naked Nature’ ఉత్పత్తులకు క్రమంగా ఆదరణ పెరిగింది. ఆన్లైన్ ద్వారా కొత్త కస్టమర్లు చేరడంతో వ్యాపారం విస్తరించింది.
రూ.56 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు
చిన్న స్థాయిలో ప్రారంభమైన వ్యాపారం అనతికాలంలోనే మంచి ఫలితాలను ఇచ్చింది. 2021–22 ఆర్థిక ఏడాదిలో సుమారు రూ.56 లక్షల ఆదాయం సాధించినట్లు సమాచారం. ఆ తర్వాత ఉత్పత్తులకు ఆదరణ మరింత పెరిగింది. కొంతమంది వైద్యులు, సెలబ్రిటీలు కూడా కొనుగోలు చేసి ప్రచారం చేయడంతో బ్రాండ్‌కు గుర్తింపు పెరిగింది. వినియోగదారుల సంఖ్య పెరగడంతో వ్యాపారం కూడా విస్తరించింది. ఈ క్రమంలో ‘Naked Nature’ వ్యాపారం రూ.10 కోట్ల వరకు టర్నోవర్ సాధించినట్లు సూర్య వర్ష చెబుతున్నాడు.
‘అవకాశం’ కోసం ఎదురుచూడలేదు..
సూర్య వర్ష కథలో ఆసక్తికరమైన విషయం పెట్టుబడి కాదు.. ఆలోచనను ఆచరణలో పెట్టిన తీరు. రూ.200తో ప్రారంభించిన ప్రయోగం ఇంత పెద్ద వ్యాపారంగా మారుతుందని అప్పట్లో అతడే ఊహించలేదు. చిన్ననాటి సందేహాన్ని పక్కన పెట్టకుండా దాని గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాడు. తెలుసుకున్న విషయాలను ప్రయోగాలు చేశాడు. ప్రయోగాన్ని ఉత్పత్తిగా మార్చాడు. ఆ ఉత్పత్తికి మార్కెటింగ్ జోడించాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ వ్యాపారాన్ని విస్తరించాడు. చేతిలో డబ్బు లేదని, అనుభవం లేదని, పెద్ద సంస్థల అండ లేదని వెనక్కి తగ్గకుండా.. ఉన్న వనరులతోనే ప్రయత్నం ప్రారంభిస్తే అవకాశాలు సృష్టించుకోవచ్చని సూర్య వర్ష ప్రయాణం చెబుతోంది. ‘పెద్ద పెట్టుబడి కంటే పెద్ద ఆలోచనే ముఖ్యం’ అనే మాటకు ఇతనే ఓ ఉదాహరణ.
అనంతోజు మోహన్‌కృష్ణ, 88977 65417






కామెంట్లు (0)