కొరియాతో సాంస్కృతిక, ఆర్థిక బంధాలకు తెలంగాణ సర్కారు ప్రాధాన్యం
‘కె హార్మనీ ఫెస్టా’–కొరియా సాంస్కృతిక దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
నవతెలంగాణ-మాదాపూర్
కొరియా సంస్థల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, యువత నైపుణ్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆధునిక తయారీ, లైఫ్ సైన్సెస్, పునరుత్పాదక ఇంధనం, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో కొరియా సంస్థలతో కలిసి పనిచేసేందుకు రాష్ట్రంలో విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఆదివారం ‘కె హార్మనీ ఫెస్టా–కొరియా కల్చర్ డే–2026’ కార్యక్రమం నిర్వహించారు. దీనికి దేశంలోని రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి హెచ్.ఈ. లీ సియుంగ్-హో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. 2024 ఆగస్టులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దక్షిణ కొరియాలో చేపట్టిన పర్యటన సందర్భంగా జరిగిన పెట్టుబడుల చర్చలు రెండు ప్రాంతాల మధ్య ఆర్థిక భాగస్వామ్యానికి పునాది వేశాయని తెలిపారు. ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. కొరియా ఆర్థిక ప్రగతి నుంచి తెలంగాణ నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, ఔషధ రంగాలతో పాటు పర్యాటక మౌలిక సదుపాయాలు, ఆతిథ్య రంగం, చలనచిత్ర పర్యాటకం, వెల్నెస్ టూరిజం, సాంస్కృతిక అనుభవాల అభివృద్ధిలో కొరియా సంస్థల భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ పర్యాటక విధానం 2025–2030 ద్వారా ఐదేండ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు అదనంగా మూడు లక్షల ఉపాధి అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలోని 27 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్టు చెప్పారు. కొరియా సంస్కృతి, కళలు, సంగీతం, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ వేడుక రెండు దేశాల ప్రజల మధ్య స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. యుద్ధం, పేదరికం వంటి సవాళ్లను అధిగమించి కొరియా ప్రపంచంలోని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని కొనియాడారు. సాంకేతికత, తయారీ, విద్య, ఆవిష్కరణల్లో ఆ దేశం సాధించిన విజయాలు ప్రశంసనీయమని అన్నారు.
తెలంగాణ వారసత్వానికి అంతర్జాతీయ గుర్తింపు
విభిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాల కలయికకు హైదరాబాద్ శతాబ్దాలుగా కేంద్రంగా నిలిచిందని భట్టి విక్రమార్క చెప్పారు. బతుకమ్మ, బోనాలు, తెలుగు సాంస్కృతిక వారసత్వం, చారిత్రక కట్టడాలు తెలంగాణ ప్రత్యేకతలని వివరించారు. చార్మినార్, గోల్కొండ కోట, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రామప్ప దేవాలయంతో పాటు రాష్ట్రంలో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయని తెలిపారు.
నాగార్జునసాగర్ వద్ద ఉన్న బుద్ధవనం వంటి బౌద్ధ వారసత్వ ప్రదేశాలు భారత్, తూర్పు ఆసియా దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయగలవని అన్నారు. కొరియా పర్యాటకులు తెలంగాణను సందర్శించాలని, ఇరు ప్రాంతాల యువత చదువు, పరిశోధన, ఉద్యోగాలు, సృజనాత్మక రంగాల్లో పరస్పరం అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. దేశాల మధ్య పెట్టుబడులు, వాణిజ్య ఒప్పందాలు ముఖ్యమైనప్పటికీ, ప్రజల మధ్య ఆప్యాయత, పరస్పర అవగాహనే సంబంధాలకు శాశ్వత పునాది అని తెలిపారు. హైదరాబాద్లోని కొరియా మిత్రులకు మరో ఇల్లు వంటిదని అన్నారు.






కామెంట్లు (0)