పొదుపు సంఘాల మాటున అక్రమాలు
పని చేయని,
డీఫాల్ట్ సంఘాలకూ రుణాలు
ఆన్లైన్లో నమోదు చేయని ‘సీఓ’లు
విజిలెన్స్ విచారణలో ఎల్బీనగర్, సరూర్నగర్, హయత్నగర్ సర్కిళ్లలో అక్రమాల గుర్తింపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు కృషి చేయాల్సిన ‘మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ (మెప్మా)’లో అవినీతి వెలుగులోకి వచ్చింది. పొదుపు సంఘాల మాటున కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతూ రుణాలు ఇప్పించే క్రమంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వాటా/కమీషన్ ఇస్తే చాలు పని చేయని, డీఫాల్ట్ సంఘాలకూ రుణాలు ఇప్పించేస్తున్నారు. రుణాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు ఫిర్యాదుల అందడంతో ఉన్నతాధికారులు జీహెచ్ఎంసీ పరిధిలో విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దీంతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆయా సర్కిళ్లలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన మెప్మాలో పట్టణ ప్రాంతాల్లోని పేద మహిళలు సంఘాలుగా ఏర్పడి దరఖాస్తు చేసుకుంటే బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఈ రుణాలతో చిన్నచిన్న వ్యాపారాలు చేయడంతోపాటు ఉపాధి మార్గాలను చూసుకోవచ్చు. ఈ రుణ మంజూరు ప్రక్రియలో కమ్యూనిటీ ఆర్గనైజర్లు(సీవో)లు కీలక పాత్ర పోషిస్తారు. సంఘాల రుణ ప్రణాళికలను రూపొందించడం, వాటిని అధికారులకు సమర్పించడం, ఆమోదం లభించాక బ్యాంకుల ద్వారా రుణాల ఇప్పించడంలో ‘సీఓ’లు చొరవ చూపిస్తారు. వీరు ఈ అవకాశాన్ని ఆసరగా చేసుకోవడంతోపాటు ఒకే సర్కిల్లో సుదీర్ఘకాలం పని చేస్తుండటంతో సంఘాలతోపాటు బ్యాంకు సిబ్బందితోనూ పరిచయాలు పెరగడంతో కొందరు ‘సీఓ’లు చక్రం తిప్పుతున్నారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టుగా చూపిస్తూ భారీగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు విచారణలో తేలింది.
డీ ఫాల్ట్ సంఘాలకూ రుణాలు
ఎల్బీనగర్ జోన్ సరూర్నగర్ సర్కిల్ పరిధిలో మొత్తం 2,241 సంఘాలు ఉండగా, ఇందులో 1,897 క్రియాశీలకంగా పని చేస్తున్నాయి. 310 సంఘాలు పని చేయడం లేదు. ఇందులో 34 సంఘాలు డీ ఫాల్ట్ జాబితాలో ఉన్నాయి. ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో మొత్తం 1,953 సంఘాలు ఉండగా, ఇందులో 1,783 క్రియాశీలకంగా పని చేస్తున్నాయి. 118 సంఘాలు పని చేయడం లేదు. ఇందులో 52 సంఘాలు డీ ఫాల్ట్ జాబితాలో ఉన్నాయి. ఇక హయత్ నగర్ సర్కిల్ పరిధిలో మొత్తం 1,904 సంఘాలు ఉండగా, ఇందులో 1,395 క్రియాశీలకంగా పని చేస్తున్నాయి. 469 సంఘాలు పని చేయడం లేదు, ఇందులో 40 సంఘాలు డీ ఫాల్ట్ జాబితాలో ఉన్నాయి. ఇలాంటి మూతపడిన, ఉనికిలో లేని, పని చేయని, డీ ఫాల్ట్ జాబితాలో ఉన్న పొదుపు సంఘాలకు రుణాలు ఇవ్వకూడదు. కానీ కొందరు ‘సీఓ’లు తప్పుడు పత్రాలతో ఇలాంటి సంఘాలకూ రుణాలు ఇప్పించినట్టు విజిలెన్స్ విచారణలో తేలింది.
వాటా ఇస్తేనే రుణాలు
పొదుపు సంఘాల ఏర్పాటు ప్రక్రియ, రుణాలకు అర్హులను గుర్తించడం, రుణాల మంజూరు ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తున్న ‘సీఓ’లు ఏండ్ల తరబడి ఒకే చోట పని చేస్తుండటంతో వారిపై ఎప్పటి నుంచో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ‘సీఓ’లు తమకు వాటా ఇస్తామన్న సంఘాలకు మాత్రమే రుణాలు ఇప్పిస్తుంటే.. మరికొందరు ‘సీఓ’లు అధిక కమీషన్ ఇస్తే పని చేయని సంఘాలు, డీ ఫాల్ట్ జాబితాలో ఉన్న సంఘాలకు సైతం బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయిస్తున్నారు. ఇకొందరు ‘సీఓ’లు పొదుపు సంఘాలకు రుణాలు మంజూరు చేయించి.. ఆయా వివరాలను ఆన్ లైన్లో నమోదు చేయడం లేదు. ఈ డబ్బును రుణాలు పొందిన పొదుపు సంఘాలతో కలిసి నిబంధనలకు విరుద్ధంగా పరోక్షంగా వాడుకుంటున్నారు. దీంతో ఈ తరహాల రుణాల విషయాలు అధికారులకు తెలియడమే లేదు. విజిలెన్స్ విచారణ మరింత లోతుగా విచారణ చేపడితే మరిన్ని మోసాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఆన్లైన్లో కనిపించని 48 సంఘాల రుణాలు
మెప్మాలో భారీగా అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగం జరుగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికారులు జీహెచ్ఎంసీలోని కొన్ని సర్కిళ్లలో విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దీంతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ జోన్ పరిధిలోని సరూర్ నగర్ సర్కిల్ లో విచారణ చేపట్టగా.. ఇక్కడి ‘సీఓ’ 28 సంఘాలకు రూ. 2,37,63,000 రుణాలను ఇప్పించగా, ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని ‘సీఓ’ 17 సంఘాలకు రూ.1,45,27,000, హయత్ నగర్ సర్కిల్ పరిధిలోని ‘సీఓ’ 3 సంఘాలకు రూ. 26 లక్షల రుణాలను మంజూరు చేయించారు. కానీ ఈ వివరాలేవీ ఆన్లైన్లో నమోదు చేయలేదని విజిలెన్స్ విచారణలో తేలింది. దీంతో మొత్తం 48 సంఘాలకు మంజూరైన రుణాలను దేనికోసం వినియోగించారన్న కోణంలో ఉన్నతాధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ మూడు సర్కిళ్లలోనే విస్తుబోయే వాస్తవాలు వెలుగులోకి రావడంతో రుణ మంజూరు ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా అధికారులు కసరత్తు చేపట్టారు.






కామెంట్లు (0)