ప్రత్యేక బోర్డు ఏర్పాటు..గుర్తింపు కార్డులు, ప్రత్యేక నంబర్లతో కార్మికుల గుర్తింపు
రాహుల్ గాంధీ చేతుల మీదుగా చట్టం అమలుకు శ్రీకారం
నిఖిల్ డే తదితరుల సహకారంతో చట్టం రూపకల్పన : సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నాటి నుంచి నేటి వరకు దేశ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో గాంధీ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమం, భద్రత కోసం భారత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొచ్చిందని వెల్లడించారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక గిగ్ వర్కర్ల చట్టాన్ని తీసుకొచ్చామని అన్నారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావటం హర్షణీయమని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని జయభేరి గ్రౌండ్ లో జరిగిన గిగ్ వర్కర్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 2023లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సుమారు 4 వేల కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ఆ యాత్రలో భాగంగా ఆనాడు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు గిగ్ వర్కర్లు ఆయన్ను కలిసి తమ సమస్యలను విన్నవించారని గుర్తు చేశారు. రోజంతా కష్టపడుతున్నప్పటికీ వారికి సరైన ఆదాయ భద్రత లేదని, ప్రమాదాలు జరిగినప్పుడు కుటుంబాలకు అండగా నిలిచే వ్యవస్థ లేదని, తమ హక్కులకు చట్టబద్ధమైన గుర్తింపు కావాలని కోరారని తెలిపారు. వారి సమస్యలను శ్రద్ధగా విన్న రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిగ్ వర్కర్ల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆ రోజు ఇచ్చిన హామీని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చిందని స్పష్టం చేశారు. గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి గిగ్ వర్కర్‌కు రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించామని, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించే ఏర్పాటు చేశామని వివరించారు. ప్రమాదాలు, అనారోగ్య సమస్యల సమయంలో కార్మికులతోపాటు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమన్నారు. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి, వారికి గుర్తింపు కార్డులు, ప్రత్యేక గుర్తింపు నంబర్లు అందించే విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఇప్పటివరకు అసంఘటిత రంగంలో పనిచేస్తూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న కార్మికులకు ఈ చట్టం ద్వారా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. వారి హక్కులు, సంక్షేమం, ఆదాయ భద్రతకు అవసరమైన వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. గిగ్ వర్కర్లకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ చట్టం రూపకల్పన, అమలు ప్రక్రియలో నిఖిల్ డే తదితరులు ఎంతో సహకారం అందించారని ముఖ్యమంత్రి తెలిపారు. గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన రక్షణ కల్పించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)