Magazines

దీపావళి వేళ భారీ చోరీ.. నలుగురు అరెస్ట్‌

2 గంటల క్రితం

Major theft during Diwali; four arrested
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 2 నిమిషాల చదవడం

రూ. 50 లక్షల సొత్తు , ఐదు సెల్‌‌ఫోన్లు స్వాధీనం

నవతెలంగాణ-వనస్థలిపురం

దీపావళి పండుగ వేళ వనస్థలిపురంలో ఓ ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి సుమారు రూ.50 లక్షల సొత్తుతోపాటు ఐదు సెల్‌ఫోన్లు, చోరీకి ఉపయోగించిన పల్సర్‌ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం వనస్థలిపురం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ టి.కరుణాకర్‌రావు కేసు వివరాలను వెల్లడించారు.వనస్థలిపురం గణేశ్‌ టెంపుల్‌ సమీపంలోని ఖాదీ బండారు షాపు పైన నివసిస్తున్న వికాస్‌ అగర్వాల్‌ ఇంట్లో దీపావళి రోజు సాయంత్రం చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు ఆటోనగర్‌లోని తమ స్టీల్‌ ఫ్యాక్టరీకి వెళ్లిన సమయంలో దుండగులు ఇంటి తాళం పగులగొట్టి నగదు, బంగారం, వెండి, వజ్రాభరణాలు అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలు, ఇతర ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు హయత్‌ నగర్‌కు చెందిన గురువల్లి చంద్రశేఖర్‌, మునుగ నూరు గ్రామం మల్లికార్జుననగర్‌కు చెందిన సిరిగడి ప్రకాష్‌, వనస్థలిపురం ఆర్డర్‌నగర్‌ గీతా టింబర్‌ డిపో సమీపంలో నివసించే ఎత్తబోయిన అరవింద్‌, మహబూబ్‌నగర్‌కు చెందిన సంతుల్లా బాలకృష్ణగా పోలీసులు గుర్తించారు. వీరిలో చంద్రశేఖర్‌, ప్రకాష్‌ జేసీబీ డ్రైవర్లుగా, అరవింద్‌, బాలకృష్ణ జేసీబీ క్లీనర్లుగా పనిచేస్తున్నారు. ఆటోనగర్‌లో ఉంటూ అగర్వాల్‌ వద్ద జేసీబీ పనులు చేస్తుండటంతో ఆయన ఇంటికి రాకపోకలు సాగించేవారు. నలుగురూ ముందుగానే చోరీకి పథకం వేసుకున్నట్టు ఏసీపీ తెలిపారు. దీపావళి రోజు అగర్వాల్‌ కుటుంబ సభ్యులు ఫ్యాక్టరీకి వెళ్లడంతో పథకాన్ని అమలు చేశారు. బాలకృష్ణ ఫ్యాక్టరీ వద్దే ఉండి కుటుంబ సభ్యుల కదలికలను గమనిస్తూ చంద్రశేఖర్‌కు సమాచారం అందించాడు. ప్రకాష్‌, అరవింద్‌ ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడినట్టు విచారణలో వెల్లడైంది. చోరీకి గురైన సొత్తులో రూ.10 లక్షలు, బంగారు గాజులు, గొలుసులు, ఉంగరాలు, చెవిపోగులు, వజ్రాల ఉంగరాలు, వెండి నాణేలు, పూజా సామగ్రి ఉన్నాయి. మొత్తం రూ.50 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి కమిషనరేట్‌ సీపీ బి.సుమతి, డీసీపీ అనురాధ, ఏసీపీ కరుణాకర్‌రావు ఆదేశాల మేరకు కేసును ఛేదించిన వనస్థలిపురం సీఐ రవిబాబు, డిటెక్టివ్‌ సీఐ రాజేష్‌, ఎస్‌ఐలు వి.రవి, డి. మల్లయ్య, క్రైమ్‌ కానిస్టేబుళ్లు కరణ్‌, మహేందర్‌, లింగరాజు, వెంకట్‌, శంకర్‌, అప్పారావు, కొండల్‌కు ఏసీపీ రివార్డులు అందజేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్