Magazines

శాంతియుత, సమానత్వ సమాజ నిర్మాణానికి సంస్కృతే పునాది

2 గంటల క్రితం

Culture is the foundation for building a peaceful and egalitarian society.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 2 నిమిషాల చదవడం

మానవీయ విలువల పరిరక్షణకు పిలుపు

భారత్ సమ్మిట్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

శాంతియుత, సమ్మిళిత, సమానత్వ సమాజ నిర్మాణానికి సంస్కృతి, మానవీయ విలువలే పునాదిగా నిలవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఘర్షణలకు బదులుగా చర్చలు, సంఘర్షణలకు బదులుగా అహింసా మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. సమాజంలోని అన్ని వర్గాలకు ఆర్థిక సమానత్వం, న్యాయం అందినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన భారత్ సమ్మిట్‌-2026లో ‘తెలంగాణ రైజింగ్‌ – సంస్కృతి, సమాజం’ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు, ఘర్షణలు, వివక్ష కారణంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శతాబ్దాలుగా మానవ సమాజం అభివృద్ధి చెందుతున్నప్పటికీ, అనేక దేశాల్లో హింస, ఘర్షణలు, కనీస మానవీయ విలువలకు విరుద్ధమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. ఆర్థిక వృద్ధి ఫలాలు కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా రైతులు, యువత, కార్మికులు, బలహీన వర్గాలకు చేరాలని మంత్రి స్పష్టం చేశారు. శాంతియుత సహజీవనం, సామాజిక న్యాయం, సమాన అవకాశాలతో కూడిన అభివృద్ధి ద్వారానే న్యాయబద్ధమైన సమాజాన్ని నిర్మించగలమన్నారు. సంస్కృతి అంటే కేవలం కళలు, నృత్యాలు, సంగీతం, పండుగలు మాత్రమే కాదనీ, అది ప్రజల జీవన విధానం, ఆలోచనా ధోరణి, విశ్వాసాలు, సంప్రదాయాలు, సామాజిక ప్రవర్తనల సమాహారమని మంత్రి వివరించారు. వ్యక్తులు, సమాజాల ఆలోచనా విధానాల్లో మార్పు తీసుకురావడంతో పాటు మానవీయ విలువలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ బాధ్యత ఒక్క దేశానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉందని పేర్కొన్నారు. భారతీయ నాగరికత, వారసత్వ విలువలను ప్రస్తావిస్తూ మహాత్మా గాంధీ బోధించిన సరళ జీవనం, అహింస, శాంతియుత సహజీవన సూత్రాలను మంత్రి గుర్తుచేశారు. విలువలు, ఆదర్శాలను సాంస్కృ తిక మార్పిడి కార్యక్రమాలు, సినిమాలు, లఘుచిత్రాలు, ఇతర సృజనాత్మక మాధ్యమాల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంతో పాటు దాన్ని తరతరాలకు అందిస్తున్న కళాకారులను ఆదుకోవడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రభాత భేరి కార్యక్రమం ద్వారా జానపద కళలు, సంగీతం, నాటక ప్రదర్శనలతో మాదకద్రవ్యాల వినియోగం, వరకట్నం, గృహహింస, ఆన్‌లైన్ బెట్టింగ్, సైబర్ మోసాలు వంటి సామాజిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది అని తెలిపారు.

గ్లోబల్ సౌత్‌, గ్లోబల్ నార్త్ దేశాల మధ్య సాంస్కృతిక సహకారాన్ని విస్తరించేందుకు కళాకారులు, వారసత్వ పరిరక్షణ నిపుణుల పరస్పర మార్పిడి, మ్యూజియంలు, విశ్వవిద్యాలయాల మధ్య భాగస్వామ్యాలు, జీవన సంప్రదాయాల ఉమ్మడి డాక్యుమెంటేషన్ వంటి అంశాలపై చర్చించారు. అవర్ వరల్డ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రతిపాదించిన సంస్కృతి-ప్రజాస్వామ్య విభాగం ద్వారా సాంస్కృతిక విధానాలు, అనుభవాలను పరస్పరం పంచుకోవడంతో పాటు అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఈ చర్చా కార్యక్రమానికి సీమా చిష్టి మోడరేటర్‌గా వ్యవహరించారు. ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, డాక్టర్ అలేఖ్య పుంజాల, ప్రొఫెసర్ అజయ్ గుడవర్తి, సందీప్ దీక్షిత్, ప్రొఫెసర్ అపూర్వానంద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్