Magazines

నిర్లక్ష్యం నీడలో ఆకేరు వాగు

58 నిమిషాల క్రితం

Akeru Stream in the Shadow of Neglect
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 2 నిమిషాల చదవడం

నాడు మొంథా తుఫాన్‌తో తెగిన వైనం

​నేడు ఎల్‌నినో ప్రభావంతో 
కరువు భయాలు

​ఏండ్లు గడుస్తున్నా ఈ వాగుపై అధికారుల పర్యవేక్షణ శూన్యం

​ఆందోళనలో రైతులు, 
పశువుల కాపరులు

నవతెలంగాణ – చిన్నగూడూరు

మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు ​మండల ప్రజలు వ్యవసాయానికి, పశుపోషణకు ప్రధాన జీవనాధారంగా ఉన్న ఆకేరు వాగు నేడు నిర్లక్ష్యానికి గురవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతం లో మొంథా తుఫాన్ ప్రభావంతో ఆకేరు వాగుకు గండి పడటంతో నీటి నిల్వలు తగ్గి రానున్న రోజుల్లో నీటి ఎద్దడి తప్పదేమోనని రైతులు, పశువుల కాపరులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయనే అంచనాలు, మరోవైపు వాగు, చెరువుల పరిస్థితి ఆందోళన కలిగిస్తుండటంతో మండల రైతులు, పశుపోషకుల్లో కలవరం మొదలైంది. ఆకేరు ఆనకట్టకు సంబంధించిన సమస్యలు ఏర్పడి ఏండ్లు గడుస్తున్నా సంబంధిత అధికారుల పర్యవేక్షణ మాత్రం కనిపించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. వాగుకు గండ్లు పడటం, నీటి నిల్వలకు విఘాతం కలగడం వంటి సమస్యలపై శాశ్వత పరిష్కారం చూపాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ​మండల వ్యాప్తంగా 10200 ఎకరాల సాగు భూమి ఉండగా, ఆకేరు వాగు పరిధి ఆయకట్టు 1500 ఎకరాలు ఉంది. ఎల్‌నినో నేపథ్యంలో పంటలు సాగు చేసే రైతులు, పశువుల దాహార్తిని తీర్చుకునే కాపరులకు భవిష్యత్‌పై భరోసా లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 5 గ్రామాలు ఆకేరు వాగు పరిధిలో ఉన్నాయి. పశుపోషణను ప్రధాన జీవనాధారంగా చేసుకున్న కొన్ని కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆకేరు వాగుకు పడిన గండిని వెంటనే పూడ్చి, ఆనకట్టకు పటిష్టమైన మరమ్మతులు చేపట్టాలని రైతులు, పశువుల కాపరులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాగు పరిస్థితిని పరిశీలించాలని, నీటి నిల్వలు కాపాడేందుకు శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే రానున్న రోజుల్లో వ్యవసాయం, పశుపోషణ రెండింటిపైనా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

​​ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలి

ఎల్ నినో ప్రభావంతో భవిష్యత్‌లో పశు కాపర్లకు నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం ముందుచూపుతో నీటి తొట్లను, పశుగ్రాసాలను అందించాలి. ‌వాగుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలి.

- పయ్యావుల మల్లయ్య, జీఎంపీఎస్‌ జిల్లా అధ్యక్షులు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్