Magazines

నేడు సీపీఎస్‌ ఉద్యోగుల ‘సామూహిక సెలవు’

2 రోజుల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ ‌స్కీం (సీపీఎస్‌)‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ ‌విధానం (ఓపీఎస్‌)‌ని పునరుద్ధరించాలనే డిమాండ్‌తో రాష్ట్రంలోని సీపీఎస్‌ ఉద్యోగులు మంగళవారం సామూహిక సెలవు పెట్టనున్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో సీపీఎస్‌‌ను రద్దు చేసి ఓపీఎస్‌‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చి మూడేండ్లు గడిచినా ఆ హామీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్‌ ‌మ్యానిఫెస్టో విడుదల చేసిన నవంబర్‌ 17‌ను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సామూహిక సెలవు పెట్టాలని నిర్ణయించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్మదీక్షలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ‌టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాలైన హిమాచల్‌ ‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌‌ఘడ్‌, జార్ఖండ్‌‌లో సీపీఎస్‌‌ను రద్దు చేసి ఓపీఎస్‌‌ను పునరుద్ధరించాయని గుర్తు చేశారు. తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళలో పాత పెన్షన్‌ ‌పునరుద్ధరణ ఉద్యోగుల ఆకాంక్ష అని వివరించారు. ఎన్నికల సభల్లో నాటి పీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. సీపీఎస్‌ ‌రద్దు అంశాన్ని మూడు నెలలపాటు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలన్న కమిటీ ఏదని అడిగారు. సామూహిక సెలవు నేపథ్యంలో టీఎస్‌‌సీపీఎస్‌ఈయూ కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలిసింది.

‌ప్రభుత్వం చర్చలకు పిలవాలి : టీఎస్‌‌సీపీఎస్‌ఈయూ

మంగళవారం సీపీఎస్‌ ఉద్యోగులు తలపెట్టిన సామూహిక సెలవుపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందన్న వదంతులు రావడం పట్ల టీఎస్‌‌సీపీఎస్‌ఈయూ విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్‌ ‌శ్రీకాంత్‌ ‌సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తమ ఆవేదన ప్రభుత్వం మీద వ్యతిరేకతతో చేస్తున్నది కాదని స్పష్టం చేశారు. తమ కనీస హక్కులు, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న శాంతియుత ప్రయత్నం మాత్రమేనని తెలిపారు. కఠిన చర్యలు, హెచ్చరికలకు బదులుగా ప్రభుత్వం చర్చలకు పిలిచి తమ సమస్యలను సానుభూతితో పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్