ధాన్యం ధర తగ్గింపుపై ఆగ్రహం
రూ.3 వేలకుపైగా ఇస్తామని చెప్పి.. రూ.2 వేలకే కొనుగోలు
మద్దతు ధర చెల్లించాలని మార్కెట్ కార్యదర్శిని నిలదీసిన రైతులు
నవతెలంగాణ-సూర్యాపేట
ధాన్యానికి మంచి ధర వస్తుందన్న ఆశతో సూర్యాపేట మార్కెట్‌కు పంటను తీసుకొచ్చిన రైతులకు నిరాశే ఎదురైంది. క్వింటాల్ ధాన్యానికి రూ.3 వేలకుపైగా ధర ఇస్తామని చెప్పి మార్కెట్‌కు రప్పించిన కమీషన్‌దారులు, ధాన్యం రాక పెరగడంతో ధర తగ్గించారని రైతులు ఆరోపిస్తున్నారు. క్వింటాల్‌కు రూ.2 వేల నుంచి రూ.2,300 వరకు మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వర్షం కారణంగా మూడ్రోజులుగా ధాన్యం కాంటాలు నిలిచిపోవడంతో పంటను విక్రయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి ధాన్యం తడిసిపోవడం, ధర తగ్గడంతో తీవ్రంగా నష్టపోతున్నామని గురువారం సూర్యాపేట మార్కెట్లో రైతులు నిరసనకు దిగారు. మద్దతు ధర చెల్లించాలని మార్కెట్ లో కార్యదర్శిని నిలదీశారు. ధాన్యానికి రూ.3 వేలకుపైగా ధర లభిస్తుందన్న ఆశతో పంటను మార్కెట్‌కు తీసుకొచ్చామని మొర పెట్టుకున్నారు.
అయితే ధాన్యం భారీగా చేరడంతో కమీషన్‌దారులు సిండికేట్‌గా మారి ధరను తగ్గించారని రైతులు ఆరోపించారు. క్వింటాల్‌కు రూ.2 వేల నుంచి రూ.2,300 వరకు మాత్రమే ఇస్తుండటంతో పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్‌కు పంటను తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు జరగకపోవడంతో ధాన్యం అక్కడే ఉండిపోయింది. ఈ క్రమంలో వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో నాణ్యత దెబ్బతిని మరింత నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లించాలని, ఇచ్చిన మాట ప్రకారం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఆన్లైన్ టెండర్లు
మార్కెట్ కార్యదర్శి ఫసియోద్దీన్
మార్కెట్ కు 45 వేల బస్తాల ధాన్యం వచ్చింది. ఎలాంటి సిండికేట్ జరగలేదు. అంతా ఆన్లైన్ ద్వారానే టెండర్లు వేసి ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయి. ఒక్క రైతుకూ అన్యాయం చేయం. మద్దతు ధర తప్పనిసరిగా లభిస్తుంది.






కామెంట్లు (0)