తగ్గిన భూగర్భ జలాలు..ఎండుతున్న పంటలు..
రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్లు
పలుచోట్ల ఎండిన పంట..పశువుల పాలు..
ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా..కాలిన మోటార్లతో అదనపు భారం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఎల్‌నినో ప్రభావంతో రైతన్న కరువు ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాడు. వర్షాలు లేక.. బోర్లల్లో చుక్క నీళ్లు రాక.. నిన్నటి వరకు పచ్చగా కళకళలాడిన పంట.. నేడు కండ్లముందే ఎండిపోతుంటే కన్నీటి పర్యంతమవుతున్నాడు. ఇప్పటికైనా వరుణుడు కరుణిస్తాడేమోనని ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నాడు. పంటలు ఎండిపోతుండడంతో పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేక విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చుల కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మదనపడుతున్నాడు. ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించినా.. పంటకు పరిహారాన్ని మాత్రం నిర్ధారించలేదు. ఈ నేపథ్యంలో రాష్ర్టాన్ని కరువుగా ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 740.6 మిల్లిమీటర్లు ఉండాలి. అయితే 615.5 మిల్లిమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదైంది. నీటి మట్టాలు పడిపోయాయి. ప్రధాన ప్రాజెక్టుల మొత్తం సామర్థ్యం 585 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వలు 179.63 టీఎంసీలకు పడిపోయాయి. భూగర్భజలాలు పడిపోయాయి. నీటి కొరత కారణంగా ఖరీఫ్ సాగు విస్తీర్ణం 126.06 లక్షల ఎకరాలకు పడిపోయింది. వరి సాగు 18శాతం మేర క్షీణించింది. దీంతో ప్రభుత్వం 365 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో 111 తీవ్ర కరువు మండలాలు, 254 మోస్తరు కరువు మండలాలుగా ప్రకటించింది.
రంగారెడ్డి జిల్లాలో పడిపోయిన భూగర్భజలాలు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారు 11 లక్షల ఎకరాలు ప్రతియేటా సాగవు తోంది. రంగారెడ్డి జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాలు, వికారాబాద్‌లో 4.5లక్షల ఎకరాలు మాత్రమే సాగు అయినట్టు అధి కారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇందులో రంగారెడ్డి జిల్లాలో వర్షాభావంతో సుమారు 2.9 లక్ష ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు ఇటీవల వ్యవసాయ అధికారుల ప్రాథమిక సర్వేలో తేలింది. వికారాబాద్‌లో 2.4 లక్షల ఎకరాల పంట నష్టం జరిగినట్టు సమాచారం. ముఖ్యంగా జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భూగర్భ జలశాఖ అక్టోబర్ 2026 గణాంకాల ప్రకారం సగటు నీటిమట్టం భూమి ఉపరితలం నుంచి 12.75 మీటర్ల లోతుకు పడిపోయింది. గతేడాది ఇదే సమయంలో 6.14 మీటర్లుగా నమోదైంది. 84 బావుల్లో 79 బావుల్లో నీటిమట్టం తగ్గడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు 38 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 27 మండలాలు ఉంటే 18 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. వికారాబాద్ జిల్లాలోని 20 మండలాలనూ కరువు మండలాలుగా ప్రకటించింది.
ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో రైతులు ట్యాంకర్ల ద్వారా తమ పంటలకు నీటిని సరఫరా చేస్తున్నారు. కొందరు ఎండిన పంటలను పశువుల మేతకు ఉపయోగిస్తున్నారు. చేవెళ్ల మండలం కమ్మెట గ్రామానికి చెందిన రైతు అచ్చినీ రామచంద్రయ్య తన రెండు ఎకరాల వరి పొలాన్ని కాపాడుకునేందుకు పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. ‘ట్యాంకర్ ద్వారా పొలానికి నీళ్లు పట్టిస్తున్నా. ఒక్కో ట్యాంకర్‌కు రూ.వెయ్యి చెల్లిస్తున్నా. ఒక ఎకరం పొలాన్ని తడపాలంటే సుమారు రూ. 10 వేలు ఖర్చు అవుతోంది’ అని రైతు వాపోయాడు. ‘ప్రస్తుతం పొలం పొట్టదశలో ఉంది. పంటను దక్కించుకోవాలంటే మరో నెల రోజులు కాపాడుకోవాలి. ఈ లెక్కన పంట దిగుబడికి వచ్చే ఆదాయం కంటే పంట కాపాడుకోవడానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంది’ అని మరో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. కడ్తల్ గ్రామంలో నర్సింహ అనే రైతు రెండెకరాల వరి సాగు చేస్తే.. అందులో ఎకరం పంట పొట్టదశలో ఎండిపోయింది. పంట దక్కించునే పరిస్థితి లేక.. ఎండిన పంటను పశువుల మేతకు వదిలేశాడు. ఇబ్రహీంపట్నం, పూడూర్, వికారాబాద్, తదితర మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీనికి అదనంగా కరెంట్ సరఫరా సరిగ్గా లేక మోటార్లు కాలిపోతున్నాయి. దాంతో రైతులపై అదనపు భారం పడుతోంది.
పంట పెట్టుబడి ఖర్చులు ఇవ్వాలి
ప్రభుత్వం ఇటీవల కరువు మండలాలను ప్రకటించింది. ఈ మండలాల్లో పంట నష్టం సర్వేలు చేపడుతోంది. ఎకరాకు రూ. 10 వేలు నష్ట పరిహారం చెల్లించే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. కనీసం పెట్టుబడికి అయిన ఖర్చులనైనా ప్రభుత్వం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.






కామెంట్లు (0)