Magazines

రాచకొండ ఎత్తిపోతలను వెంటనే ప్రకటించాలి

44 నిమిషాల క్రితం

Rachakonda
avatar
balaji

ప్రచురించబడింది నవం 03, 2026 | 3 నిమిషాల చదవడం

రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ డిమాండ్‌

ప్రభుత్వానికి మూడు నెలల గడువు

అసెంబ్లీ వరకు పోరాటం కొనసాగిస్తాం : సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎమ్‌డి జహంగీర్

చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) మహాధర్నా


​నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం, చౌటుప్పల్ మండలాల రైతాంగానికి సాగునీరు అందించేం దుకు రాచకొండ ఎత్తిపోతల పథకంపై వెంటనే స్పష్టత ప్రకటించి డీపీఆర్ రూపొందించి అమలు చేయాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ​సీపీఐ(ఎం) నారాయణపురం మండల కమిటీ ఆధ్వర్యంలో చర్లగూడెం (శివన్నగూడెం) ప్రాజెక్టు రిజర్వా యర్ నుంచి చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం వరకు మూడ్రోజులు 79 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. మంగళవారం కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్‌ మాట్లాడుతూ .. శివన్నగూడెం రిజర్వాయర్ నిర్మాణం కోసం భూసేకరణ సమయంలో రైతులకు న్యాయమైన పరిహారం అందించాలని రైతు సంఘం అనేకసార్లు పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. తక్కువ ఖర్చుతోనే రాచకొండ ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణపురం, చౌటుప్పల్ మండలాలతో పాటు పరిసర ప్రాంతాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని తెలిపారు. ​​రాచకొండ ఎత్తిపోతల పథకం కోసం ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాయన్నారు.

​​కరువు పీడిత ప్రాంతం.. : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్‌డి. జహంగీర్

నారాయణపురం, చౌటుప్పల్ మండలాలు తీవ్ర కరువు పీడిత ప్రాంతాలని, బోర్లు వేసినా నీరు లభించని పరిస్థితి నెలకొందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్‌డి. జహంగీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం ఫ్లోరోసిస్ సమస్యతో బాధపడు‌తోందన్నారు. తాగునీరు, సాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. శివన్న గూడెం ప్రాజెక్టు కోసం సీపీఐ(ఎం) అనేక ఉద్యమాలు చేసిందని, ఫలితంగా 2015లో రెండేండ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని పాలకులు హామీ ఇచ్చారని, ఏండ్లు గడిచినా ప్రాజెక్టు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.6,200 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టులో ఇప్పటివరకు సుమారు రూ.1,500 కోట్ల పనులే జరిగాయని తెలిపారు. ‘ఈ ధర్నా ముగింపు కాదు.. ఆరంభం మాత్రమే. ప్రభుత్వానికి మూడు నెలల గడువు ఇస్తున్నాం. ఈలోగా రాచకొండ ఎత్తిపోతల పథకంపై స్పష్టమైన ప్రకటన చేయాలి. లేకపోతే నారాయణపురం, చౌటుప్పల్ మండలాల బంద్‌కు పిలుపునిస్తాం. అవసరమైతే చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతాం. ప్రజల సమస్యలపై ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించాలి’ అని హెచ్చరించారు. ​రాచకొండ ఎత్తిపోతల పథకం కోసం 2018లో సర్వే నిర్వహించినా, ఆ నివేదికను బహిర్గతం చేయలేదని అన్నారు. వెంటనే డీపీఆర్ రూపొందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

​​పోరాటాల ద్వారానే ప్రాజెక్టులు సాధ్యం : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మాజీ సభ్యులు చెరుపల్లి సీతారాములు

​సాగునీరు, తాగునీటి కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు, పాదయాత్రలు నిర్వహించామని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మాజీ సభ్యులు చెరుపల్లి సీతారాములు తెలిపారు. ​ఎర్రజెండా నాయకత్వంలో జరిగిన పోరాటాల ఫలితంగానే అనేక ప్రాజెక్టుల పనులు కొంతవరకు ముందుకు కదిలాయన్నారు. కానీ 80 శాతం పూర్తయిన పనులను కూడా ప్రభుత్వాలు పూర్తి చేయడం లేదని విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రారంభించిన మోటార్లను కూడా ఆపేశారన్నారు. సాగునీటి సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

​ఆర్డీవోకు వినతిపత్రం

మహాధర్నా సందర్భంగా ఆర్డీవో వెల్మ శేఖర్ రెడ్డికి నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ స్పందిస్తూ.. కలెక్టర్, ఎమ్మెల్యే, ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్తానని తెలిపారు. ధర్నాలో సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, రైతు సంఘం రాష్ట్ర నాయకులు పి.జంగారెడ్డి, నాయకులు బూరుగు కృష్ణారెడ్డి, మాటూరి బాలరాజు గౌడ్, ఎమ్‌డి పాషా, రాగిరి కిష్టయ్య, కోట రామచంద్రారెడ్డి, గంగాదేవి సైదులు, గోశిక కరుణాకర్, దుబ్బాక జంగయ్య, అలివేలు సంజీవరెడ్డి, ఆదిమూలం నందీశ్వర్, మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్