ట్రంప్ పాలనపై ఓటర్లలో తీవ్ర వ్యతిరేకత
పట్టున్న రాష్ట్రాల్లోనూ చేజారుతున్న వైనం
38 శాతానికి పడిపోయిన అధ్యక్షుడి రేటింగ్
అమెరికాలో కీలక మధ్యంతర ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. భారత కాలమానం ప్రకారం మంగళ వారం సాయంత్రం 3.30 గంటలకు వర్మంట్ రాష్ట్రంలో తొలుత పోలింగ్ మొదలైంది. ఆ తర్వాత 4.30 గంటలకు న్యూజెర్సీ, వర్జీనియా, కనెక్టికట్, కెంటుకీ రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల మధ్య జార్జియా, ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, న్యూయార్క్ రాష్ట్రాల్లో పోలింగ్‌ను ప్రారంభించారు. సాయంత్రం ఐదు గంటలకు ఓహియో, నార్త్ కరోలియా రాష్ట్రాల్లో పోలింగ్‌ను మొదలు పెట్టారు. సాయంత్రం ఐదున్నర గంటలకు మిచిగాన్ రాష్ట్రంలో పోలింగ్ మొదలైంది. కాగా బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు జార్జియా, ఇండియానా, కెంటుకీ, సౌత్ కరోలినా, వర్జీనియా, వర్మంట్లో పోలింగ్ ముగుస్తుంది. ఆరు గంటలకు నార్త్ కరోలినా, ఓహియో, వెస్ట్ వర్జీనియాలోనూ, ఆరున్నరకు ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, మేరీల్యాండ్, మాసాచూసెట్స్, న్యూజెర్సీ, ఇల్లినాయిస్, మిస్సోరీ తదితర 16 రాష్ట్రాల్లోనూ, ఉదయం 7.30 గంటలకు టెక్సాస్, అరిజోనా, కొలరాడో, మిన్నెసోటా, విస్కాన్సిన్, న్యూయార్క్, మిచిగాన్‌లోనూ, ఉదయం 8.30 గంటలకు నెవాడా, మోంటానా, ఉటాలోనూ, ఉదయం 9.30 గంటలకు కాలిఫోర్నియా, వాషింగ్టన్, ఐడహో, ఒరెగాన్లోనూ, ఉదయం 10.30 గంటలకు హవాయిలోనూ పోలింగ్ ముగుస్తుంది. ఉదయం 11.30 గంటలకు అలస్కాలో ముగిసే పోలింగ్‌తో ప్రక్రియ పూర్తవుతుంది.
ఆందోళన కలిగిస్తున్న జీవనవ్యయం
రిపబ్లికన్ పార్టీ పైన, దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు పైన అమెరికా ఓటర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పలు పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా రోజురోజుకూ పెరుగుతున్న జీవనవ్యయం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు, ఇరాన్‌పై సాగిస్తున్న పోరు కారణంగా ఆహార, ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. ఓటు వేయడానికి వెళుతున్న వారిలో చాలా మంది ఈ విషయాల పైనే చర్చించుకోవడం కన్పించింది. రిపబ్లికన్లకు గట్టి పట్టున్న రాష్ట్రాల్లో సైతం ట్రంప్ సుడిగాలి పర్యటనలు చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. బ్యాలెట్‌పై ఉన్నది తానేనని భావించాలని అభ్యర్థించారు. సురక్షిత స్థానాల్లో సైతం రిపబ్లికన్ పార్టీ పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తోంది.
పట్టున్న రాష్ట్రాలు చేజారతాయా ?
వాస్తవానికి అధికార రిపబ్లికన్ పార్టీకి ట్రంప్ ఓ పెద్ద గుదిబండలా మారారు. అధ్యక్షభవనంలోకి రెండోసారి ప్రవేశించినప్పుడు ఆయన రేటింగ్ అద్భుతంగా ఉండేది. అయితే ఇరాన్‌పై యుద్ధం దానిని పతనం చేసింది. యుద్ధం మొదల వడానికి ముందు... అంటే ఫిబ్రవరి ప్రారంభం లో గ్యాలన్ డీజిల్ ధర 3.75 డాలర్లు ఉంటే సెప్టెంబర్ నాటికి 6.52 డాలర్లకు చేరింది. ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పుడు 3 శాతంగా ఉన్న ద్రవ్యో ల్బణం ఇప్పుడు 3.7 శాతానికి పెరిగింది. ప్రతీకార సుంకాలు విధించకుండా ఉంటే ఇది మరింత తగ్గి ఉండేదని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. ఆర్థిక పరిస్థితులు టెక్సాస్, ఓహియో, కన్సాల్ వంటి రాష్ట్రాల్లో తమ కొంప ముంచుతాయేమోన ని రిపబ్లికన్లు భయపడుతు న్నారు. అధ్యక్ష ఎన్ని కల్లో ట్రంప్‌కు మంచి ఆధిక్యత ఇచ్చిన రాష్ట్రాలు ఇప్పుడు డెమొక్రాట్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. రిపబ్లికన్ ఓటర్లలో పలు వురు ట్రంప్ పనితీరుపై మండి పడుతున్నారు. ఓటింగ్ మొదలవడానికి ముందు నిర్వ హించిన తుది పోల్స్‌లో ట్రంప్ రేటింగ్ 38 శాతంగా నమోదైంది.
మధ్యంతరం అంటే..?
అమెరికాలో మధ్యంతర ఎన్నికల పోలింగ్ మొదలైంది. అమెరికా కాంగ్రెస్‌లో రెండు సభలు ఉంటాయి. అవి ప్రతినిధిసభ, సెనెట్. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ సభలకు ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్షుడి పదవీకాలం నాలుగు సంవత్సరాలు కాగా అందులో రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ ఎన్నికలను నిర్వహిస్తారు. అందుకే వీటిని మధ్యంతర ఎన్నికలు అంటారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్‌ను ఏ రాజకీయ పార్టీ నియంత్రించాలో నిర్ణయిస్తాయి. కాంగ్రెస్‌లో రిపబ్లికన్లు ఆధిపత్యం ప్రదర్శిస్తే దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మిగిలిన రెండు సంవత్సరాల పదవీకాలాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా నిర్వర్తిస్తారు. ఒకవేళ రిపబ్లికన్లు గెలిస్తే మాత్రం ఆయనకు గడ్డు పరిస్థితులు ఎదురవక తప్పదు.
ఏ సభలో ఎన్ని స్థానాలకు ఎన్నికలు ?
కాంగ్రెస్ దిగువసభ అయిన ప్రతినిధిసభలోని మొత్తం 435 స్థానాలకూ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికైన సభ్యుల పదవీకాలం రెండు సంవత్సరాలు. బిల్లులను ప్రవేశపెట్టి, వాటిపై చర్చించేది ఈ సభలోనే. ఎగువసభ సెనెట్‌లో 100 స్థానాలు ఉంటాయి. అయితే వాటిలో 35 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగు తున్నాయి. సెనెటర్ల పదవీకాలం ఆరేండ్లు. ప్రతినిధిసభ పంపిన బిల్లులను ఆమోదిం చేది లేదా తిరస్కరించేది సెనెటర్లే. ప్రతినిధసభ, సెనెట్‌తో పాటు అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఓటర్లు రాష్ట్ర స్థాయి నేతలను...అంటే గవర్నర్లను కూడా ఎన్నుకుంటారు. ముఖ్యంగా కాలిఫోర్నియా, ఫ్లోరిడా, జార్జియా, మిచిగాన్ రాష్ట్రాల గవర్నర్ పదవులకు జరిగే ఎన్నికలు ఆసక్తిని కలిగిస్తాయి.
స్వల్ప మెజారిటీతో నెట్టుకొస్తున్న రిపబ్లికన్లు
ప్రస్తుతం ప్రతినిధిసభ, సెనెట్ రిపబ్లికన్ల నియంత్రణలోనే ఉన్నాయి. అయితే వారు స్వల్ప మెజారిటీతోనే నెట్టుకొస్తున్నారు. ప్రతినిధిసభలో వారికి 218 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఓ స్వతంత్ర సభ్యుడు కూడా వారికి మద్దతు ఇస్తున్నారు. ఇక సెనెట్‌లో రిపబ్లికన్లకు 53 స్థానాలు, డెమొక్రాట్లకు 45 స్థానాలు ఉన్నాయి. వీరితో పాటు ఇద్దరు స్వతంత్ర సభ్యులు కూడా సెనెట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో రిపబ్లికన్లు 51 స్థానాలు గెలుచుకుంటేనే ఎగువసభలో అధికార మార్పిడి జరుగుతుంది.






కామెంట్లు (0)