Magazines

తొలుత ధరలు పెంచి ఆశలు ఇప్పుడు తగ్గించి దోపిడీ

1 గంట క్రితం

exploiting
avatar
balaji

ప్రచురించబడింది నవం 22, 2026 | 3 నిమిషాల చదవడం

దళారుల సిండికేట్‌‌తో 
 రైతులకు కష్టాలు

ఎర్ర పొట్టు, తెల్ల పొట్టు 
పేరుతో వివాదం

తెల్లపొట్టు ధాన్యం కొనుగోలుకు ముందుకురాని వ్యాపారులు

నెలరోజులుగా రోడ్లపైనే
 ధాన్యం కుప్పలు


నవతెలంగాణ-నాగిరెడ్డిపేట్

వర్షాలు సమృద్ధిగా కురవడం.. పోచారం ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరడంతో కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి మండలాల రైతులు విస్తృతంగా పంటలు పండించారు. మంచి దిగుబడులు సాధించారు. పంట చేతికొచ్చిన వేళ ధాన్యానికి మంచి ధర లభిస్తుందని రైతులు ఆశించారు. తొలుత దళారులు అమాంతంగా రేట్లు పెంచి రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. సన్న ధాన్యానికి క్వింటాకు రూ.3400 నుంచి రూ.3800 వరకు ధర పలకడంతో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాకుండా దళారులకు విక్రయించారు. మొదటగా తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేసిన దళారులు.. ప్రస్తుతం ధరలు తగ్గించి రూ.2800 నుంచి రూ.3వేల వరకు మాత్రమే ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అలాగే బస్తాకు రెండు కేజీల తరుగును తీసుకుంటూ రైతులకు తీవ్ర నష్టం చేకూరుస్తున్నారు. దళారులు సిండికేట్‌గా మారి అమాంతం ధరలు తగ్గించడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నారు. తెల్లపొట్టు,, ఎర్రపొట్టు అంటూ కొత్త వివాదాన్ని తెరపైకి వచ్చి కొనుగోళ్లలో మెలికలు పెడుతున్నారు. దీంతో దళారులు నిర్ణయించిన ధరకే తమ ధాన్యాన్ని విక్రయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా ప్రశ్నిస్తే తమ ధాన్యం కొనడం లేదని రైతులు తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దళారులు ఆగడాలకు అడ్డుకట్ట వేసి మద్దతు ధర అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

​మార్కెట్‌లో తొలిసారి ఎర్రపొట్టు, తెల్ల పొట్టు మాట..

నాగిరెడ్డిపేట్‌ మండల వ్యాప్తంగా సుమారు 30 వేల ఎకరాల్లో వరి ధాన్యాన్ని రైతులు సాగుచేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికంగా సన్నరకం ధాన్యాన్ని సాగుచేశారు. స్వల్పంగా దొడ్డు రకం ధాన్యాన్ని పండించారు. అయితే రాష్ట్రంలోనే తొలిసారిగా సన్నధాన్యానికి తెల్ల పొట్టు, ఎర్ర పొట్టు పేరు వినిపిస్తుందని రైతులు చెబుతున్నారు. కర్నాటకకు చెందిన వ్యాపారులు నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో ప్రవేశించి మొదటగా ధాన్యం కొనుగోలు చేశారు. ‌కర్నాటక వ్యాపారులు ముందుగా ఎర్ర పొట్టు ధాన్యాన్ని మాత్రం కొనుగోలు చేయడంతో జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ప్రతి దళారీ నోట ఎర్రపొట్టు ధాన్యం పేరు వినిపిస్తుంది. దీంతో ఎర్ర పొట్టు సన్నధాన్యం పంటలైన కేఎన్ఎమ్ 7715, సూపర్ ఆమన్ ధాన్యాన్ని మాత్రం దళారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. సన్నరకంలో తెల్లపొట్టుతో ఉన్న ధాన్యం రకాలైన కేఎన్ఎమ్ 168, ఆర్ఎన్ఆర్, జైశ్రీరామ్ తదితర తెల్ల పొట్టు ఉన్న ధాన్యాన్ని దళారులు కొనుగోలు చేయడం లేదు. దీంతో తెల్లపొట్టున్న రైతుల ఆశలు నీరుగారుతున్నాయి. తెల్ల పొట్టు ధాన్యాన్ని కొనేవారు లేక గ్రామాల్లో, రోడ్లపై ధాన్యం కుప్పల రాశులు నెల రోజులుగా దర్శనమిస్తున్నాయి.

​ దళారులు సిండికేట్‌

దళారులంతా ఒక్కటే ధరలు తగ్గించడంతో రైతులకు మరోదారిలేకుండా పోయింది. పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడులు, కోతలు, నూర్పిళ్ల ఖర్చులు పెరిగిన నేపథ్యంలో తక్కువ ధరకు ధాన్యం విక్రయించాల్సి రావడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి చేసేదేమీ లేక వచ్చిన కాడికి అమ్ముకోవాల్సి వస్తున్నదని ఎల్లారెడ్డి, లింగంపేట్, నాగిరెడ్డిపేట్‌ మండలంలోని రైతులు అంటున్నారు.


​నెల రోజులుగా కావలి ఉంటున్నా..

ధాన్యం పంట కోసినప్పటి నుంచి ఇప్పటివరకు నెల రోజులుగా కుప్ప వద్ద కావాలి పడుకుంటున్నాం. గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలున్నాయి. తెల్ల పొట్టు పేరుతో కొనుగోలు చేయడం లేదు. అధికారులు దయ చూపి మార్కెట్‌లో నడుస్తున్న ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి మా బతుకులు కాపాడాలి. ప్రభుత్వం అందించే బోనస్‌ను ధాన్యం డబ్బులతో పాటు వేస్తే ఎంతో మేలు కలుగుతుంది.
- పరమల్ల లక్ష్మి, రైతు, గోలి లింగాల


కాంటా వద్ద పడిగాపులు కాస్తున్నాం
నాకు రెండెకరాల భూమి ఉండగా.. సన్న రకం వరి సాగుచేశాను. పంట కోసి నెల రోజులు అవుతుంది. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం తరలించాను. తెల్ల పొట్టు ధాన్యాన్ని దళారులు ఎవరూ కొనడం లేదు. మండలంలో ఉన్న దళారులందరి వద్దకు వెళ్ళినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. పంట కోసం అప్పు తెచ్చిన వారు పైసలు కట్టుమని నిత్యం ఇంటికి వస్తున్నారు. ఇక్కడ ధాన్యం ఎవరూ కొనడం లేదు. కలెక్టర్ సార్ స్పందించి మాకు న్యాయం చేయాలి.
- ఏర్పుల కిష్టయ్య, రైతు, గోలిలింగాల

​

ప్రభుత్వమే రైతులపై దయ చూపాలి

నేను ఆరు ఎకరాల్లో సన్నధాన్యం వరి పంట వేశాను. కొనుగోలు కేంద్రం తీసుకొచ్చి నెల రోజులవుతుంది. ఇప్పుడు తెల్ల పొట్టు ధాన్యం అంటూ ఎవరూ దళారులు కొనడం లేదు. మొదట్లో క్వింటాలు ధాన్యం ద్వారా రూ.3600 కి కొనుగోలు చేసిన దళారులు ప్రస్తుతం రూ.2800 కే కొనుగోలు చేస్తున్నారు. తెల్ల పొట్టు వద్దంటున్నారు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. ప్రభుత్వం స్పందించి సన్న ధాన్యానికి మద్దతు ధర అందించాలి. ప్రభుత్వం అందించే రూ.500 బోనస్‌ను ధాన్యం డబ్బులతో పాటు రైతుల ఖాతాల్లో జమ చేస్తే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు విక్రయిస్తాం.
- గ్యారల శంకర్, రైతు, మాల్‌తుమ్మెద


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్