Magazines

‌నైతిక విలువలు ముఖ్యం

1 గంట క్రితం

Moral values ​​are important.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 2 నిమిషాల చదవడం

వాటిని ఆచరించేవారే నిజమైన స్కౌట్ అండ్ గైడ్స్‌ : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

నిస్వార్థ సేవే నిజమైన నాయకత్వానికి పునాదులు : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

​గురుకులాల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాలను విస్తరించాలి: మంత్రి అడ్లూరి

మోడల్‌ ‌హైస్కూల్‌ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

నైతిక విలువలు కలిగిన బలమైన, స్వయం సమృద్ధి దేశ నిర్మాణానికి విద్య, యువత సాధికారత, వ్యక్తిత్వ నిర్మాణం పునాదులని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్ దోమల్‌గూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర సంఘం ప్రధాన కార్యాలయంలో ఉన్న మోడల్ హైస్కూల్ ఆధునీకరణ, పునరుద్ధరణ పనులకు శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడంతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో చేపట్టిన సుందరీకరణ పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర అధ్యక్షులు శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. నైతిక విలువలు కలిగిన బలమైన, స్వయం సమృద్ధి దేశ నిర్మాణానికి విద్య, యువత సాధికారత, వ్యక్తిత్వ నిర్మాణం పునాదులని పేర్కొన్నారు. నిజమైన స్కౌట్ అండ్ గైడ్ అంటే కేవలం యూనిఫామ్ ధరించిన వ్యక్తి మాత్రమే కాదని, నిస్వార్థ సేవ, క్రమశిక్షణ, ధైర్యం, కరుణ వంటి విలువలను జీవితంలో ఆచరించేవారని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను కేవలం విద్యా మార్కులతో మాత్రమే అంచనా వేయలేమని, ఉత్తమ నైతిక విలువలు, సమాజ సేవ పట్ల నిబద్ధతతో సమాజాన్ని ప్రభావితం చేయడమే నిజమైన విద్యకు నిదర్శనమని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వ్యక్తిత్వ నిర్మాణం, నిస్వార్థ సేవే నిజమైన నాయకత్వానికి గుర్తులని పేర్కొన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాథమిక నినాదమైన “సిద్ధంగా ఉండండి” స్ఫూర్తితో సమాజ సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కృత్రిమ మేధస్సు , ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత కాలంలో నైతిక విలువలు, క్రమశిక్షణ, పరస్పర సహకారం, పౌర బాధ్యతలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయని అన్నారు. ఈ విలువలే బాధ్యతాయుతమైన పౌర సమాజానికి, సమర్థవంతమైన పాలనకు పునాదులని వివరించారు.

అనంతరం ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో స్కౌటింగ్, గైడింగ్ కార్యక్రమాలను విస్తరించాలని అధికారులకు సూచించారు. తద్వారా గ్రామీణ, వెనుకబడిన, అణగారిన వర్గాల విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం, సమాజ సేవలో సమాన అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర కమిషనర్ దానకిశోర్, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర కార్యదర్శి నవీన్ నికోలస్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్