ప్రభుత్వమే ఓటర్లను ఎంపిక చేస్తోంది
ప్రజాస్వామ్యానికి ఇది పెను ప్రమాదం
రాజ్యాంగ పరిరక్షణ వేదిక సదస్సులో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి
తొలగించిన 13 కోట్ల ఓట్లను పబ్లిక్ డొమైన్లో పెట్టాలి : ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్
నవతెలంగాణ - ఉస్మానియా యూనివర్సిటీ
‘సర్’ పేరిట దేశంలో పౌర హక్కుల విధ్వంసం జరుగుతోందని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ‘ భారత రాజ్యాంగం-ఓటు హక్కు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఇండియా బైఫర్గేషన్ జరిగినప్పుడు పాకిస్తాన్ నుంచి వలసలు కొనసాగుతున్న సందర్భంలో సైతం దేశంలో ఓటు హక్కును ప్రభుత్వమే పారదర్శకంగా ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ నేడు పౌరులు తమ ఓటు హక్కును రక్షించుకునే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇండియాలో ఓటర్లు ప్రభుత్వాలను ఎన్నుకోవడం లేదనీ, ప్రభుత్వాలే ఓటర్లను ఎంపిక చేస్తున్నాయని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని హెచ్చరించారు. సర్ ప్రక్రియ జరిగిన రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఎందుకు మారాయో ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ర్టంలో సర్ జరుగుతున్న ప్రక్రియపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఓటు నమోదుకు పూర్వీకుల ఓటు ఎలా ప్రాతిపదిక అవుతుందని ప్రశ్నించారు. తాతలు, తండ్రులు ఓటు హక్కు నమోదు చేసుకోకుంటే వారికి ఓటు హక్కు ఇవ్వబోమనడం రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని విమర్శించారు. స్వాతంత్ర్యానంతరం నుంచి దేశంలో పలుమార్లు సర్ ప్రక్రియ జరిగినా ఎన్నడూ రాని ఆక్షేపణలు ఇప్పుడెందుకు వస్తున్నాయో ఆలోచించాలని యువతకు సూచించారు. సర్‌లో జరుగుతున్న తప్పులను ఆధారాలతో సహా ఎత్తి చూపిన మీడియా కథనాలను పరిగణనలోకి తీసుకుని తీర్పులివ్వబోమనే దుస్థితిలో కోర్టులు కొట్టుమిట్టాడుతున్నాయని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని న్యాయ వ్యవస్థ నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేమని స్పష్టం చేశారు.
ఓట్ల తొలగింపునకు కేంద్రం కుట్ర : పరకాల ప్రభాకర్
దేశంలోని పేదలు, మహిళలు, బడుగు బలహీనవర్గాలు, మైనార్టీల ఓట్లను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నుతోందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు నచ్చని వారి ఓట్లను తొలగించడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య దేశంలో గంపగుత్తగా ఓట్లను తొలగించే కుట్ర జరగలేదన్నారు. దేశంలో సర్ పేరిట ఇప్పటి వరకు తొలగించిన 13 కోట్ల ఓట్లను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ‘ఈ దేశం అందరిది. దేశ సరిహద్దుల్లో నివసించే ప్రతీ ఒక్కరిది. కొంత మందిదే అనే భావనను ఓ వర్గం ఏకాభిప్రాయంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. సర్ ప్రయోగం ఇందులో భాగమే. దీనిపై యువత అప్రమత్తంగా ఉండాలి...’ అని ఆయన హెచ్చరించారు.
ప్రొఫెసర్ ఆమంచి నాగేశ్వర్ ఆధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాసీం, రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ డీజీ నరసింహారావు, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు జి.రాములు, సివిల్స్ అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్, ప్రొఫెసర్లు సమున్నత, రమేష్, మాయాదేవి, క్రిస్టోఫర్, వెంకటనారాయణ, వంశీధర్, తెలుగు అకాడమీ డైరెక్టర్, డాక్టర్ గుమ్మడి అనురాధ, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆర్ఎల్. మూర్తి, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మమత, ఓయూ కార్యదర్శి అజయ్ కుమార్ ఉపాధ్యక్షులు మంచాల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.





కామెంట్లు (0)