సెంట్రల్ పర్చేస్ విధానాన్ని
ప్రక్షాళన చేయాలి : ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సంక్షేమ హాస్టళ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ, సెంట్రల్ పర్చేస్ విధానాన్ని ప్రక్షాళన చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్కు అవసరమైన పరికరాలు, సాంకేతిక సిబ్బందిని ప్రభుత్వం సమకూర్చాలని కోరింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రజినీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్, సహాయ కార్యదర్శి మమతలు శుక్రవారం సంబంధిత గురుకులాల కార్యదర్శులు, సంక్షేమ శాఖల కమిషనర్లకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ, సెంట్రల్ పర్చేస్ ద్వారా హాస్టళ్లకు సరఫరా అవుతున్న నిత్యావసర సరుకులు నాణ్యత లేకుండా ఉండటంతో పాటు, ఇండెంట్ ప్రకారం అవసరమైన వస్తువులు సరఫరా కావడం లేదని విమర్శించారు. చింతపండు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం వంటి వంటకు అవసరమైన వస్తువులు అందుబాటులో లేక విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. సరఫరా కాని అత్యవసర వస్తువులను స్థానికంగా కొనుగోలు చేసుకునేందుకు హాస్టల్ అధికారులకు అనుమతి కల్పించాలని డిమాండ్ చేశారు. కూరగాయలు, పండ్లు, చికెన్ తదితర వస్తువులను కూడా నేరుగా హాస్టళ్లకు డోర్ డెలివరీ చేసే విధానం తీసుకురావాలని, సరుకులను అర్ధరాత్రి కాకుండా నిర్ణీత పని వేళల్లో సరఫరా చేయాలని కోరారు. సెంట్రల్ కిచెన్స్ విధానంలో పాఠశాలలకు సెలవులు వచ్చినప్పుడు, అనారోగ్యంతో హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు, పండుగలు, ఇతర సెలవు దినాల్లో భోజనం ఎవరు అందిస్తారనే అంశంపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు.
రాత్రి భోజనానికి కేటాయించే మొత్తాన్ని ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా పెంచాలని, గ్రాముల వారీగా ఆహార పదార్థాల పరిమాణం, ధరలు, మెనూతో కూడిన అధికారిక రేట్ చార్ట్ విడుదల చేయాలని రజినీకాంత్ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయాలంటే ప్రతి హాస్టల్కు అవసరమైన స్మార్ట్ఫోన్లు లేదా ట్యాబ్లెట్లు, నెట్వర్క్ సదుపాయాలు కల్పించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తిస్థాయి ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వకుండా సిబ్బందిపై అదనపు పని భారం మోపడం సరి కాదన్నారు. ప్రతి హాస్టల్కు సాంకేతిక సహాయకుడిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం హాస్టల్ సంక్షేమ అధికారుల సమస్యలను, విద్యార్థుల అవసరాలను పరిగణనలోకి తీసుకొని తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.





కామెంట్లు (0)