Magazines

​ఇంటర్‌ బోర్డు రద్దుపై ఏకపక్ష నిర్ణయం వద్దు

3 గంటల క్రితం

unilateral
avatar
balaji

ప్రచురించబడింది నవం 21, 2026 | 2 నిమిషాల చదవడం

విద్యారంగ నిపుణులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులతో సమగ్ర చర్చలు జరపాలి

మౌలిక వసతులు కల్పించాలి..ఖాళీలను భర్తీ చేయాలి :రౌండ్‌‌టేబుల్‌ ‌సమావేశంలో వక్తల సూచన


నవతెలంగాణ - ముషీరాబాద్ ​
ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి, ఇంటర్మీడి యట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలనే నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్లొద్దని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ నాయకులు అన్నారు. ఈ కీలక మార్పుపై విద్యారంగ నిపుణు లు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలతో సమగ్ర చర్చలు జరపాలని కోరారు. హైదరాబాద్‌ గోల్కొండ క్రాస్‌రోడ్డులోని సీఐటీయూ సిటీ కార్యాలయం‌లో శనివారం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. రజినీకాంత్ అధ్యక్షత రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌టీఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి చావా రవి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లోనూ 11, 12 తరగతులు ప్రారంభించేందుకు తరగతి గదులు, ప్రయోగశాల లు, గ్రంథాలయాలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. గ్రామీణ విద్యార్థులకు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ వంటి అన్ని గ్రూపులూ అందుబాటులో ఉంచాలని, అర్హత కలిగిన అధ్యాపకులను నియమించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. నాగరాజు మాట్లాడుతూ.. ఇంటర్ బోర్డ్ రద్దును ముఖ్యమంత్రి ఏకపక్షంగా ప్రకటించడం ప్రజాస్వామ్యబద్ధ విధానం కాదన్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టే ముందు ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేయాలని, వాస్తవ సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కేవలం ఇంటర్మీడియట్ బోర్డు రద్దు, విలీనం ద్వారా విద్యార్థుల డ్రాపౌట్లు తగ్గుతాయనే ప్రభుత్వ వాదనకు ఆధారమైన గణాంకాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ విద్యలో పెరుగుతున్న కార్పొరేట్ ఆధిపత్యం, అధిక ఫీజులు, విద్యార్థులపై ఆర్థిక భారం వంటి సమస్యలను పరిష్కరించకుండా విలీన నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రభుత్వ విద్యారంగానికి ప్రయోజనం ఉండదన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలను బలోపేతం చేయడం, మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించడం, ప్రయివేటు విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు కఠినమైన చట్టాలు అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్ మాట్లాడుతూ..

ఇంటర్మీడియట్ విద్య విలీనం నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు, బోధనేతర సిబ్బంది ఉద్యోగ భద్రత, క్యాడర్, సీనియారిటీ, పదోన్నతులు, బదిలీలు, జీతభత్యాలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలపై స్పష్టమైన సర్వీస్ నిబంధనలు ప్రకటించాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవిష్యత్‌పై స్పష్టత ఇవ్వడంతోపాటు ఒక్క కళాశాలనూ మూసేయొద్దని సూచించారు. ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసిన ఆంధ్రప్రదేశ్ అనుభవాలను అధ్యయనం చేయాలన్నారు. డ్రాపౌట్లకు సంబంధించిన వాస్తవ గణాంకాలను విడుదల చేసి, వాటి కారణాలను గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోటా రమేష్, అనగంటి వెంకటేష్ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రయోజనాల కోసం చేపట్టే సంస్కరణలు స్వాగతించదగినవే అయినప్పటికీ, సంస్కరణల పేరుతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలహీనపడకూడదని,

కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రయోజనం చేకూర్చే పరిస్థితులు ఏర్పడకూడదని స్పష్టం చేశారు. ముందుగా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసి, అవసరమైన మౌలిక వసతులు, అధ్యాపకులు, ఉద్యోగుల హక్కులకు భరోసా కల్పించి, సమగ్ర చర్చలు, శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా మాత్రమే 10+2 విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. కిరణ్, కె.అశోక్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.మమత, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శులు అనిల్, నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్, రమేష్, నాయకులు ఆంజనేయులు, శ్రీరామ్ నాయక్, భారత్, సీజేపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సాయి, సునీల్, నాయకులు సునీల్, నివాస్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్