Magazines

​మిల్లులకు తరలొచ్చిన ధాన్యం

58 నిమిషాల క్రితం

Paddy
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 2 నిమిషాల చదవడం

ఒక్కరోజులోనే రూ.900 వరకు ధర కోత
కిలోమీటర్ల మేర బారులుదీరిన ట్రాక్టర్లు


నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
మాడ్గులపల్లి ​ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతన్నకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. ఒకవైపు వాతావరణ పరిస్థితులు, మరోవైపు సాగునీటి ఇబ్బందులు, ఇంకోవైపు ప్రకృతి వైపరీత్యాలు.. వీటన్నింటినీ తట్టుకుని పంటను చేతికి తెచ్చుకున్న అన్నదాతకు ఇప్పుడు ధాన్యం విక్రయమే గుదిబండగా మారింది. పంటను అమ్ముకుని అప్పులు తీర్చుకుందామంటే మిల్లుల వద్ద నిరీక్షణ తప్పడం లేదని, ధరల విషయంలోనూ తీవ్ర అన్యాయం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్లుల వద్ద సన్నధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతులు పడుతున్న ఇబ్బందులు ఆందోళన కలిగిస్తున్నాయి. వేములపల్లి, తిప్పర్తి, నకిరేకల్, మాడుగులపల్లి, దామరచర్ల, కేతేపల్లి తదితర మండలాల నుంచి వందలాది మంది రైతులు ట్రాక్టర్లలో సన్నధాన్యాన్ని మిర్యాలగూడకు తరలించారు. ఈ నేపధ్యంలో సన్నధాన్యానికి గతంలో క్వింటాకు రూ.4,000 నుంచి రూ.4,500 వరకు ధర పలికిందని, ప్రస్తుతం పచ్చిగింజ పేరుతో బుధవారం ఒక్కరోజే రూ.900 వరకు ధర తగ్గించారని రైతులు ఆరోపిస్తున్నారు.


ధాన్యం నాణ్యత, తేమ శాతం వంటి అంశాలను సాకుగా చూపుతూ ధరల్లో కోతలు విధిస్తున్నారని వాపోతున్నారు. ​​కిలోమీటర్ల మేర ట్రాక్టర్ల బారులు.. రోడ్లపైనే అన్నదాతల నిరీక్షణ! మిర్యాలగూడలోని రైస్ మిల్లుల వద్ద ధాన్యం ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయని రైతులు చెబుతున్నారు. ధాన్యం విక్రయించేందుకు వచ్చిన వందలాది ట్రాక్టర్లు రోడ్లకు ఇరువైపులా నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మిల్లుల్లో ధాన్యం దిగుమతి ఎప్పుడు జరుగుతుందో తెలియక రైతులు ట్రాక్టర్ల వద్దే పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి నిరీక్షించాల్సి రావడంతో రవాణా ఖర్చులు పెరుగుతున్నాయని, తమ సమయం వృథా అవుతోందని వాపోతున్నారు. ​ధాన్యాన్ని తిరిగి గ్రామాలకు తీసుకెళ్లాలన్నా ట్రాక్టర్ అద్దె అదనమని, మిల్లుల వద్దే విక్రయించాలన్నా ఆశించిన ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి తీసుకెళ్లలేక, మిల్లుల వద్ద అమ్ముకోలేక కొందరు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్