ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో దుర్వినియోగాన్ని ఆపాలి : టీఎస్ యూటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారనీ, ఇప్పటికీ సొంత భవనాల నిర్మాణంలో గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి ఆరోపించారు. ఒకవైపు విద్యార్థులకు సరైన తరగతి గదులు లేకుండా, డార్మెటరీలు లేకుండా గడుపుతుంటే, మరోవైపు ఉపాధ్యాయులు కూడా పనిచేసే పరిస్థితి లేక పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారని తెలిపారు. రాత్రిపూట విధులు నిర్వహించి ఇంటికి చేరేందుకు మహిళా ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అందువల్ల ప్రతి గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులకు కూడా క్వార్టర్స్ నిర్మించి వసతి సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ లోని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో గురుకులాల ఐక్య వేదిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాల ప్రతిష్ట కోసం గురుకులాలు పెట్టి వసతులు కల్పించడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు. అధికారులు ప్రభుత్వానికి సరైన మార్గనిర్దేశం చేయకపోవడంతో గురుకులాల సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించటంలో ఉపాధ్యాయులను బాధ్యులుగా చూపిస్తూ చిన్న చిన్న పొరపాట్లకు పనిష్మెంట్ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు.
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం పేరుతో గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కార్పొరేట్ స్కూళ్లను పెంచి పోషిస్తున్నదని విమర్శించారు.ఇటీవల ముఖ్యమంత్రి పాఠశాలల దత్తత, అలాగే కార్పొరేట్ స్కూళ్లను ప్రశంసిస్తూ మాట్లాడడం అనేది ఇందుకు నిదర్శనమని తెలిపారు. గురుకులాలను కాపాడుకునే బాధ్యత సిబ్బందిపై ఉన్నదనీ, అందుకు వారి సమస్యలపై పోరాటంతో పాటు సంస్థ మనుగడ కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.
వివిధ విభాగాలకు నూతన కమిటీలు
టీఎస్ యూటీఎఫ్ వివిధ విభాగాలకు ఎన్నికలు నిర్వహించి నూతన కమిటీలను ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్యవేక్షణలో కోశాధికారి డి. లక్ష్మారెడ్డి, కార్యదర్శులు ఎ. సింహాచలం, యం. వెంకటప్పలు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. మైనారిటీ గురుకుల విభాగం అధ్యక్షులుగా టి. లింగస్వామి, ప్రధాన కార్యదర్శిగా ఎం.సునీత, కోశాధికారిగా పి.నర్సింహంతో పాటు మరో 16 మంది రాష్ట్ర కమిటీగా ఎన్నుకోబడ్డారు. బీసీ వెల్ఫేర్ గురుకుల విభాగం అధ్యక్షులుగా బి. రవీందర్, ప్రధాన కార్యదర్శిగా కె. శ్రీనివాస్, కోశాధికారిగా డి.బాలకృష్ణ మరో 18 మందితో రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విభాగం అధ్యక్షులుగా డాక్టర్ బి.సురేందర్, ప్రధాన కార్యదర్శిగా యం. కరుణాకర్, కోశాధికారిగా రవికిరణ్ గా ఎన్నిక కాగా మరో 16 మందితో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. సోషల్ వెల్ఫేర్ గురుకుల విభాగం అధ్యక్షులుగా డి.ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా వి.కృష్ణ, కోశాధికారిగా యండి అనితతో పాటు 18 మందితో రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది.అనంతరం ఎన్నికైన నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ గురుకుల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన టైంటేబుల్ మార్పుతో పాటు నగదురహిత వైద్యం అందించడం, రెగ్యులర్ ఉపాధ్యాయులలాగే 010 పద్దుకింద వేతనాలు చెల్లించటం కోసం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని తెలిపారు.






కామెంట్లు (0)