బ్రాస్, పైప్ బ్యాండ్ల బలోపేతానికి డీజీపీ సీవీ ఆనంద్ నిర్ణయం
ఖాళీల భర్తీ.. ఆధునిక పరికరాలు, ప్రత్యేక అలవెన్సులు
జిల్లా, బెటాలియన్ స్థాయిల్లోనూ బ్యాండ్ల పునరుద్ధరణ
నవతెలంగాణ - ప్రత్యేక ప్రతినిధి
తెలంగాణ పోలీసు శాఖలో బ్రాస్, పైప్ బ్యాండ్లకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు డీజీపీ సీవీ ఆనంద్ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పోలీసు బ్యాండ్లు కేవలం సంగీత ప్రదర్శనలకే పరిమితం కావనీ, క్రమశిక్షణ, ఐక్యత, బలగాల గుర్తింపు, గౌరవానికి ప్రతీకలని ఆయన పేర్కొన్నారు. జాతీయ పర్వదినాలు, కవాతులు, గౌరవ వందనాలు, శాఖాపరమైన ముఖ్య కార్యక్రమాల్లో బ్యాండ్ల పాత్ర ఎంతో కీలకమన్నారు.
తగ్గిన సిబ్బంది.. తగ్గిన ఆసక్తి
తెలంగాణ పోలీసు శాఖలో కొంతకాలంగా నిర్లక్ష్యానికి గురైన బ్యాండ్లలో సిబ్బంది సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కేంద్ర బ్రాస్ బ్యాండ్‌లో 33 మంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 21 మందే ఉన్నారు. కేంద్ర పైప్ బ్యాండ్‌లోనూ పూర్తిస్థాయి సిబ్బంది లేరు. దీంతో పని చేస్తున్న సిబ్బందిలో నిరుత్సాహం నెలకొనడంతో పాటు కొత్తగా ఈ విభాగాల్లో చేరేందుకు సిబ్బంది ఆసక్తి చూపడం లేదు.
ప్రత్యేక అలవెన్సులు.. ఆధునిక పరికరాలు
ఈ పరిస్థితిని మార్చేందుకు బ్యాండ్లలో ఖాళీలను భర్తీ చేయడం, అవసరమైన ఆధునిక సంగీత పరికరాలను కొనుగోలు చేయడం, బ్యాండ్ సిబ్బందికి ప్రత్యేక అలవెన్సులు అందించడం వంటి చర్యలు చేపట్టనున్నారు. బ్యాండ్‌లో సభ్యత్వం పొందడాన్ని గౌరవప్రదమైన ప్రత్యేక బాధ్యతగా, ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దాలని డీజీపీ భావిస్తున్నారు. కేంద్ర బ్యాండ్లతో పాటు జిల్లా, బెటాలియన్ స్థాయిల్లోనూ బ్యాండ్లను పునరుద్ధరించి బలోపేతం చేయనున్నారు.
ప్రజల ముందూ ప్రత్యేక ప్రదర్శనలు
స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ వేడుకలతో పాటు పోలీసు శాఖ నిర్వహించే ముఖ్య కార్యక్రమాల్లో బ్యాండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వీటితోపాటు ప్రజల కోసం ప్రత్యేక సంగీత ప్రదర్శనలు నిర్వహించి పోలీసు శాఖకు, ప్రజలకు మధ్య మరింత అనుబంధాన్ని పెంపొందించనున్నారు. పోలీసు శాఖలోని గుర్రపు దళం (మౌంటెడ్ బెటాలియన్) తరహాలోనే బ్యాండ్లకు కూడా పూర్వ వైభవం తీసుకొచ్చి, వాటిని బలగాల గౌరవ ప్రతీకలుగా నిలబెట్టడమే ఈ కార్యక్రమం లక్ష్యం.






కామెంట్‌లు (0)