ట్యాంక్ బండ్ తరహా రూపురేఖలు
సుమారు రూ. 6 కోట్లతో సుందరీకరణకు ప్రణాళిక
పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు
నవతెలంగాణ - గోషామహల్
హైదరాబాద్ నగర చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచిన పురానాపూల్‌కు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. సుమారు రూ.6 కోట్లతో ఈ చారిత్రక వంతెనను సుందరీకరించి, ట్యాంక్‌బండ్ తరహాలో పర్యాట కులను ఆకర్షించే కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న సుందరీకరణ పనుల్లో భాగంగా వంతెనకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లు నిర్మించడం, రాతి కట్టడాల నిర్మాణ శైలికి అనుగుణంగా మరమ్మతులు, రంగులద్దడం వంటి పనులు చేపట్టనున్నారు. కూరగాయల మార్కెట్‌కు వచ్చే కొనుగోలుదారులకు అనువుగా ఏర్పాట్లు చేయడంతో పాటు మూసీ నదికి ఇరువైపులా ముఖద్వారాలు, ఆకర్షణీయమైన శిల్పాలు, విద్యుద్దీపాల అలంకరణ చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వంతెన పరిసరాల పరిశుభ్రత, ఆక్రమణలు తొలగింపు, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించనున్నారు.
చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం
మూసీ నదిపై కుతుబ్‌షాహీల కాలంలో నిర్మించిన పురానపూల్ హైదరాబాద్ నగరంలోనే తొలి వంతెనగా చారిత్రక గుర్తింపు పొందింది. క్రీ.శ. 1578లో ఇబ్రహీం కులీ కుతుబ్‌షా హయాంలో నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. గోల్కొండ కోటలో నివసించిన సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్‌షా ఈ వంతెనను నిర్మించినట్టు ప్రచారంలో ఉంది. పురానాపూల్ హైదరాబాద్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అప్పటి గోల్కొండ ప్రాంతాన్ని నూతన నగరంతో అనుసంధానించే కీలక మార్గంగా ఉపయోగపడింది. రాతి నిర్మాణ శైలిలో 22 కమానులతో సుమారు 600 అడుగుల పొడవుతో నిర్మించిన ఈ వంతెన ఆనాటి ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది.
కాలక్రమంలో ఆక్రమణలు.. చెత్తాచెదారం
కాలక్రమేణా నిర్వహణ లోపం, ఆక్రమణలు, చెత్తాచెదారం, పిచ్చిమొక్కల పెరుగుదలతో ఈ చారిత్రక కట్టడం తన పూర్వపు కళను కోల్పోయింది. ఈ నేపథ్యంలో పురానాపూల్‌ను సమగ్రంగా అభివృద్ధి చేసి సుందరీ కరించాలన్న ప్రతిపాదనకు అధికారులు సానుకూలత వ్యక్తం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా పురానాపూల్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాలిస్తే పాతబస్తీకి కొత్త కళ రానుంది.
ప్రత్యేకత..
1908లో మూసీ నదికి వచ్చిన భీకర వరదలను తట్టుకుని నిలబడిన ఏకైక వంతెన పురానపూల్ నాడు విదేశీ ప్రయాణికుల ప్రశంసలు పొందింది. అసఫ్ జాహీల కాలంలో హైదరాబాద్‌ను సందర్శించిన ఫ్రెంచ్ యాత్రికుడు 'టావెర్నియర్' ఈ వంతెన నిర్మాణ శైలికి ముగ్ధుడై, దీనిని పారిస్‌లోని ప్రసిద్ధ 'పొంట్ న్యుఫ్' (పొంట్ న్యుఫ్) వంతెనతో పోల్చాడు. 1820లో దెబ్బతిన్నప్పుడు నవాబ్ సికందర్ షా దీనికి మరమ్మతులు చేయించారు. ప్రస్తుతం మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది.





కామెంట్లు (0)