ఏడాదికి 2వేలకుపైగా హత్యకు గురవుతున్న దళితులు, మహిళలు
హిందుత్వ ఎజెండాను అమలు చేసేందుకు కుట్ర
దేశంలో వ్యాపారంగా మారిన విద్య, వైద్యం
ప్రజావ్యతిరేఖ విధానాలు అవలంబిస్తున్న కేంద్రం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది 2వేల మందికిపైగా హత్యకు గురవుతున్నట్టు తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఈసీఐఎల్ కమలానగర్లోని ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం పార్టీ నాయకులు సీహెచ్.ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రభుత్వరంగ సంస్థల రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై ఈడీ, సీబీఐ దాడులు చేపిస్తున్నారన్నారు. పెట్టుబడిదారీ విధానాల వల్లనే దేశంలో పేదరికం, నిరుద్యోంతోపాటు ఇతర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 75శాతం సంపద 10శాతం జనం వద్దనే పోగై ఉందన్నారు. దేశంలో ఒక్క శాతంగా ఉన్న కార్పొరేట్ల వద్దనే 60శాతం సంపద పోగై ఉందనీ, కొద్దిమంది చేతుల్లోనే రూ.138 లక్షల సంపద ఉందన్నారు. ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేఖంగా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయనీ, ఇందుకు పెట్టుబడిదారీ విధానాలే కారణమని అన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్లకు అనుకూలమైన చట్టాలను కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్నదని తెలిపారు. వ్యవసాయ రంగంలోకి పెట్టుబడిదారీ వ్యవస్థను తీసుకొచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. హిందుత్వ ఎజెండాను అమలు చేసే కుట్రలో భాగంగా పోరాట యోధుల పోరాటాలను వక్రీకరిస్తున్నారని తెలిపారు. ఎన్నికల వ్యవస్థ బీజేపీ, ఆర్ఎస్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తూ, ఎవరికి ఓటు హక్కు ఉండాలనీ, ఎవరికి ఉండొద్దు అని నిర్ణయిస్తోందన్నారు. రాష్ట్రాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు మోడీ, షా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దేశంలో విద్య, వైద్యం వ్యాపారంగా మారడటంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో దాదాపు 6లక్షల బోర్లు ఎండిపోతే ప్రభుత్వం ప్రత్నామ్నాయం ఆలోచించడం లేదన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే బీజేపీ ప్రయత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ తమను సంప్రదించినట్టు తెలిపారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల స్థానంలో వామపక్షాల తరుపున అభ్యర్థిని బరిలోకి దింపుతున్నట్టు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ స్థానంలో బీజేపీని ఓడించే వారికి మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. సీపీఐ(ఎం) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పి.సత్యం మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగాల్లేకుండా చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమాలు చేపట్టాలన్నారు. ప్రపంచమంతా ఉద్యమాలు, పోరాటాల వైపు చూస్తోందనీ, ఇలాంటి వాటికి రిటైర్డ్ ఉద్యోగులు వెన్నుదన్నుగా ఉండాలని కోరారు. మార్పు అనివార్యం అనీ, సమస్యలు, కష్టాలు ఉన్నంత కాలం ఎర్ర జెండా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోమటి రవి, రాఘవరావు, యాదగిరిరావు, శ్రీమన్నారాయణ, దేవిరెడ్డి, శివరామకృష్ణ, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)