Magazines

దక్షిణ మధ్య రైల్వే నిఘా వారోత్సవాలు

55 నిమిషాల క్రితం

South Central Railway Vigilance Awareness Week
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

దక్షిణ మధ్య రైల్వే అక్టోబర్ 26 నుంచి నవంబర్ ఒకటి 2026 వరకు “నిఘా అవగాహన వారోత్సవాలు – 2026” ని నిర్వహిస్తున్నది. ఏడాదికి “సత్యనిష్టతో సమృద్ధి” అనే అంశాన్ని ఇతివృత్తంగా ఎంచుకున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ ‘సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ ఎగ్జిక్యూటివ్ వైస్-ఛైర్మెన్‌, డైరెక్టర్ జనరల్, తెలంగాణ మాజీ డీజీపీ రవి గుప్తా హాజరయ్యారు. అతిథులుగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆశిష్ మెహ్రోత్రా పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ విభాగాల ప్రధానాధికారులు, సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల రైల్వే మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులు మరియు సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్, అధికారులు, సిబ్బంది చేత సత్యనిష్ట ప్రతిజ్ఞ చేయించడంతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా, ముఖ్య అతిథి రవి గుప్తా, జనరల్ మేనేజర్, అదనపు జనరల్ మేనేజర్, సీనియర్ డిప్యూటీ జీఎంలతో కలిసి “అనిమిషా” విజిలెన్స్ బులెటిన్ 59వ సంచికను విడుదల చేశారు. ఈ బులెటిన్ దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంది .

ఈ సందర్భంగా రవి గుప్తా మాట్లాడుతూ కేవలం ఆర్థిక అవినీతికి దూరంగా ఉండటం మాత్రమే కాదనీ, నైతికంగా పనిచేస్తూ మన వంతు ఉత్తమ కృషిని అందించడం కూడా అందులో భాగమని చెప్పారు. నిజాయితీ అనేది కేవలం ఒక నైతిక సద్గుణం మాత్రమే కాదనీ, దేశపట్ల విశ్వాసానికి , అభివృద్ధికి అది ఒక ముఖ్యమైన పునాది అని ఆయన నొక్కి చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సభను ఉద్దేశించి మాట్లాడుతూ నివారణా నిఘా ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. నిఘా విభాగం యొక్క భాద్యత తప్పులను గుర్తించడం కాదనీ, అవకతవకలను నివారించడం, వ్యవస్థలను బలోపేతం చేయడం, జవాబుదారీతనాన్ని నిర్ధారించడం అని చెప్పారు. లక్షలాది మంది ప్రయాణికులతో వ్యవహరిస్తూ, భారీ పరిమాణంలో సరుకు రవాణాను నిర్వహిస్తున్నదన్నారు.

అంతకుముందు దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాశ్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతిపాదించిన విలువలను పరిరక్షిస్తూ, నిజాయితీ, నైతికతతోపాటు అంకితభావంతో విధులు నిర్వర్తించేందుకు అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆశిష్ మెహ్రోత్రా స్వాగతోపన్యాసం చేసి, విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, అవినీతి వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ, విజిలెన్స్ అవగాహన వారోత్సవం ప్రధాన సందేశాన్ని చాటిచెప్పేలా రైల్వే సిబ్బంది “తీస్రీ ఆంఖ్” పేరిట నాటకాన్ని ప్రదర్శించారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా, చీఫ్ విజిలెన్స్ కమిషన్ నిర్దేశించిన ఇతివృత్తంపై రైల్వే పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, వివిధ రైల్వే కార్యాలయాల సిబ్బంది ఇంగ్లీష్, హిందీ భాషల్లో వ్యాసరచన పోటీలు, పోస్టర్ చిత్రలేఖన పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి కార్యక్రమంలో బహుమతులను అందజేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్