Magazines

వణికిస్తున్న అర్నాబ్ తుపాన్

1 గంట క్రితం

Arnab Storm
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 3 నిమిషాల చదవడం

వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో అప్రమత్తమైన యంత్రాంగం

రైతాంగాన్ని వీడని ఆందోళన
నేలపాలైన వరి, దెబ్బతింటున్న పత్తి
కల్లాల్లో తడిసిన మక్కలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సరాసరి వర్షపాతం 10.2మీమీ గా నమోదు


నవతెలంగాణా - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/బయ్యారం

​బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్ తుపాత్‌ ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులతో కూడిన ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని రోజులుగా తీవ్రమైన వేడిని ఎదుర్కొన్న సామాన్య ప్రజలకు ఈ వాతావరణం కొంత ఉపశమనాన్ని కలిగిస్తున్నప్పటికీ, మరోవైపు అన్నదాతలను మాత్రం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఏపీ సరిహద్దు ప్రాంతాలైన సత్తుపల్లి, అశ్వారావుపేట, వేంసూరు, దమ్మపేట మండలాలతో పాటు పెనుబల్లి, భద్రాచలం, మణుగూరు, చర్ల, పాల్వంచ, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంది. ఎల్‌నినో ప్రభావంతో అడుగంటిపోయిన భూగర్భ జలాలు, ఎండిపోయిన రిజర్వాయర్లు ఈ వర్షాలతో కొంతమేరకు పుంజుకునే అవకాశం ఉంది. కానీ, చేతికి వచ్చే దశలో ఉన్న వరి, పత్తి, ఉద్యాన పంటలు నేలకొరగడంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసిపోయింది.


భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలం మర్కోడులో తాటి చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి గీత కార్మికుడు కోతి యాదగిరి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించి తుపాత్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ప్రజల ప్రాణరక్షణే ప్రథమ ప్రాధాన్యతగా భావించి అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ తుపాత్‌ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో కూడా స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా విద్యాసంస్థలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని కలెక్టర్ టీఎస్ దివాకర్ సంబంధిత మండల విద్యాశాఖ అధికారులను, సీడీపీఓలను ఆదేశించారు. తుపాత్‌ ముప్పు తొలగే వరకు జిల్లా అధికారులు, సిబ్బంది ఎవరూ హెడ్‌క్వార్టర్ విడిచి వెళ్లరాదని, వారికి మంజూరు చేసిన సెలవులను తక్షణమే రద్దు చేస్తున్నట్టు కలెక్టర్లు స్పష్టం చేశారు.


భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట ఆధ్వర్యంలో చాతకొండ నుంచి వచ్చిన 22 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉంచారు. గోదావరి పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అప్రమత్తం చేస్తున్నారు. సీతారామ ప్రాజెక్ట్‌తో పాటు పాలేరు, వైరా, కిన్నెరసాని, బేతుపల్లి రిజర్వాయర్ల పరిధిలోని నీటి మట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం ఖమ్మం కలెక్టరేట్‌‌తో పాటు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచారు. భారీ ఈదురు గాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున, విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు. రానున్న మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలు, పాతబడిన గోడలు, శిథిలావస్థలో ఉన్న భవనాలు, భారీ వృక్షాలకు దూరంగా ఉండాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

​బయ్యారంలో తడిసిన మక్కలు

ఆర్నబ్ తుపాత్‌ ప్రభావంతో కురిసిన అకాల వర్షంతోపాటు ఈదురుగాలులు వీయడంతో చేతికి వచ్చిన మొక్కజొన్న పంట నెలకొరిగింది. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోసిన మొక్కజొన్న కంకులు వర్షానికి నాని పోయాయని, మొలకలు వచ్చే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, వరి పంటకు నష్టం వాటిల్లింది. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్ఠపరిహారం అందజేసి ఆదుకోవాలని పలువురు రైతులు వేడుకుంటున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్