నష్టపోయిన వాణిజ్య పంటలకు రూ.50 వేలు
ఆహార ధాన్యాలకు రూ.30 వేలు ఇవ్వాలి
తాండూర్‌ను కరువు మండలంగా గుర్తించాలి :
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్
పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన
నవతెలంగాణ-బెల్లంపల్లి
తెలంగాణకు కేంద్రం రూ.50 వేల కోట్లు ప్రకటించాలని, నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించి రైతాంగాన్ని ప్రభుత్వాలు ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయిన పత్తి పైర్లను సీపీఐ(ఎం) రాష్ట్ర బృందం గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలిం చింది. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో కరువు తాండవిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్ల నిధులను తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలోనూ నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. మంచిర్యాల జిల్లాలో 11 కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ అందులో తాండూర్ లేదన్నారు. వెంటనే కరువు మండలంగా ప్రకటించి నష్టపోయిన వాణిజ్య పంటలకు రూ.50 వేలు, ఆహార పంటలకు రూ.30 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నారు. కరువు నేపథ్యంలో నిత్యావసర సరకుల రేట్లు భారీగా పెరిగాయని, బియ్యం కేజీ రూ.90 అయ్యిందని తెలిపారు.
ధరలు తగ్గించడంతోపాటు సబ్సిడీపై 14 రకాల సరుకులను రేషన్ షాపుల ద్వారా ఇవ్వాలని కోరారు. ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ కూలీలకు పని దొరకపోవడం లేదని, ఉపాధి హామీ పథకం ద్వారా 200 పనిదినాలు కల్పించి రోజుకు రూ. 800 ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ భరోసా పథకం అమలు చేయాలన్నారు. నష్టపో యిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేసి.. తద్వరా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రజలను ఆదుకోవాలన్నారు. కరువు ప్రాంతాలకు ఆదుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్‌డి అబ్బాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, రమణ, ఆశన్న, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు నగేష్, జిల్లా కార్యదర్శి బోడంకి చందు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గోమాస ప్రకాష్, అశోక్, నాయకులు దాగం రాజారాం, సాంబార్ వెంకటస్వామి, దాగం శ్రీకాంత్, నాయకులు పాయిరాల రాములు పాల్గొన్నారు.







కామెంట్లు (0)