Magazines

ఓటర్ల తొలగింపు ప్రక్రియ లోపభూయిష్టం

1 గంట క్రితం

Sir Process
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 2 నిమిషాల చదవడం

కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలు వాస్తవాలకు దూరం

సర్‌‌ను వెంటనే రద్దు చేయాలి : 
ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌,
 ప్రముఖ రాజకీయ విశ్లేషకులు
డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌

నవతెలంగాణ–హిమాయత్‌నగర్‌

​ప్రస్తుతం కొనసాగుతున్న సర్‌ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని, దాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఓటర్స్‌ రైట్స్‌ ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌లోని ముషీరాబాద్‌, తిరుమలగిరిలో నిర్వహించిన ప్రజా విచారణల నివేదికల ఆధారంగా మంగళవారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో సర్వే అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరి స్తున్నారన్నారు. పగటిపూట ఇండ్లలో లేని వారిని, పనులకు లేదా కార్యాలయాలకు వెళ్లిన వారిని సాయంత్రం తిరిగి సంప్రదించకుండానే ‘ఆచూకీ లేనివారు’గా నమోదు చేసి ఓట్లు తొలగిస్తున్నారని తెలిపారు. ప్రజా విచారణకు హాజరైన ఓ వ్యక్తి జీవించి ఉన్నప్పటికీ రికార్డుల్లో మరణించినట్టు నమోదు చేశారని, ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల సర్వే విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. దేశంలో 13 కోట్ల ఓటర్ల సవరణలో మూడు కోట్ల మంది విదేశీయులని, పది కోట్ల మంది మరణించారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొనడం విడ్డూరంగా ఉందని అన్నారు. మరణించిన వారి సంఖ్య అంతగా ఉంటే 15 ఏండ్లలో దేశ జనాభా ఎలా పెరిగిందని ప్రశ్నించారు. కొత్తగా 18 ఏండ్లు నిండిన యువ ఓటర్ల నమోదు కంటే పేర్ల తొలగింపునకే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నదని విమర్శించారు. ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్యానెల్‌ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, ఆయన స్థానంలో కేంద్ర మంత్రిని చేర్చడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై ప్రజల్లో విశ్వాసం తగ్గేలా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడినా, నియమావళిని ఉల్లంఘించినా ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలూ తీసుకోకుండా నిస్సహాయ స్థితికి చేరుకుందన్నారు. ప్రజా విచారణలో వెల్లడైన ఘోరమైన లోపాల దృష్ట్యా, ఈ లోపభూయిష్టమైన ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని పబ్లిక్ హియరింగ్‌లో జ్యూరీ ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చిందని, ఇదే డిమాండ్‌ను మీడియా ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు.ప్రముఖ విశ్లేషకులు డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌ మాట్లాడుతూ.. సర్‌పై కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమ వలసదారులపై ఆధారాలు చూపలేకపోయారని అన్నారు. అర్హులైన పౌరుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడాన్ని ఖండించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని హెచ్చరించారు. ఫోరం ప్రతినిధి డాక్టర్‌ ఎ. సునీత మాట్లాడుతూ.. కంటోన్మెంట్‌ పరిధిలోని 150, 151 పోలింగ్‌ బూత్‌లలో పరిశీలన సందర్భంగా పలువురిని ఏఎస్‌డీడీ (గైర్హాజరు, వలస, మరణం, డూప్లికేట్‌) జాబితాలో చేర్చి ఓట్లు తొలగించినట్టు గుర్తించామని తెలిపారు. దశాబ్దాలుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారిని సైతం ‘ఆచూకీ లేనివారు’గా నమోదు చేశారని చెప్పారు. ప్రొఫెసర్‌ పద్మజ షా, మరియా తబస్సుమ్‌, సిస్టర్‌ మంజుల, అడ్వకేట్‌ మసూద్‌, కిరణ్‌ విస్సా తదితరులు మాట్లాడుతూ.. సర్‌ ప్రక్రియతోపాటు 2025 మార్గదర్శకాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రక్రియ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేయాలని, రాబోయే జీహెచ్‌ఎంసీ, మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజా ఆడిట్‌ ద్వారా సవరించిన 2025 ఓటర్ల జాబితాలనే వినియోగించాలని డిమాండ్‌ ‌చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్