Magazines

‘తగ్గింపు’ కంటితుడుపే

25 నిమిషాల క్రితం

reduction
avatar
balaji

ప్రచురించబడింది నవం 12, 2026 | 4 నిమిషాల చదవడం

మెట్రో-ఆర్టీసీ పాస్‌లో హేతుబద్ధత ఏది?

రాయితీలు కోల్పోతున్న 
ఆర్టీసీ ప్రయాణీకులు

ధర తగ్గించి మెట్రోలో 
ప్రయాణాల కుదింపు

అందర్నీ ఒకేగాటన 
కట్టేసిన ఉమ్మడి పాస్‌

ప్రజారవాణా వైపు 
ఆకర్షించడంలో సర్కారు వైఫల్యం


ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి

మెట్రోరైల్‌-టీజీఎస్‌ ఆర్టీసీ ఉమ్మడి బస్‌పాస్‌ రేటును రూ.8,500 నుంచి రూ.4 వేలకు తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే రోజువారీ పాస్‌ను రూ.400 నుంచి రూ.275కు తగ్గించి, ప్రయాణీకులకు నవంబర్‌ 8న దీపావళి కానుకగా ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు-మెట్రో ప్రయాణాన్ని ఒకే పాస్‌తో అనుసంధానించాలన్న ఆలోచన కొత్తదేం కాదు. కానీ ఆ ఆలోచనను ప్రయాణికుడి అవసరానికి అనుగుణంగా నిర్ణయించడం ప్రభుత్వానికి మొదటి ప్రయత్నంలో సాధ్యం కాలేదు. తొలుత నిర్ణయించిన ధరలపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో నెలరోజుల వ్యవధిలో ఆ నిర్ణయాన్ని పునఃస్సమీక్షించుకోవాల్సి వచ్చింది. పోనీ ఆ సమీక్షలో క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకున్నారా అంటే అదీ లేదు. అసలు ఈ ఉమ్మడి పాస్‌ ధర నిర్ణయంలో హేతుబద్ధతపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు కనిపించట్లేదు.

ఇదెలా?

నెలవారీ ఉమ్మడి పాస్‌ను రూ.4 వేలుగా నిర్ణయించి, దానిలో మెట్రోరైల్‌లో 50 సింగిల్‌ జర్నీల పరిమితికి రూ.3వేలు, ఆర్టీసీలో అపరిమిత ప్రయాణానికి రూ.వెయ్యి కేటాయించారు. అలాగే రోజువారీ పాస్‌ను రూ.275గా నిర్ణయించి, దానిలో 4 సింగిల్‌ జర్నీల పరిమితితో మెట్రోరైల్‌కు రూ.200, ఆర్టీసీ ప్రయాణానికి రూ.75 కేటాయించారు. ప్రభుత్వం చెబుతున్న లెక్క ప్రకారం ఉమ్మడి పాస్‌ వల్ల ప్రయాణీకులకు నెలకు రూ.4,500 ఆదా అవుతుందని చెప్తున్నా, ఇక్కడే అసలు మతలబు ఉంది. ఏకపక్షంగా తొలుత పాస్‌ ధరను రూ.8,500 గా నిర్ణయించి, ఇప్పుడు దాన్ని తగ్గించి 'ఆదా' అని ప్రచారం చేస్తున్న విషయం గమనార్హం!

దూరాన్ని బట్టేగా?

రూ.4వేలు పెట్టి ఉమ్మడి పాస్‌ కొనుగోలు, మెట్రోరైల్‌కు రూ.3వేలు కేటాయింపునకు ముందు కొన్ని విషయాలను ప్రస్తావించాల్సిందే. మెట్రోరైల్‌లో కనిష్ఠ టిక్కెట్‌ ధర రూ.11, గరిష్ఠ టిక్కెట్‌ ధర రూ.69. దీన్ని మొదటి రెండు కిలోమీటర్లకు రూ.11 చొప్పున చార్జీ చేస్తారు. ఆ తర్వాత దూరం పెరుగుతున్న కొద్దీ టిక్కెట్‌ రేటు రూ.17, రూ.28, రూ.37, రూ.47, రూ.51, రూ.56, రూ.61, రూ.65గా పెరిగి, 24 కిలోమీటర్లకు మించి ప్రయాణిస్తే గరిష్ఠంగా రూ.69 చెల్లించాలి. అధికారికంగా టిక్కెట్‌ ధర దూరం ఆధారంగానే ఉంది. 50 సింగిల్‌ జర్నీలను పూర్తిగా వినియోగిస్తే ఒక్కో మెట్రో ప్రయాణానికి సగటున రూ.60 అవుతుంది. అంటే రోజూ సుదూర ప్రయాణం చేసి రూ.60-రూ.69 టికెట్‌ పరిధిలో ప్రయాణించే వ్యక్తికి పాస్‌ ఉపయోగపడుతుంది. కానీ దూరాన్ని బట్టి మధ్యలోనే దిగిపోయే ప్రయాణీకులు రూ.11, రూ.17, రూ.28 లేదా రూ.37 టికెట్‌ పరిధిలో ప్రయాణిస్తే, ఈ పాస్‌ తీసుకోవడం నిరర్థకం. ఉదాహరణకు నెలలో 50 సార్లు రూ.28 టికెట్‌ పరిధిలో ప్రయాణిస్తే మెట్రోరైల్‌లో టిక్కెట్‌ ఖర్చు రూ.1,400 మాత్రమే అవుతుంది. ఉమ్మడి పాస్‌లో మాత్రం మెట్రో భాగానికే రూ.3,000 చెల్లిస్తుండటం గమనార్హం! తక్కువ దూరం ప్రయాణించే వారికి ఈ పాస్‌ వల్ల ఎలాంటి ఉపయోగం లేదనేది స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇక్కడ ప్రభుత్వం ప్రకటించిన 'సగటు ప్రయాణికుడు' ఎవరు అన్నదే ప్రధాన ప్రశ్న. ఉమ్మడి టిక్కెట్‌ ధర కూడా దూరాన్ని బట్టే నిర్ణయించాలి కదా!

కనెక్టివిటీ ఏది?

హైదరాబాద్‌లో మెట్రో స్టేషన్లకు చేరే ఫీడర్‌ కనెక్టివిటీ ఇంకా అన్ని ప్రాంతాల్లో ఒకే స్థాయిలో లేదు. నగర ప్రజా రవాణాలో బస్సుల సంఖ్య, కొత్త ప్రాంతాలకు రూట్ల విస్తరణ, చివరి మైలు అనుసంధానం వంటి సమస్యలు ఇంకా ఉన్నాయి. ప్రజా రవాణా వాటా పెంచాలంటే పాస్‌తో పాటు, సేవల సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుంది. మెట్రో స్టేషన్‌ వరకు చేరడానికి రూ.100 ఆటో కోసం ఖర్చు చేస్తే, రూ.4,000 పాస్‌లో వచ్చిన ఆదా ప్రయోజనం అక్కడికక్కడే కరిగిపోతుంది. అందువల్ల ఉమ్మడి పాస్‌ను టికెట్‌ అనుసంధానంగా కాకుండా డోర్‌-టు-డోర్‌ ప్రయాణ విధానంగా మార్చాల్సిన అవసరం ఉంది.


ఈ రాయితీలు ఎలా?

ఉమ్మడి రోజువారీ పాస్‌ కొత్త ధర రూ.275. ఇందులో మెట్రోకు రూ.200, ఆర్టీసీకి రూ.75 కేటాయించారు. కానీ టీజీఎస్‌ఆర్టీసీలో హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ జంట నగరాల్లో రూ.100తో ఇప్పటికే 'ట్రావెల్‌-24' టిక్కెట్‌ ఉంది. ఏసీ బస్సులతో కలిపి ప్రయాణించే టికెట్‌ రూ.160 మాత్రమే. సిటీ బస్సుల్లో 24 గంటలపాటు అపరిమిత ప్రయాణం చేయవచ్చు. అలాగే ఆర్టీసీలో రూ.1,400కు జనరల్‌ పాస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ పాస్‌ రూ.1,600, మెట్రో డీలక్స్‌ పాస్‌ రూ.1,800గా ఉన్నాయి. తెలంగాణలో అర్హులైన మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్‌ ప్రయాణికులకు 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణం ఉంది. ఆర్టీసీలో స్టూడెంట్‌ జనరల్‌ బస్‌పాస్‌ రూ.600 ఉంది. దూరాన్ని బట్టి రూట్‌ పాస్‌లు రూ.225 నుంచి రూ.675 వరకు ఉన్నాయి. అలాగే ఆర్టీసీ వికలాంగులు, జర్నలిస్టుల కోసం ప్రత్యేక బస్‌పాస్‌ వ్యవస్థను కొనసాగిస్తోంది. వీరు ప్రస్తుతం సిటీలోఉచిత లేదా రాయితీ ప్రయాణం చేస్తున్నారు. వీటిని కొనసాగిస్తూ, మెట్రోకు రాయితీ ఇవ్వాల్సింది పోయి, వారికి కూడా సాధారణ ఉమ్మడి పాస్‌ను రూ.4 వేలతో ప్రత్యామ్నాయంగా చూపడం ఎలాంటి హేతుబద్ధత? ఇది ప్రజా రవాణాను ప్రోత్సహించడం ఎలా అవుతుంది?


ప్రయాణికులే ఎంచుకోవాలి

ప్రభుత్వం నిజంగా ప్రజా రవాణాను ప్రోత్సహించాలనుకుంటే ధర తగ్గింపు ఒక్కటే సరిపోదు. బస్సులో టికెట్‌ తీసుకున్న ప్రయాణికుడు నిర్దిష్ట సమయంలో మెట్రోరైల్‌ ఎక్కితే మెట్రో టికెట్‌పై రాయితీ ఇవ్వాలి. మెట్రో నుంచి బస్సుకు మారినా అదే సూత్రం అమలు చేయాలి.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కొనసాగిస్తూనే 'మెట్రో యాడ్‌-ఆన్‌' పేరుతో నెలకు 20, 30, 50 మెట్రో ప్రయాణాలకు వేర్వేరు రాయితీ ప్యాకేజీలు ఇవ్వాలి.

విద్యార్థులకు రూ.225 నుంచి రూ.675 వరకు ఉన్న ప్రస్తుత విద్యార్థి రూట్‌ పాస్‌ను కొనసాగిస్తూ, మెట్రో ట్రిప్పులను రాయితీతో జోడించాలి.

వికలాంగులు, జర్నలిస్టుల రాయితీకి రక్షణ కల్పిస్తూ ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న ప్రత్యేక ప్రయాణ హక్కును తగ్గించకుండా, మెట్రోలో కూడా సముచిత రాయితీతో ఉమ్మడి కార్డు రూపొందించాలి.

రూ.4 వేలు ఉమ్మడి పాస్‌ ఒక్కటే ఎంపిక కాకూడదు. 20, 30, 50 మెట్రో ప్రయాణాలకు వేర్వేరు ప్యాకేజీలు ఉండాలి. తక్కువ దూరం ప్రయాణించే వ్యక్తి అవసరం లేని ప్రయాణాలను ముందుగానే కొనాల్సిన పరిస్థితి ఉండకూడదు.

ఫీడర్‌ బస్సులే అసలు పరీక్ష. ప్రతి ప్రధాన మెట్రో స్టేషన్‌కు నిర్దిష్ట సమయాలతో ఫీడర్‌ బస్సులు నడపాలి. మెట్రో రైలు వచ్చిన సమయానికి బస్సు ఉండాలి. లేని పక్షంలో ప్రయాణికుడు మళ్లీ ద్విచక్ర వాహనం లేదా ఆటోనే ఆశ్రయిస్తాడు.

ఒకే కార్డులో బస్సు, మెట్రోరైల్‌ ఎక్కించడం సాంకేతిక సౌకర్యం. కానీ ప్రజా రవాణా విప్లవం కాదు. ప్రయివేటు, సొంత వాహనం వదిలి బస్సు-మెట్రోరైల్‌ వైపు వచ్చే ప్రయాణికుడి మొత్తం ప్రయాణ ఖర్చు తగ్గాలి. ఇంటి నుంచి కార్యాలయం వరకు నిరంతర కనెక్టివిటీ ఉండాలి. ఇప్పటికే ఉన్న ఉచిత, రాయితీ ప్రయాణ హక్కులు కొత్త పాస్‌ కోసం త్యాగం చేయాల్సిన పరిస్థితి రాకూడదు. అప్పుడే ఉమ్మడి పాస్‌ ప్రజా రవాణాకు ప్రోత్సాహకం అవుతుంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్