జయేష్ రంజన్‌కు పర్యావరణ శాఖ
వికాస్ రాజ్‌కు ఇంధన శాఖ బాధ్యతలు
నవతెలంగాణ-హైదరాబాద్ బ్యూరో
రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం, శాఖల నిర్వహణ అవసరాల దృష్ట్యా ప్రభుత్వం 12 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వారిలో కొందరికి అదనపు బాధ్యతలు అప్ప గించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలు, నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
- స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్) తీసుకుంటారని వార్తలు వస్తున్న తరుణంలో సీనియర్ ఐఏఎస్ అధికారి, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి (హెచ్‌ఎండీఏ పరిధి) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ (1992) ను పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. దానితో పాటే పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్‌ఐ) డైరెక్టర్ జనరల్‌గా కూడా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న వికాస్ రాజ్ (1992)ను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇప్పటి వరకు ఈ పోస్టులో ఉన్న మరో సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్‌మిట్టల్ (1996)ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
ఇప్పటి వరకు ఈ పోస్టులో ఎం దానకిశోర్ ఉన్నారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఏ వాణిప్రసాద్ (1995)ను తెలంగాణ పురావస్తుశాఖ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. రెవెన్యూ శాఖలో దేవాదాయ విభాగం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్ (1997)ను నియమించారు. - మరో ఐఏఎస్ అధికారి కే ఇలంబర్తి (2005)ని రవాణా, రహదారులు, భవనాల శాఖ కార్యదర్శిగా నియమించారు. అలాగే రవాణా శాఖ కమిషనర్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖల కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లోనూ కొనసాగుతారు. హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా పనిచేస్తున్న సర్ఫరాజ్ అహ్మద్ (2009)కు మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్‌మెంట్ కార్యదర్శి, జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి పురపాలక సంస్థల ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
- రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న రాహుల్ బొజ్జా (2000)కు గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు అదనంగా అప్పగించారు.
ఆయన వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అదనపు బాధ్యతల్లోనూ కొనసాగుతారు.
- మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా శృతి ఓఝా (2013) నియమితులయ్యారు.
- ఎస్. సంగీత సత్యనారాయణ (2015)ను మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. మహమ్మద్ ముషారఫ్ అలీ ఫారూఖీ (2014) ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా నియమించారు. ఆయన తెలంగాణ రైతు విద్యుత్తు పంపిణీ సంస్థ సీఎమ్‌డీగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ర్ట దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సీఎమ్‌డీగా పనిచేస్తున్న జితేష్ వి. పాటిల్ (2016)కు తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) ఉపాధ్యక్షుడు, నిర్వహణ సంచాలకుడి (వీసీఎమ్‌డీ)గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
గవర్నర్ స్పెషల్ ఛీప్ సెక్రటరీగా ఎమ్ దాన కిశోర్ (1996)ను నియమించారు.


![We are not against restoration; we are against the plunder being carried out in the name of the Musi [project].](https://nvtg-prd.sgp1.digitaloceanspaces.com/Brs-1793216322963-0e75c4bf-e4c1-4722-876f-c497295fdc0d-360x240.webp)




కామెంట్‌లు (0)