Magazines

ఇందిరాగాంధీ స్టేడియాన్ని క్రికెట్ అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతాం​

59 నిమిషాల క్రితం

We will develop the Indira Gandhi Stadium into a hub for cricket development.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 2 నిమిషాల చదవడం

వారం రోజుల్లో క్రికెట్ 
కోచ్‌ల నియామకం

మూడు ప్రాక్టీస్ నెట్స్ ఏర్పాటు : ​ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ

నవతెలంగాణ-కామారెడ్డి

​కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియాన్ని క్రికెట్ అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్ది, స్థానిక యువతకు మెరుగైన క్రీడా సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. స్టేడియంలో వారం రోజుల్లోగా ప్రయివేట్ క్రికెట్ కోచ్‌లను నియమించడంతో పాటు, మూడు ప్రాక్టీస్ నెట్స్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. సోమవారం ఇందిరాగాంధీ స్టేడియాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కార్యదర్శి జీవన్ రెడ్డి, సీఈఓ ఇంతియాజ్ ఖాన్‌తో కలిసి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. స్టేడియంలోని ప్రస్తుత సౌకర్యాలు, క్రికెట్ పిచ్ నిర్మాణం, ప్రాక్టీస్ నెట్స్ ఏర్పాటు, శిక్షణకు అవసరమైన మౌలిక వసతులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు నాణ్యమైన క్రికెట్ శిక్షణకు దూరం కాకూడదనే ఉద్దేశంతో స్టేడియంలో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. హెచ్‌సీఏ సహకారంతో దశలవారీగా క్రికెట్ మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామని, నాణ్యమైన పిచ్ నిర్మాణంతో పాటు శిక్షణకు అవసరమైన క్రికెట్ సామగ్రిని సమకూరుస్తామని చెప్పారు. హెచ్‌సీఏ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలు, అండర్‌-19 స్థాయి క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీనివల్ల స్థానిక యువ క్రీడాకారులకు పోటీ క్రికెట్‌పై అవగాహన పెరగడంతో పాటు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభిస్తుందన్నారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన, జట్టుగా పనిచేసే నైపుణ్యాలను పెంపొందిస్తాయని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి యువత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇందిరాగాంధీ స్టేడియం భవిష్యత్తులో ప్రతిభావంతులైన క్రికెటర్లను తయారు చేసే శిక్షణా కేంద్రంగా అభివృద్ధి చెందాలని అన్నారు.

హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచనల మేరకు వారం రోజుల్లోగా ప్రయివేటు క్రికెట్ కోచ్‌ల నియామకానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్రికెట్ సాధన కోసం మూడు ప్రాక్టీస్ నెట్స్ ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన సామగ్రిని అందజేస్తామన్నారు. త్వరలో నిర్వహించనున్న హెచ్‌సీఏ సమావేశంలో కామారెడ్డి స్టేడియంలో క్రికెట్ పిచ్ నిర్మాణం, స్టేడియాన్ని హెచ్‌సీఏ ఆధీనంలోకి తీసుకుని నిర్వహణ చేపట్టే అంశాలపై చర్చిస్తామని చెప్పారు. ఈ చర్యలతో కామారెడ్డి యువ క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణతో పాటు పోటీ క్రికెట్‌లో రాణించే అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేని సందీప్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ చంద్రకాంత్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ ఇప్ప ఉమా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్