పంట పొలాలకు నీరు నిలిపేశారు
ఇతర రాష్ట్రాలకు కరువు బృందాలు
రాష్ట్రానికి మొండి చేయి చూపిన కేంద్రం
8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉండి ఏం లాభం ?
ప్రధాని మోడీ ఇంటి ఎదుట బైటాయించి ధర్నాలు చేయాలి : నిర్మల్ రైతు గర్జన సభలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి/నిర్మల్
‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే కరువు కాటకాలు వచ్చాయి.. అసమర్థ పాలనతో తెలంగాణ ప్రజల సంక్షేమం ఆగమవుతోంది.. కేంద్రం ఇతర రాష్ర్టాలకు కరువు బృందాలను పంపి రాష్ర్టానికి పంపకుండా మొండి చేయి చూపింది’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్‌టీఆర్ స్టేడియంలో బుధవారం రైతు గర్జన సభలో ఆయన ప్రసంగించారు. అన్ని వర్గాలనూ మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అన్ని సంక్షేమ కార్యక్రమాలనూ ఆపేసిందని ఆరోపించారు. ఫీజురీయింబర్స్‌మెంట్ పెండింగ్ పెట్టారని, ఆరు నెలల్లో ఉద్యోగులకు పీఆర్‌సీ ఇస్తానని ఆపేశారని విమర్శించారు. మూడేండ్ల పాలనలో ఎవరికి న్యాయం చేశారో ప్రజలు గమనించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను పట్టి పీడిస్తోందని విమర్శిం చారు. బీడీ పరిశ్రమ మీద జీఎస్టీ వేస్తే బీడీ పరిశ్రమలకు అందగా నిలిచిన నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. కేవలం నిర్మల్ జిల్లాలోనే 63 వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చారని చెప్పారు.
రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ అడ్డగోలు హామీలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లయినా ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించారు. వరి పంటకు మద్దతు ధరతో పాటు రూ.500 అదనపు బోనస్ ఇస్తామని చెప్పి ఏ ఒక్క పంటకూ ఇవ్వలేదన్నారు. మూడు దఫాలుగా రైతుబంధు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులపాలు చేశారని చెప్పారు. రైతాంగానికి నీళ్లు బంద్, కరెంటు బంద్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బంద్ చేసి.. వారి జీవితాలతో కాంగ్రెస్ ఆటలాడు తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంట్, సమృద్ధిగా నీళ్లతో కళకళలాడిన తెలంగాణలో నేడు మళ్లీ చీకటి రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి పంటకు దుక్కి దున్నొద్దు, విత్తనం చల్లొద్దు అని చెబుతూ ప్రభుత్వం రైతుల చేత సెల్ఫ్ డిక్లరేషన్ రాయిస్తోందని అన్నారు.
నిర్మల్ జిల్లాలో 9 కరువు మండ లాలు ఎలా అవుతాయని, గోదావరి ఒడ్డు పొంటే ఉండే జిల్లాలో.. ఎస్‌ఆర్‌ఎస్పీ లాంటి ప్రాజెక్టులు ఉన్న జిల్లాలో కరువు రావడం ఏంటని ప్రశ్నించారు. కడెం ప్రాజెక్టు కింద నీళ్లు బంద్ పెట్టి రైతులను ఆగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్కపైసా ఇవ్వడం లేదని, ప్రధాని మోడీ ఇంటి ఎదుట బైటాయించి ధర్నాలు చేయాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో ఉన్న 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఏం చేస్తు న్నారని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలకు కేంద్ర కరువు బృదాలు పోయి.. తెలంగాణకు రాకుంటే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషన్ వ్యవహారంపై దేశమంతా విమర్శిస్తుంటే.. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు ర్యాలీలు తీయడం వెనుక మతలబ్ ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనీల్ జాదవ్, నాయకులు జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)