కరువు మండలాలపై సర్కారు మల్లగుల్లాలు
కేంద్రం సాయం చేయకుంటే పైసలెట్ల?
పంట నష్టపోయి ఆందోళనలో అన్నదాతలు
పట్టణాల్లో తాగునీటి ఎద్దడి
ప్రత్యామ్నాయ నిధుల సమీకరణపై సర్కార్ ఫోకస్
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం అధికారుల ఎదురుచూపులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరువు మండలాలు ప్రకటించిన రాష్ర్ట ప్రభుత్వం ఇప్పుడు నిధుల సమీకరణపై తర్జనభర్జన పడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయకుంటే సహాయ చర్యలు ఎలా చేపట్టాలో సమాలోచనలు చేస్తుంది. ఎల్నినో నేపథ్యంలో రాష్ట్రంలో 31 జిల్లాల్లో 365 మండలాల్లో కరువు ఉందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 111 మండలాల్లో తీవ్రమైన, 254 మండలాల్లో మోస్తరు కరువు నెలకొందని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు నిధుల కేటాయింపు ప్రస్తావన మాత్రం చేయలేదు. దీనిపై ఇప్పుడు ప్రజలు, రైతాంగంలో చర్చ జరుగుతున్నది. గురువారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కరువు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల సహాయాన్ని ప్రకటించాలని కోరింది. దానికోసం త్వరలోనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తామనీ ప్రకటించారు. అయితే రాష్ట్రంలో పంట నష్టానికి సంబంధించి రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటి వరకు నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించలేదు.
రాష్ర్టం ఆశించిన స్థాయిలో కేంద్రం నిధులను ఇవ్వకుంటే పరిస్థితి ఏంట నేదానిపైనే ఇప్పుడు చర్చ జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల ఆధారంగానే వివిధ శాఖల అధికారులు సహాయక చర్యలు చేపడతారు. మండలాల వారీగా నిధుల కేటాయింపుపై ఇప్పుడు క్షేత్రస్థాయి ప్రజల్లో రాజకీయ చర్చ జరుగుతున్నది.
పంటనష్టం20 లక్షల ఎకరాలపైనే...
రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 740.6 మిల్లీమీటర్లు. ఎల్నినో ప్రభావంతో 615.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ సీజన్ జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య రాష్ట్రంలో 17 శాతం లోటు వర్షపాతం ఉన్నది. దీంతో సాగు తోపాటు వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. 18 జిల్లాల్లో సాగు విస్తీర్ణం తగ్గడం గమనార్హం. రాష్ట్రం లో 139.28 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం 126.06 లక్షల ఎకరాలకు పడిపోయింది. అంటే 13.22 లక్షల ఎకరాల విస్తీర్ణం తగ్గింది.
వరి సాగు కూడా 69.19 లక్షల ఎకరాల నుంచి 57 లక్షల ఎకరాలకు పడిపోయింది. అంటే వరి పంట విస్తీర్ణం 12.19 లక్షల ఎకరాలు తగ్గింది. రైతులు పంట వేసినా నీరు, కరెంటు కొరతతో లక్షల ఎకరాల్లో ఎండిపోయినట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకుపైగా పంట నష్టం జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తున్నది. పంట నష్టపోయిన రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే పంట నష్టానికి సంబంధించిన నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరాలి. ఆ తర్వాత కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించాలి. ఆ తర్వాతే కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ నిధులు వచ్చే అవకాశమున్నది. కేంద్రం నిధులపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడే పరిస్థితి ఉన్నది. కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ నిధులు వచ్చాకే పంట నష్ట పరిహారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పంట నష్ట పరిహారం ఇప్పట్లో అందడం కష్టమేనని తెలుస్తున్నది.
కేంద్ర సాయం అనుమానమే...
రాష్ర్ట ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించినా, కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఇప్పటివరకు కేంద్రం నుంచి వివిధ స్కీంలు, ప్రోత్సాహకాలు, బడ్జెట్ కేటాయింపుల రూపంలో రావల్సిన నిధుల్లో 25 శాతం కూడా రాలేదని ఇప్పటికే ‘కాగ్’ ఆక్షేపించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ సమాచార వ్యవస్థ (ఎన్డీఎంఐఎస్), 16వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం 2026–27 నుంచి 2030–31 వరకు తెలంగాణకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డీఆర్ఎఫ్) కింద రూ.2,959 కోట్లు కేటాయించాలని సిఫారసు చేశారు. ఇందులో 2026–27 సంవత్సరానికి రూ.536 కోట్లు ఉన్నాయి. అయితే వీటి విడుదలకు కేంద్రం అనుమతి ఇస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది.
కరువు మండలాల్లో చేపట్టాల్సిన చర్యలు
ఎస్డీఆర్ఎఫ్ నిధులను కరువు సహా ప్రకటిత విపత్తుల బాధితులకు తక్షణ ఉపశమనం కల్పించేందుకు వినియోగించాల్సి ఉంటుంది. తాగునీటి సరఫరా, పశుగ్రాసం, పశువుల సంరక్షణ, నిబంధనలకు అనుగుణంగా అర్హులైన బాధితులకు సహాయం వంటి చర్యలు ఉంటాయి. గ్రామీణ ఉపాధి హామీ పనులను విస్తరించడం, వ్యవసాయ రుణాల పునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
కలెక్టర్లకు ఉత్తర్వులు
వ్యవసాయ రుణాల పునర్వ్యవస్థీకరణ కోసం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ)ని సంప్రదించాలని రాష్ర్ట ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం అనుమతించబడిన చోట వ్యవసాయ రుణాల పునర్వ్యవస్థీకరణ చేపట్టి, బలవంతపు రుణ వసూళ్లను నివారించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డిఆర్ఎఫ్) నుంచి కేంద్ర సహాయం అందిన వెంటనే పంట నష్టపోయిన రైతులకు ప్రత్యక్ష ప్రయోజన నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ఇన్పుట్ సబ్సిడీలను పంపిణీ చేయాలనీ, దానికోసం లబ్ధిదారుల జాబితాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లలో ప్రచురించాలని సూచించారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ సహాయం కోరుతూ, ప్రణాళికా శాఖ రెవెన్యూ (డీఎం) విభాగానికి వినతిపత్రాన్ని సిద్ధం చేసి, దాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపాలని సూచించారు. వర్షపాత నమోదు ప్రక్రియ కోసం కూడా విధివిధానాలు ప్రకటించింది.
పైసల్లేకుండా ప్రణాళికలు రూపకల్పన
రాష్ర్ట ప్రభుత్వం ప్రధానంగా నిధులు లేకున్నా, కరువును ఎదుర్కొనేందుకు ప్రణాళికలు మాత్రం సిద్ధం చేసింది. దానికోసం శాస్త్రవేత్తలు, నిపుణులు, రాజకీయ పార్టీలను సంప్రదించింది. లోటు వర్షపాతం నేపథ్యంలో రిజర్వాయర్లలో నీటి నిల్వలను జాగ్రత్తగా వాడుకోవాలని నిర్ణయించింది. వ్యవసాయ, పశుసంవర్ధక, నీటి పారుదల, భూగర్భజలాలు, పౌరసరఫరాలు, తాగునీరు, విద్యుత్, వైద్యారోగ్యం వంటి శాఖల సమన్వయం అత్యవసరం.
రైతాంగాన్ని ఆదుకోవాలి : రాజకీయ పార్టీలు
ఎల్నినో ప్రభావంతో పంట నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కరువు మండలాల వారీగా నిధులను కేటాయించాలని అఖిలపక్ష సమావేశంలో పార్టీలు కోరాయి. ఎకరాకు రూ.25 వేల చొప్పున 25 లక్షల ఎకరాలకు పరిహారమివ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పూర్తిస్థాయి సర్వే నిర్వహించి మిగిలిన మండలాలనూ కరువు జాబితాలో చేర్చాలని సీపీఐ(ఎం) కోరింది. వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50 వేలు, ఇతర పంటలకు రూ.30 వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఎకరాకు రూ.15 వేలివ్వాలని బీజేపీ, నీటి కొరత రాకుండా కరెంటు, కష్టాలు తలెత్తకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఎంఐఎం కోరాయి. పత్తి, మిర్చికి ఎకరాకు రూ.50 వేలు, వరికి ఎకరాకు రూ.30 వేలు, ఇతర పంటలకు రూ.20 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని సీపీఐ సూచించింది. పంట నష్టంపై సమగ్ర నివేదిక రూపొందించి కేంద్ర సాయం కోరాలని టీజేఎస్ కోరింది.
75:25 నిష్పత్తిలో నిధులు
రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డీఆర్ఎఫ్) నిధుల్లో కేంద్రం 75 శాతం, రాష్ట్రం 25 శాతం సమకూర్చాలి. ఈ నిష్పత్తి ప్రకారం తెలంగాణకు 2026–27లో రూ.536 కోట్ల వార్షిక కేటాయింపులో కేంద్రం వాటా సుమారు రూ.402 కోట్లు, రాష్ట్ర వాటా రూ.134 కోట్లు అవుతుంది. ఇవి వార్షిక కేటాయింపులు మాత్రమే. వాస్తవంగా విడుదలైన నిధులు కావు.
కేంద్ర సాయం అందకుంటే?
విపత్తు నిర్వహణ చట్టం–2005లోని సెక్షన్ 48(1)(ఎ) ప్రకారం ఎస్డీఆర్ఎఫ్ ఏర్పాటు చేశారు. సెక్షన్ 46 ప్రకారం జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) ఏర్పాటు చేశారు. విపత్తు తీవ్రత అధికంగా ఉండి, రాష్ట్ర ఎస్డీఆర్ఎఫ్ నిధులు సరిపోని సందర్భంలో ఎన్డీఆర్ఎఫ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అదనపు సాయం అందించవచ్చు. అయితే, ఇందుకు నిర్దేశిత ప్రక్రియ, నష్టం అంచనాలు, అనుమతులు అవసరం. కేంద్ర సాయం ఆలస్యమైతే తక్షణ ఉపశమన చర్యలకు రాష్ట్రం తన సొంత వనరులను వినియోగించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న లోటు బడ్జెట్లో రాష్ర్టానికి ఇది గడ్డుకాలమే!






కామెంట్లు (0)