నవతెలంగాణ - హైదరాబాద్ : సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ యూసుఫ్ అలీ మృతి చెందారు. నగరంలోని మెహదీపట్నానికి చెందిన ఆయన కుటుంబ సమేతంగా ఉమ్రా యాత్రకు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. శనివారం జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన యూసుఫ్ అలీ.. రియాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనలో ఆయన ఇద్దరు కుమారులు, అత్త కూడా గాయపడ్డారు. ఒక కుమారుడికి మోకాలికి శస్త్రచికిత్స చేయగా, మరో కుమారుడు కాలి వేళ్లను కోల్పోయినట్లు సమాచారం.
తలకు గాయాలైన అత్త ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. యూసుఫ్ అలీ భార్య, కుమార్తె క్షేమంగా ఉన్నారు. వీరంతా మదీనా వెళ్లేందుకు విమానాశ్రయంలోని చెక్-ఇన్ కియోస్క్ వద్ద వేచి ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. వారికి తక్షణ సహాయం అందించాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌ను కోరారు. దీనిపై స్పందించిన జైశంకర్.. యూసుఫ్ అలీ మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.






కామెంట్‌లు (0)