నవతెలంగాణ - హైదరాబాద్ : కేరళ రాజధాని తిరువనంతపురంలోని యూనివర్సిటీ హాస్టల్లో విద్యార్థులపై జరిగిన దాడికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేత, మాజీ సీఎం పినరయి విజయన్ డిమాండ్ చేశారు. పోలీసుల తీరు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో విద్యార్థులను అణచివేస్తున్న తరహా పరిస్థితులు కేరళలో తలెత్తకూడదని అన్నారు. ఈ ఘటనపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.
యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు హాస్టల్లోకి నిప్పంటించిన కర్రలు, సీసాలు విసిరారని విజయన్ ఆరోపించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో విద్యార్థులు కేకలు వేయడం దాడికి ఎలా కారణమవుతుందని ప్రశ్నించారు. నిరసన ప్రదర్శనను హాస్టల్ ఎదుట నుంచే ప్రారంభించడం వెనుక ముందస్తు ప్రణాళిక ఉందని ఆరోపించారు.
యూత్ కాంగ్రెస్ కార్యకర్తల దాడి అనంతరం పోలీసులు హాస్టల్లోకి ప్రవేశించి విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల తలలను లక్ష్యంగా చేసుకుని కొట్టారని, వేణు, శ్రీకుమార్ అనే విద్యార్థుల తలలకు గాయాలయ్యాయని తెలిపారు. వైష్ణవి అనే విద్యార్థినికి కంటికి గాయమైందని చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్‌ను కూడా అడ్డుకున్నారని, జనరల్ ఆసుపత్రి పరిసరాల్లోనూ దాడులు జరిగాయని విజయన్ ఆరోపించారు. ఈ ఘటనకు కంటోన్మెంట్ ఎస్ఐ, సీఐ బాధ్యత వహించాలని అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఇంటికి వెళ్లి తుపాకీ చూపిస్తూ బెదిరించారని ఆరోపించారు.
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ విద్యార్థి, యువజన సంఘాల కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని విజయన్ పేర్కొన్నారు. అడూరులో డీవైఎఫ్ఐ నైట్ మార్చ్‌పై దాడి జరిగిందని, పాలక్కాడ్, కుట్ట్యాడి ప్రాంతాల్లోనూ కార్యకర్తలపై పోలీసులు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు.
మరోవైపు, తిరువనంతపురంలోని డీసీసీ కార్యాలయంపై సంఘ్ పరివార్ కార్యకర్తలు దాడి చేయడం, మంత్రిని అడ్డుకోవడం వంటి ఘటనల్లో కఠిన చర్యలు తీసుకోలేదని విజయన్ విమర్శించారు. సంఘ్ పరివార్ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.






కామెంట్లు (0)