అమెరికాకు సవాలు విసురుతున్న ఓపెన్ మోడల్స్
వాషింగ్టన్ : గడచిన ఏడాది కాలంలో కృత్రిమ మేధ (ఏఐ)లో చైనా సాధించిన వేగవంతమైన పురోగతిని గమనిస్తే ఆ రంగం అమెరికాను అనతికాలంలోనే దాటిపోగలదనే వాస్తవాన్ని చాటిచెప్పింది. తాము ఏఐలో చైనా కంటే ఎంతో ముందున్నామని, కృత్రిమ మేధలో ఎవరు గెలిస్తే వారే విజేతలని ట్రంప్ ఈ నెల ప్రారంభంలో చెప్పారు. సాంకేతికతలో అమెరికా - చైనా మధ్య కొనసాగుతున్న పోటీ తీవ్రతకు ఆయన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఏఐలో అమెరికాదే స్పష్టమైన ఆధిక్యత. దానిని ఆసరాగా చేసుకొని ప్రపంచ దేశాలను ఏదో ఒక పక్షాన్ని ఎంచుకొనేలా అమెరికా ఒత్తిడి చేస్తోంది. అయితే చైనా దార్శనికత అనేక దేశాలను ఆకర్షిస్తోంది. అత్యాధునిక ఏఐ నమూనాలలో అమెరికా కంటే చైనా వెనుకబడి ఉన్నప్పటికీ ఆ అంతరాన్ని వేగంగా కుదిస్తూ అందరికీ అందుబాటులో ఉండేలా, తక్కువ ఖర్చుతో కూడిన పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తోంది.
పోటాపోటీ కూటములు
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ జూలైలో ‘ప్రపంచ ఏఐ సహకార సంస్థ’ను ప్రారంభించారు. ఏఐ సరఫరా వ్యవస్థ కోసం చైనాపై ఆధారపడడాన్ని తగ్గించడానికి గత సంవత్సరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన ‘పాక్స్ సిలికా’కు ఇది పోటీ కూటమి. పాక్స్ సిలికా ఒప్పందంపై రెండు డజన్లకు పైగా దేశాలు, ఈయూ సంతకాలు చేయగా జిన్‌పింగ్ తన ప్రత్యామ్నాయ కూటమిలో రష్యా, ఇండొనేషియా, పాకిస్తాన్ సహా 29 దేశాలను చేర్చుకున్నారు.
జిన్‌పింగ్ ముందుకు తెచ్చిన ఓపెన్ మోడల్స్... ఆంత్రోపిక్, ఓపెన్ ఏఐ వంటి అమెరికా సంస్థలకు భారీ రుసుములు చెల్లించాల్సిన అవసరం లేకుండా వినియోగదారులు స్వేచ్ఛగా డౌన్లోడ్ చేసుకోవడానికి అనుమతిస్తాయి. గ్లోబల్ సౌత్‌లోని డెవలపర్లకు డీప్‌సీక్, మూన్‌షాట్ వంటి చౌకైన చైనా మోడల్స్ ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. అమెరికా ఎగుమతి నియంత్రణల కారణంగా చైనా డెవలపర్లు ఓపెన్ మోడల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ట్రంప్, జిన్‌పింగ్ మధ్య వాషింగ్టన్లో జరిగిన శిఖరాగ్ర సమావేశం ఏఐ విషయంలో పెద్దగా పురోగతిని సాధించలేదు.
పెరుగుతున్న చైనా వినియోగదారులు
డీప్‌సీక్ నేతృత్వంలో ఒక ఏడాది కాలంలో చైనా మోడల్స్ ప్రపంచవ్యాప్త వినియోగం పదిహేను శాతం కంటే తక్కువ నుంచి గత వారం యాభై నాలుగు శాతం కంటే ఎక్కువకు అనూహ్యంగా పెరిగింది. ఇప్పుడు అనేక అమెరికా సంస్థలు కూడా చైనా నమూనాలను స్వీకరించాయి. తక్కువ ఖర్చుతో, ఎక్కువ సౌలభ్యం పొందడమే దీనికి కారణం. చైనా ఏఐ ఇప్పటికే అందుబాటులో ఉన్న టెలికం, క్లౌడ్, హార్డ్‌వేర్ నెట్‌వర్క్‌ల ద్వారా విస్తరించగలదు. అభివృద్ధి చెందిన మార్కెట్లలో చైనా కంపెనీలకు పంపిణీ వ్యవస్థలు ఉన్నాయి. ఏఐ రేసులో అమెరికా లాభాలు ఆర్జిస్తుంటే చైనా వినియోగదారుల సంఖ్యను పెంచుకుంటోంది.







కామెంట్లు (0)