ఏప్రిల్–ఆగస్టులో చమురు బిల్లు 48 శాతం పెరుగుదల..
ఐదు నెలల్లోనే 74.8 బిలియన్ డాలర్ల వ్యయం
న్యూఢిల్లీ: అమెరికా యుద్ధోన్మాదంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణలు చమురు ధరలకు ఆజ్యం పోస్తోన్నాయి. దీంతో భారత్‌కు ముడి చమురు దిగుమతి బిల్లు తడిసిమోపెడు అవుతోంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పిపిఎసి) గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 ఏప్రిల్–ఆగస్టు మధ్య కాలంలో ముడిచమురు దిగుమతుల కోసం భారత్ ఏకంగా 74.8 బిలియన్ డాలర్లు ( దాదాపు రూ.7 లక్షల కోట్లకు పైగా) ఖర్చు చేసింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే దిగుమతి బిల్లు ఏకంగా 48.4 శాతం పెరిగింది. అయితే దిగుమతి పరిమాణం మాత్రం 0.4 శాతం తగ్గడం గమనార్హం. గతేడాది ఏప్రిల్–ఆగస్టులో భారత్ 101.1 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడిచమురును దిగుమతి చేసుకోగా, ఈసారి 100.7 మిలియన్ మెట్రిక్ టన్నులకు తగ్గింది. అయినప్పటికీ దిగుమతి బిల్లు 24.4 బిలియన్ డాలర్లు అదనంగా ఎగిసింది. దీంతో విదేశీ మారక ద్రవ్యం భారీగా చెల్లించుకోవాల్సి వస్తోంది.
బ్యారెల్ 124 డాలర్లకు చేరువ
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రధానంగా చమురు సరఫరా, రవాణాపై ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. సౌదీ అరేబియాలోని ఈస్ట్–వెస్ట్ పైప్‌లైన్‌పై దాడులు, ఎర్రసముద్రం మీదుగా చమురు రవాణాకు ఎదురవుతున్న ఆటంకాలు, హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ఘర్షణలు అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను ఒత్తిడిలోకి నెట్టాయి. ప్రాంతీయ చమురు ఎగుమతులకు ఆటంకాలు కొనసాగితే ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని
ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎజెన్సీ (ఐఇఎ) హెచ్చరించింది. సెప్టెంబర్‌లో ధరల దూకుడు మరింత ఆందోళన కలిగిస్తోంది. సెప్టెంబర్ 2న బ్యారెల్‌కు 99.35 డాలర్లుగా ఉన్న ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధర సెప్టెంబర్ 18 నాటికి 123.86 డాలర్లకు ఎగబాకింది. ముడిచమురు అవసరాల్లో 88.1 శాతం దిగుమతుల పైనే ఆధారపడుతోంది. ఇదే సమయంలో దేశీయ ముడిచమురు ఉత్పత్తి 11.9 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 11.4 మిలియన్ మెట్రిక్ టన్నులకు తగ్గింది.
వాణిజ్య లోటు గుబులు..
చమురు ధరల మంట ఇంధన దిగుమతులకే పరిమితం కాలేదు. ఏప్రిల్–ఆగస్టు మధ్య భారత నికర చమురు, గ్యాస్ దిగుమతి బిల్లు 34.7 శాతం పెరిగి 66.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మొత్తం సరుకుల దిగుమతుల్లో పెట్రోలియం ఉత్పత్తుల వాటా కూడా 19.5 శాతం నుంచి 22.5 శాతానికి పెరిగింది. ఫలితంగా దేశ వాణిజ్య లోటు గతేడాది ఇదే కాలంలోని 123.9 బిలియన్ డాలర్ల నుంచి 147.1 బిలియన్ డాలర్లకు పెరిగింది.
సామాన్యుడిపైనా భారం
ముడిచమురు ధరలు ఎక్కువ కాలం ఇదే స్థాయిలో కొనసాగితే దిగుమతి వ్యయం మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇది వాణిజ్య లోటుతో పాటు కరెంట్ అకౌంట్ లోటుపైనా ఒత్తిడి పెంచుతుంది. ఇదే క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలు, రవాణా వ్యయాలు, పరిశ్రమల ఉత్పత్తి ఖర్చులు పెరిగితే దాని ప్రభావం ఇతర వస్తువులు, సేవల ధరలపైనా తీవ్రంగా పడనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతిమంగా ఈ ధరలు ప్రజల కొనుగోళు శక్తిని హరించనున్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపనుంది.







కామెంట్లు (0)