Magazines

కుల వివక్ష లేని సమాజమే లక్ష్యం 

1 గంట క్రితం

KVPS
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 2 నిమిషాల చదవడం

కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ 

ఘనంగా కెవిపిఎస్ ఆవిర్భావ దినోత్సవం 

నవతెలంగాణ-ఆసిఫాబాద్ 

కుల వివక్ష లేని సమాజమే లక్ష్యంగా తమ సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ అన్నారు. కెవిపిఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కోట శ్రీనివాస్ తో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఇంకా అనేక ప్రాంతాల్లో కుల వివక్షత కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంఘం పోరాటం ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 62 రకాల కుల వివక్షలు వెలుగులోకి వచ్చాయని గుర్తు చేశారు.


వీటికి వ్యతిరేకంగా అసెంబ్లీలో జరిగిన చర్చ ఆధారంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు అవుతున్నట్లు తెలిపారు. తాము చేస్తున్న పోరాటానికి ఇంకా ఫలితం రాలేదని దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ప్రతిరోజు కుల వివక్ష జరగడం బాధాకరమన్నారు. ప్రభుత్వాలు కూడా వీటిపై కఠినంగా వ్యవహరించినప్పుడే కుల వివక్ష రహిత సమాజం సాధ్యమవుతుందని తెలిపారు. సంక్షేమ హాస్టల్లలో వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు కుల వివక్ష మరోవైపు పేదరికం దళిత బడుగు బలహీన వర్గాల శాపంగా మారాయని అన్నారు.


రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా కాలరాసేలా ప్రస్తుత ప్రభుత్వాలు వ్యవహరించడం బాధాకరమన్నారు. ప్రభుత్వాల ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే తమ ప్రథమ కర్తవ్యం అని ఆ దిశగా నిరంతరం పోరాటం చేస్తామని పునరుద్ఘాటించారు. ప్రభుత్వాలు కేటాయిస్తున్న బడ్జెట్ క్షేత్రస్థాయిలో ఖర్చు కావడం లేదని దీనితో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు గిరిజనుల, దళితుల, బడుగు బలహీన వర్గాల జీవితాలు ఉన్నాయన్నారు. వీటిపై సమిష్టిగా పోరాటం చేసినప్పుడే పరిస్థితులు మారుతాయని అభిప్రాయపడ్డారు. కుల మతాల పేరుతో జరుగుతున్న మారణ హోమాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కార్తీక్, జిల్లా అధ్యక్షుడు టీకానంద్, కార్యదర్శి రాజ్ కుమార్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దుర్గం పవన్ కుమార్, జిల్లా నాయకులు పస్తం ఆనంద్ రావు, ఇప్ప ప్రసాద్, శేఖర్, భాస్కర్, ప్రశాంత్, సామిల్, నితిన్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్