- నల్గొండలో నవంబర్ 15 నుంచి 18 వరకు జరగనున్న మహాసభలు
- సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి పిలుపు
నవతెలంగాణ-సత్తుపల్లి
నల్గొండ పట్టణంలో నవంబర్ 15, 16, 17, 18 తేదీలలో నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని, అలాగే 15వ తేదీన జరిగే భారీ బహిరంగ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం సత్తుపల్లిలోని రావి వీర వెంకయ్య (ప్రజాసంఘాల) భవనంలో పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎలగం కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో సత్యనారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలోని రైతాంగం ఎదుర్కొంటున్న అనేక తీవ్రమైన సమస్యలపై ఈ మహాసభల్లో ప్రధానంగా చర్చ జరుగుతుందని ఆయన చెప్పారు.
పంటలకు గిట్టుబాటు ధరల కల్పన, పెరుగుతున్న రైతు రుణభారం తగ్గించడం, సాగునీటి పారుదల, ఎరువులు, విత్తనాల కొరత నివారించడం, అలాగే రైతుల భూములకు రక్షణ కల్పించడం వంటి తదితర ముఖ్యాంశాలపై మహాసభల్లో జాతీయ నాయకులు విస్తృతంగా చర్చించడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన భవిష్యత్ రైతాంగ పోరాటాలకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణను రూపొందిస్తారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రైతుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని, వారికి న్యాయం జరిగేలా ప్రజానుకూల విధానాలను అమలు చేయాలని సత్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ రైతు సంఘం గత కొన్నేళ్లుగా పట్టుదలతో ఉద్యమం చేస్తోందని గుర్తుచేశారు.
సాగునీటి కొరత, నాగార్జునసాగర్ జలాల విడుదల, కాలువల మరమ్మతులపై రైతులకు నిరంతరం తోడ్పాటునందిస్తూ పోరాడుతున్నామని తెలిపారు. మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న అవరోధాలను తొలగించి, రైతులకు బకాయిల విడుదలలో వేగం పెంచేందుకు ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నామన్నారు. పామాయిల్, చెరకు పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించాలని కోరారు. దాంతోపాటు బ్యాంకుల రుణాల మంజూరు, రుణమాఫీ సమస్యలపై నిత్యం రైతాంగానికి బాసటగా నిలిచే తెలంగాణ రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్, మండల కార్యదర్శి జాజిరి జ్యోతి, నాయకులు వేపులపాటి కుమారస్వామి, అయినంపూడి సునందరావు, కువ్వారపు లక్ష్మణరావు, ఎలగం రాములు, తడికమళ్ల రామకృష్ణ, బండి వేలాద్రి, కావూరి వెంకటేశ్వరరావు, ముత్తిని శ్రీను, కొలికపోగు రత్తయ్య పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)