- దిగుమతి సుంకం పునఃసమీక్షించాలి
- దీర్ఘకాలిక భరోసాకు నేషనల్ ఆయిల్‌పామ్ డెవలప్‌మెంట్ బోర్డు అవసరం
- ఆయిల్‌ఫెడ్ విశ్రాంత ఉద్యోగి కాముని అశోక్ ప్రతిపాదనలు
నవతెలంగాణ - అశ్వారావుపేట : కేంద్ర ప్రభుత్వం సీపీఓ (క్రూడ్ పామాయిల్ - ముడి పామాయిల్ ) పై దిగుమతి సుంకాన్ని 16.5 శాతం నుంచి 11 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఆయిల్‌పామ్ రంగంలో నెలకొన్న గందరగోళానికి శాస్త్రీయ, సాంకేతిక పరిష్కారాలే శాశ్వత మార్గమని ఆయిల్‌ఫెడ్ విశ్రాంత ఉద్యోగి కాముని అశోక్ అభిప్రాయపడ్డారు. రైతులు, పరిశ్రమలు, ప్రభుత్వాల మధ్య ఘర్షణకు బదులుగా సమన్వయంతో కూడిన విధానమే ఆయిల్ ఫాం రంగాన్ని ముందుకు తీసుకెళ్తుందని ఆయన పేర్కొన్నారు.
సూర్యాపేట సదస్సు తీర్మానాలు, నాలుగు స్తంభాల ప్రణాళిక, కేంద్ర దిగుమతి సుంకం నిర్ణయం, ఎన్ఎంఈఓ - ఓపీ (నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్ - ఆయిల్ ఫాం) పథకం, శాశ్వత ఆయిల్‌పామ్ డెవలప్‌మెంట్ బోర్డు అంశాలపై ప్రజల్లో నెలకొన్న సందిగ్ధతను తొలగించే ఉద్దేశంతో తన సూచనలను వెల్లడించారు.
దిగుమతి సుంకం తగ్గింపుతో రైతుల్లో అనిశ్చితి:
140 కోట్ల ప్రజల ఆహార భద్రత, వంటనూనె ధరల నియంత్రణ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించినప్పటికీ, ఆయిల్‌పామ్ రైతులకు ఇది ఆందోళన కలిగించే అంశమని అశోక్ పేర్కొన్నారు. తెలంగాణలో 3.20 లక్షల ఎకరాల్లో సుమారు 88 వేల మంది రైతులు, దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల ఎకరాల్లో నాలుగు లక్షల మంది రైతులు ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారని గుర్తు చేశారు.ఆయిల్‌పామ్ 25 నుంచి 30 ఏళ్లపాటు కొనసాగే దీర్ఘకాలిక పెట్టుబడి పంట కావడంతో విధానపరమైన స్థిరత్వం అత్యవసరమని చెప్పారు.
నాలుగు స్తంభాలకు శాస్త్రీయ రూపకల్పన:
రైతు సంఘాలు ప్రతిపాదించిన నాలుగు స్తంభాల లక్ష్యాలను అమలు చేయాలంటే వాటిని దశలవారీగా అమలు చేసే విధానం అవసరమని సూచించారు.
* OER (నూనె దిగుబడి శాతం): వెంటనే 20 శాతానికి చేరడం కష్టమని, మూడు సంవత్సరాల గ్రేడెడ్ లక్ష్యంతో 18 శాతం దాటిన రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు.
* ధర పంపిణీ: నేరుగా 80:20 నిష్పత్తికి బదులుగా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, ధరలు పెరిగినప్పుడు రైతు వాటా పెంచాలని ప్రతిపాదించారు.
* ఎఫ్ ఎఫ్ బీ (ప్రెష్ ఫ్రూట్ బంచ్ - తాజా పామాయిల్ గెలలు)ధర: టన్నుకు రూ.25 వేల స్థిర మద్దతు ధరకు బదులుగా సీపీఓ ల్యాండెడ్ కాస్ట్‌కు అనుసంధానించిన డైనమిక్ ధర విధానం అమలు చేయాలని సూచించారు.
* దిగుమతి సుంకం: స్థిర శాతం కాకుండా దేశీయ ఉత్పత్తి ఆధారంగా స్లాబ్ విధానం అనుసరించాలని అభిప్రాయపడ్డారు.
శాశ్వత బోర్డు అవసరం:
ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్ఎంఈఓ - ఓపీ పథకం 2025 - 26తో ముగియనుండగా, 2021 - 22 లో నాటిన మొక్కలు 2029 - 30 లో గరిష్ట దిగుబడికి చేరుతాయని ఆయన గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో రబ్బర్, టీ, కొబ్బరి బోర్డుల తరహాలో పార్లమెంట్ చట్టంతో నేషనల్ ఆయిల్‌పామ్ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ బోర్డులో రైతులు, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలకు చట్టబద్ధ ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు నిర్వహణ సాయం,వీజీపీ ( వయబులిటీ గ్యాప్ పేమెంట్) కు చట్టబద్ధ హామీ ఉండాలని ప్రతిపాదించారు.
మూడు దశల్లో కార్యాచరణ:
తక్షణ, మధ్యకాలిక, దీర్ఘకాలిక చర్యలతో ఆయిల్‌పామ్ రంగాన్ని బలోపేతం చేయాలని సూచించారు.
* 0-3 నెలల్లో: రైతులకు అదనపు మద్దతు కల్పించడం, కేంద్రం దిగుమతి సుంకం నిర్ణయాన్ని పునఃసమీక్షించడం.
* 2026 - 2030: ఎన్ఎంఈఓ - ఓపీ 2030 - 31 వరకు పొడిగించడం, బ్లాక్‌చైన్ ఆధారిత ట్రేసబిలిటీ వ్యవస్థను ప్రవేశపెట్టడం, తెలంగాణ - ఏపీలో పైలట్ ప్రాజెక్టులు చేపట్టడం.
* 2030 తర్వాత: పార్లమెంట్ చట్టంతో శాశ్వత ఆయిల్‌పామ్ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేసి,ఐసీఏఆర్ - ఐఐఓపీఆర్,సీఏసీపీ,ఎన్ఐటీఐ ఆయోగ ల శాస్త్రీయ, ఆర్థిక మూల్యాంకనంతో విధానాలను రూపొందించడం.
సమన్వయంతోనే పామాయిల్ రంగాభివృద్ధి:
దేశ వంటనూనె అవసరాల్లో గణనీయమైన భాగం ఇప్పటికీ దిగుమతులపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో, దేశీయ ఆయిల్‌పామ్ రైతులకు స్థిరమైన భరోసా కల్పించడం ఆహార భద్రతకు కీలకమని అశోక్ పేర్కొన్నారు. రైతు, ప్రభుత్వం, పరిశ్రమలు కలిసి పనిచేస్తేనే ఆయిల్‌పామ్ రంగం స్థిరంగా అభివృద్ధి చెందుతుందని, "ఘర్షణ వద్దు... సమన్వయం ముద్దు" అనే సందేశంతో తన సూచనలను ముగించారు.






కామెంట్‌లు (0)