Magazines

సమస్యలు సృష్టిస్తున్న సామ్రాజ్యవాద విష సంస్కృతి

1 గంట క్రితం

The toxic culture of imperialism that is creating problems.
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 2 నిమిషాల చదవడం

విమలక్క ‘ప్రజా కళాజాతర’లో వక్తలు

ఆర్టీసీ కల్యాణ మండపంలో ప్రారంభమైన మూడ్రోజుల కార్యక్రమం

50ఏండ్ల ప్రజా సాంస్కృతికోద్యమ ప్రస్థానం పుస్తకం ఆవిష్కరణ


​నవతెలంగాణ-ముషీరాబాద్
సామ్రాజ్యవాద విష సంస్కృతి అనేక సమస్యలను సృష్టిస్తోందని పలువురు వక్తలు అన్నారు. హైదరాబాద్‌ ఆర్టీసి కల్యాణ మండపంలో అరుణోదయ విమలక్క 50సంవత్సరాల ప్రజా సాంస్కృతిక ప్రయాణం పేరిట మూడ్రోజుల పాటు జరుగనున్న 50 గంటల ‘ప్రజాకళా జాతర’ కార్యక్రమం ‌శనివారం ప్రారంభమైంది. సభకు ముందు సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి ఆర్టీసీ కళాభవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి కళ్యాణమండపం ప్రాంగణంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా 50 ఏండ్ల ప్రజా సాంస్కృతికోద్యమ ప్రస్థానం పుస్తకాన్ని ప్రముఖ రచయిత జూపాక సుభద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ భాషాసింగ్ (న్యూఢిల్లీ) మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమ కళాకారులపై అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. విమలక్క విప్లవోద్యమానికి, వామపక్ష పోరాటానికి ఒక ప్రతీక అని చెప్పారు. తన పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన గొప్ప కళాకారిణి అని, చిట్యాల ఐలమ్మ లాంటి వారు ఇంకా ఉన్నారని చెప్పడానికి విమలక్క ఒక్క నిదర్శనం అని తెలిపారు. ప్రజల పక్షాన నిజమైన చైతన్య వారధిగా ఆమె తన గళం ద్వారా నిలబడుతున్నారన్నారు. ప్రస్తుతం రాజ్యాంగపరమైన దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ చేసిన అవకతవకలపై పెద్దఎత్తున నిరసనలు వస్తున్నాయన్నారు.

దేశంలో మొట్టమొదటిసారి ఒక ఎన్నికల ప్రధాన అధికారి రాజీనామా చేయాలని డిమాండ్ వస్తోందని తెలిపారు. ప్రధాని ఒక హాస్యాస్పద స్థితిలో ఉన్నారని విమర్శించారు. ప్రజల పక్షాన ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న విమలక్కను అభినందించారు. సినీ దర్శకులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా సంస్కృతి వైపు నిలవడం కష్టంగా మారిందన్నారు. ప్రజా సంస్కృతి చలనశీలమైనదని, ప్రజల సమస్యలను ఎత్తిచూపుతూ నిజం వైపు నిలబడుతుందని చెప్పారు. 50 ఏండ్లుగా విమలక్క ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల కోసం పోరాడుతున్నారని, ఈ క్రమంలో అనేక ఆటంకాలు, నిర్బంధాలను ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రజా సంస్కృతి వైపు నిలిచే కళాకారులపై గతం నుంచే వివిధ రకాల ఆంక్షలు, నిర్బంధాలు కొనసాగుతున్నాయన్నారు. ఆధిపత్య భావజాలం నిజాలను దాచిపెట్టి అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జానపద కళారూపాలు ప్రజల గుండెచప్పుడని, వాటిని ఆధునీకరించి ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రొఫెసర్ కట్టా భగవంత్‌‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విమలక్క, ప్రజా కళాజాతర ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, గౌరవ చైర్‌‌పర్సన్ ప్రొఫెసర్ చక్రధర్రావు, అధ్యక్షులు ప్రొఫెసర్ జె.లక్ష్మి, ఏకే ప్రభాకర్, ప్రొఫెసర్ వినయ్ బాబు, పోతుల రమేష్, మల్సూర్, సినీ దర్శకులు ఉమామహేశ్వర్రావు, ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్రావు, అంభిక, సుద్దాల శోక్ తేజా, గ్రంథాలయ చైర్మెన్ రియాజ్, సినీ దర్శకులు శంకర్, ప్రొఫెసర్ శాంతాసిన్హా, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మెన్ మారం జగదీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విమలక్క 50 ఏండ్ల ప్రస్థానంపై ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీ ఆకట్టుకుంది. ప్రజా కళాకారులు ప్రదర్శించిన వివిధ కళారూపాలు సభికులను రంజింపజేశాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్