గతంలో చేదు అనుభవమే
2004 ఉప ఎన్నికను గుర్తు చేస్తున్న విశ్లేషకులు
ఇప్పుడు పోటీపై తర్జనభర్జన
ఎమ్మెల్సీ సీటుపైనా కన్ను?
తద్వారా మంత్రి పదవీ దక్కించుకోవచ్చన్న ఆశ
బి.వి.ఎన్.పద్మరాజు
ఎమ్మెల్యేగా అనర్హత వేటుపడ్డ దానం నాగేందర్ భవితవ్యం ఏమిటి? ఇప్పుడిదే అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నది. ఇందుకు సంబంధించి హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థించిన నేపథ్యంలో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి విదితమే. అధికార కాంగ్రెస్ కూడా ఆయనకే టిక్కెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. తాము చేసిన విజ్ఞప్తి మేరకు హస్తం పార్టీ తరపున సికింద్రాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్‌ను.. ప్రస్తుత క్లిష్ల పరిస్థితుల్లో ఎలాగైనా ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున ఆయన్నే బరిలోకి దింపుతామంటూ సీఎం తన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. దీంతో ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థిగా నాగేందరే పోటీ చేయనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఈ ఉప ఎన్నిక దానంకు విజయాన్ని చేకూరుస్తుందా? లేదా? ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పెద్దల వ్యూహాలు ఫలిస్తాయా? లేదా? అన్నది కూడా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కానీ గత అనుభవాలు మాత్రం దానంకు అనుకూలంగా లేకపోవటం గమనార్హం. 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం.. ఆ రెండు ఎన్నికల్లోనూ విజయం సాధించారు. కానీ అప్పుడు టీడీపీ హవాతో ఆయన ప్రతిపక్షం (కాంగ్రెస్)లోనే ఉండి పోవాల్సి వచ్చింది. 2004 శాసనభ ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. పార్టీ అంతర్గత కారణాల రీత్యా ఆసిఫ్ నగర్ సీటును దానంకు
కేటాయించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోలేదు. దీంతో ఆయన చివరి నిమిషంలో పార్టీ మారి, టీడీపీ నుంచి పోటీ చేశారు. అప్పుడూ ఆయన గెలిచారు. కాకపోతే ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో విస్తుబోయిన దానం... ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రత్యేకంగా కలిశారు.
తాను కాంగ్రెస్ కండువా కప్పుకుంటానంటూ ప్రతిపాదించారు. దానికి తిరస్కరించిన వైఎస్... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలో పోటీ చేయాలని సూచించారు. అలా గెలిచి వస్తే... హైదరాబాద్ నుంచి మంత్రివర్గంలోకి తీసుకుంటానంటూ హామీనిచ్చారు. ఆ హామీతో ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన దానం... ఉప ఎన్నిక బరిలోకి దిగారు. కానీ ఆయన అంచనాలు తారుమారయ్యాయి. ఆ ఉప ఎన్నికలో ఎంఐఎం అభ్యర్థి మోజంఖాన్ చేతిలో నాగేందర్ 2,100 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. దాంతో మంత్రి పదవి సంగతి అటుంచితే.. ఉన్న ఎమ్మెల్యే పదవిని కూడా ఆయన కోల్పోవాల్సి వచ్చింది. బహుశా ఈ అనుభవం, తనకు ఉప ఎన్నిక అచ్చిరాదనే భావనతో కాబోలు... తొలుత హైకోర్టు తీర్పును స్వాగతిస్తూనే, తాను సుప్రీంకోర్టును ఆశ్రయించబోనంటూ ప్రకటించిన దానం, ఆ మరుసటి రోజే మనసు మార్చుకుని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడా చుక్కెదురు కావటంతో ఇప్పుడు అనివార్యంగా ఉప ఎన్నిక బరిలోకి దిగాల్సి వస్తోంది. అయితే 2004 ఉప ఎన్నిక ఓటమి దృష్ట్యా... ఇప్పుడు మళ్లీ ఖైరతాబాద్ నుంచి పోటీ చేయాలా? వద్దా? అనే మీమాంసలో ఆయన ఉన్నట్టు దానం సన్నిహితులు చెబుతున్నారు. అలాకాకుండా త్వరలోనే జరగబోయే నల్లగొండ, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గోదాలోకి దిగితే ఎలా ఉంటుందంటూ ఆయన అంచనాలు కూడా వేస్తున్నట్టు సమాచారం. అదీ సాధ్యం కాకపోతే సీఎంను, కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకుని, తద్వారా మంత్రి పదవిని పొందితే ఎలా ఉంటుందనే ఆలోచనలో కూడా దానం ఉన్నట్టు తెలిసింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఖైరతాబాద్ రాజకీయం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.







కామెంట్లు (0)